శిరీష, మృదుపుష్ప శుకప్రియ అని సంస్కృతంలో పిలువబడే దిరిసెన చెట్టు పెద్ద వృక్షజాతిలోనిది. Mimosa Sirissa అని ఇంగ్లీషులో దీనికి పేరు. దిరిసెన చెట్టు మ్రాను పటిష్టంగా ఉంటుంది. ఈ కర్రను వ్యవసాయ పనిముట్లకు ఎక్కువగా వినియోగిస్తారు. మ్రానులో చేవ నల్లగా విరుగుడుచేవ చెక్కలాగే ఉంటుంది. దీని ఆకులు, రెమ్మలు నిద్రగన్నేరు చెట్టు ఆకులను పోలి ఉంటాయి. ఇది చల్లని నీడనిచ్చే వృక్షము. దీని పువ్వు అంతా తుమ్మెదలతో నిండి ఉంటుంది. అతి మృదువైన కేసరములు కలిగిన పుష్పములు గుత్తులు గుత్తులుగా పూస్తాయి. పువ్వంతా తుమ్మెదలు, ఈగలు ముసిరి ఉంటాయి. అంగములు కోమలత్వమును వర్ణించేటప్పుడు కవులు ఈ దిరిసెన పుష్పములనే ఉపమానముగా చెపుతారు.
దిరిసెన చెట్టు గుణములు
దిరిసెన చెట్టు కాయలు ఇంచుమించు ఎనిమిది అంగుళాల పొడవు ఉంటాయి. మూడువేళ్ళ వెడల్పుగా ఉంటాయి. గింజలు గట్టిదనముగా చింతగింజల్లాగే ఉంటాయి. దీని పువ్వులు, కాయలు కూడా గుత్తులు గుత్తులుగానే ఉంటాయి.
ఈ చెట్టు గుడ్రనైన, మృదువైన పుష్పములతో నిండి ఉంటుంది. విషమును హరించే గుణము కలిగి ఉంటుంది. శీత వీర్యముకలిగి ఉంటుంది. రుచి చేదుగా ఉంటుంది. విషహర ప్రధాన ద్రవ్యము. ఇది త్రిదోషములను పోగొడుతుందని వస్తుగుణప్రకాశిక గ్రంథం తెలియచేస్తోంది. దిరిసెన పుష్పం కుష్ఠురోగములను, వ్రణములను పోగొడుతుంది. దురద, చర్మరోగములను, శ్వాసకాసలను హరిస్తుంది. విసర్పిని హరిస్తుంది.
కుష్ఠురోగములను మందు
దిరిసెన చెక్క మెత్తగా నూరి పైన లేపనము చేసినట్లయితే చతుర్విధములైన కుష్ఠులు హరిస్తాయి.
కఫ విసర్పికి
దిరిసెన పువ్వులు మెత్తగా నూరి నెయ్యి కలిపి పైన రాసినట్లయితే విసర్పులు హరిస్తాయి.
శ్వాస సమస్యలు
దిరిసెన పుష్పం రసములో పిప్పలి చూర్ణం, తేనె కలిపి సేవించినట్లయితే కఫ పిత్త సంబంధమైన శ్వాసలు తగ్గుతాయి.
పామువిషమునకు
దిరిసెన పుష్పము యొక్క రసములో తెల్లమిరియాలను నానబెట్టి, ఎండబెట్టి ఆ చూర్ణమును లోనికి పుచ్చుకున్నట్లయితే వెంటనే పాము విషములు దిగుతాయి.
చాతుర్థిక జ్వరమునకు
దిరిసెనపువ్వు రసములో పసుపు, మాని పసుపుల చూర్ణము కలిపి,దానిలో ఆవునెయ్యి కూడా చేర్చి సస్యము చేసినట్లయితే చాతుర్థిక జ్వరముహరిస్తుంది.
జంతు విషమునకు
దిరిసెన మాను చెక్కగంధము తీసి పైన పూసినట్లయితే తేలు, జెర్రి, కందిరీగ, ఎలుక, పాము మొదలగు విషములు దిగుతాయి.