నిత్యం మనం తీసుకునే ఆహారంలో పచ్చళ్ళకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఎక్కువగా నిల్వ ఉండే పచ్చళ్ళను మనం వాడుతూ ఉంటాం. ఇలాంటి పచ్చళ్ళు కాకుండా ఔషధ విలువలు కలిగినవి, విటమిన్లు, ప్రొటీన్లు లభించే విధంగా కూడా మనం పచ్చళ్ళను తయారుచేసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలుగా ఉంటుంది. కాల్ఫియం, ఐరన్, మెగ్నీషియం శరీరానికి పుష్టిగా లభించే ఒక పచ్చడిని ఈ వీడియోయో లో చూసేద్దాం రండి.
బీరకాయ ఎంతో ఆరోగ్యకరమైన కూరగాయ. దీని కాయలోనే కాకుండా పొట్టులో కూడా ఎన్నో పోషక విలువలు ఉన్నాయి. ఫైబర్ తో పాటు విటమిన్ ఎ, విటమిన్ సి లు ఈ పొట్టులో దండిగా లభిస్తాయి. ఈ పొట్టుతో ఎటువంటి మసాలాలు జతచేయకుండా సంప్రదాయ పద్ధతిలో పచ్చడి చేసుకుని తింటే అధిక బరువు, గుండె, కాలేయ సమస్యలకు చెక్ పెట్టవచ్చు.
తయారీ విధానం చూద్దాం
ఒక అరకిలో లేత బీరకాయలు తీసుకుని శుభ్రంగా కడిగి పైపొట్టును పీలర్ తో జాగ్రత్తగా వేరు చేయాలి. ఆ పొట్టును చిన్న చిన్న ముక్కలుగా తరిగి ఉంచుకోండి.
వేరే పళ్ళెంలో పోపు సామాన్లుసిద్ధం చేసుకోవాలి. తగినన్ని ఆవాలు, మెంతులు, మినపప్పు, వెల్లుల్లి రేకలు, ఎండుమిర్చి, చింతపండు, తగినంత ఉప్పు, పసుపు, మీకు ఇష్టమైతే కాసింత ఇంగువను కూడా జోడించుకోవచ్చు.
స్టవ్ మీద మూకుడు పెట్టి దానిలో తగినంత నూనె వేసి వేడయ్యాక దానిలో మినపప్పు, ఆవాలు, మెంతులు, ఎండుమిర్చి వేసి దోరగా వేయించుకోవాలి. ఆ పోపును వేరుగా ప్లేటులోకి తీసుకోవాలి. తర్వాత అదే బాణలిలో మరికొంచెం నూనె వేసి మనం తరిగి ఉంచుకున్న బీరపొట్టు ముక్కలను వేసి చింతపండు, ఉప్పు, పసుపు, కొద్దిగా నీరు వేసి సన్నని సెగపై మూత పెట్టి పది నిముషాల పాటు మగ్గించాలి. దీనిలో ఇష్టమైతే కొంచెం తీపి కూడా చేర్చవచ్చు. మగ్గిన ముక్కలను స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి.
చల్లారిన తరువాత ముందుగా వేయించుకున్న పోపును ముందుగా మిక్సీపట్టాలి. దానిలో మగ్గిన బీరపొట్టు ముక్కలను వేసుకుని మరోసారి బరకగా మిక్సీ పట్టుకుంటే ఆరోగ్యకరమైన, ఔషధ విలువలు కలిగిన బీరపొట్టు పచ్చడి సిద్ధంగా ఉంటుంది. మీరూ ప్రయత్నించండి. ముఖ్యంగా పిల్లలకు ఈ సంప్రదాయ పచ్చళ్ళను అలవాటు చేయండి.