వికంతత, సృవావృక్ష అని సంస్కృతంలో పిలువబడే కాండ్రేగు చెట్టు శాస్త్రీయనామం Flacourtia Sapida and F.Ramontchi. ఈ మొక్క పెద్ద గుల్మజాతిలోనిది. విస్తారంగా అడవులలో పెరుగుతుంది. పొలాల గట్లపై కూడా పెరుగుతుంది. ఈ మొక్క ఆకులు బలుసు ఆకులను పోలి ఉంటాయి. చెట్టంతా కూడా ముళ్ళు ఉంటాయి. సుమారు ఒక నిలువు ఎత్తు వరకూ పొదలాగ పెరుగుతుంది. దీని కాయలు ఎర్రగా ఉంటాయి. పళ్ళు నల్లగా ఉంటాయి.
కాండ్రేగు చెట్టు గుణములు
పళ్ళ రుచి తీపి, వగరు కలిపి ఉంటుంది. శీతవీర్య ద్రవ్యము. విపాకమున మధుర రసముగామారుతుంది. లఘుగుణము కలిగి ఉంటుంది. జఠరాగ్నిని వృద్ధి పొందించి జీర్ణశక్తిని బలపరుస్తుంది. తాపము, శోష శమింపచేస్తుంది. కామలారోగము, పైత్య ప్రకోపాన్ని తగ్గిస్తుంది.
కాండ్రేగు చెట్టుతో ఔషధములు
కాండ్రేగు ఆకుల రసములో గాని, చెక్క రసములో గాని శొంఠి చూర్ణము కలిపి సేవించినట్లయితే జిగట విరేచనములు హరిస్తాయి. ఈ రసములో చాయపసుపు కూడ కలిపి లోనికి ఇచ్చినట్లయితే పాము విషము శమిస్తుంది. కాండ్రేగు చెక్కను మనిషి మూత్రముతో అరగదీసి పాము కుట్టిన చోట పట్టించి, గుడ్డను కాల్చి పొగ వేసినట్లయితే పాము విషము దిగుతుందని వస్తుగుణ ప్రకాశిక అనే ఆయుర్వేద గ్రంథంలో వివరించారు.
ఆమవాత నొప్పులకు
కాండ్రేగు చెట్టుచెక్క కషాయము కాచి ఆ కషాయమునకు సమభాగముగా మంచి నూనె వేసి నూనె మాత్రమే మిగిలేలా కాచి వాత నొప్పులకు మర్దనా చేసినట్లయితే నొప్పులు ఉపశమిస్తాయి.