సాల వృక్షము, సర్జ వృక్షము అనే పేర్లు కూడా కలిగిన ఏపి చెట్టు శాస్త్రీయనామం Shorea Robusta. ఈ ఏపి చెట్టునే ఇంగ్లీషులో The Sal Tree అని పిలుస్తారు. పెద్ద పెద్దఆకులు కలిగి ఉంటుంది. ఆకులకు బలమైన తొడిమలు ఉంటాయి. ఆకుపై ఈనె చారలు ఉంటాయి. మొగ్గ సంపెంగ మొగ్గలాగ ఉంటుంది. ఆకులు వేళాడబడి ఉండి ఆకు మధ్య నుండి జటలులా వేళాడి ఉంటాయి. ఈఏపి చెట్టులో గుఱ్ఱపు చెవి ఆకృతిలో ఉన్న ఆకులు కలిగినది, గొఱ్ఱె చెవి ఆకృతిలో ఉన్న ఆకులు కలిగినవి ఉంటాయి. ఇవి రెండూ ఒకే గుణము కలిగి ఉంటాయి.
గుణములు
వగరు రుచి కలిగి ఉంటుంది. అశ్వకర్ణ అనే జాతి చేదు రుచులు కలిగి ఉంటుంది. వేడి చేస్తుంది. విపాకమున కారపు రుచిగా మారుతుంది. స్నిగ్ధగుణము, వ్రణములను హరిస్తుంది. చెమటను పోగొడుతుంది. కఫమును, క్రిములను హరిస్తుంది. అండవృద్ధులు, చెముడు, యోని రోగములు, కర్ణ రోగములను పోగొడుతుంది. పిత్త రక్తమును పోగొడుతుంది. ఉరో రోగములు, స్ఫోటకములు, దురదలు శమింపచేస్తుంది. కుష్టురోగములు, విషమును హరిస్తుంది. క్షయరోగమును పోగొడుతుంది.
ఏపి పండు
తీపి రుచిగా ఉంటుంది. చలువచేస్తుంది. రూక్షగుణము కలిగినది. విపాకమున తీపి రుచియే కలిగి ఉంటుంది. శూలలు, కడుపు ఉబ్బరము, పైత్యము, తాపము, క్షయ హరిస్తుంది.
ఏపి బంక
ఏపి చెట్టునుండి తీసిన బంకనే ఏపిబంక అంటారు. దీనినే సర్జరసము అని సంస్కృతంలో వ్యవహరిస్తారు. సువాసన కలిగిన ద్రవ్యము, చేదు, తీపి, వగరు రుచులు కలగలిసి ఉంటుంది. వేడి చేస్తుంది. వీర్యస్తంభనం కలిగిస్తుంది. వ్రణములను మాన్పుతుంది. విషములను హరిస్తుంది. ఎముకలు గాని, శరీరంలో ఏదైనా ఒక అంగము విరిగినచో దానిని అతికించును.వాతపైత్యములను హరించును. మిక్కిలి జఠరదీప్తిని కలిగించి, అతిసారమును తగ్గిస్తుంది. దీని నుండి తీసిన తైలము పై గుణములను కలిగి, దాని కంటే అధికమైన పనిచేస్తుంది.