కంగోల,కోషఫల అని సంస్కృతంలోను, Pipercubea అని ఇంగ్లీషులోను పిలువబడే చలువ మిరియాలు మామూలు మిరియాల వలె ఉండి గింజలకు తోక ఉంటుంది. వీటినే Tiled Pepper or cubebs అని కూడా పిలుస్తారు.
గుణములు
మిరియాలకంటె కొంచెం సువాసన కలిగి ఉంటాయి. కారము, చేదు గల రుచిని కలిగి ఉంటాయి. ఉష్ణవీర్యము కలిగినవి. వాత కఫ దోషములను పోగొడతాయి. నోటియొక్క అరుచిని పోగొడతాయి. ముఖ రోగములను తగ్గిస్తాయి. రుచిప్రదమైనవి. గుండెకు మేలు చేస్తాయి. చలువ మిరియాల పండు గుండ్రముగా ఉంటుంది.
ఔషధములు
చలువమిరియాల కషాయము సేవించడం వల్ల మూత్రము సాఫీగా అవుతుంది. శగ గడ్డలు, శుక్లనష్టములను, మూలశంకలు, మూత్రకృఛ్రములను అరికట్టుటలో ఎంతో ఉపయోగపడతాయి. అయితే ఎక్కువ మోతాదులో సేవించరాదు. అలాచేస్తే పార్శ్వశూలలు పుడతాయని వస్తుగుణప్రకాశిక గ్రంథం వివరిస్తోంది.
ఆంత్రములయందు, గర్భాశయమునందు చురుకును పుట్టిస్తాయి. చలువ మిరియాలను నోటిలో వేసుకుని నములుతూ ఉంటే శ్వాసకాసలు(ఆస్థమా) తగ్గుతాయి. యోనిశూల, మంటలను తగ్గిస్తుంది. తీవ్రమైన జలుబు, ముక్కులో రక్తస్రావము, నాలుక మంట ఉన్నప్పుడు చలువ మిరియాల చూర్ణమును గొట్టముద్వారా ముక్కులో ఊదినట్లయితే తగ్గుతాయి. చలువమిరియాల తైలమును శగ, సవాయి, మూత్రాఘాతము వంటి వ్యాధులకు బాగా పనిచేస్తుంది. చలువమిరియాల తైలమును పన్నీరులో కలిపి తలకు మర్దనా చేసినట్లయితే తలనొప్పులే కాక సవాయి వలన కలిగిన శిరోవ్యాధులు కూడా ఉపశమిస్తాయి.