కచోర-శఠీ అనే పేర్లు కలిగిన కచోరము గుల్మజాతిలోనిది. దీన్ని ఆంగ్లములో Curcuma Zedorea and Curcuma Zerumbet పిలుస్తారు. ఈ కచోరములో దుంప మాత్రమే ప్రధానమైన ఔషధం. కచోరము చెట్టు ఆకులు పసుపు ఆకులను పోలి ఉంటాయి. కానీ చిన్నవిగా ఉంటాయి. ఆకులు కూడా సువాసన కలిగి ఉంటాయి.
కచోరము గుణములు
కారము, చేదు కలగలిసిన రుచి కలిగి ఉంటాయి. వేడిస్తుంది. విపాకములో కూడా కారపు రుచిగానే ఉంటుంది. దగ్గులను, వగర్పులను కడుతుంది. జఠరాగ్నిని శమింపచేస్తుంది. గుల్మములను హరిస్తుంది. క్రిములను పోగొడుతుంది.సన్నిపాతజ్వరములు, పార్శ శూలలను తగ్గిస్తుంది. పాండు రోగములను శమింపచేస్తుంది. జలుబుకు, గొంతు నొప్పులకు మంచి ఔషధం. కచ్చోరముల చూర్ణము తేనెతో కలిపి సేవించినట్లయితే దగ్గు శమిస్తుంది. శ్లేష్మములను తగ్గిస్తుంది. వీర్యవృద్ధి, వీర్యస్తంభనము చేస్తుంది. శగరోగములను కడుతుంది. తామ్రవంగములు రెండింటినీ కలిపి, పచ్చి కచోరపు ముద్దలో గాని, దుంపలో గాని పెట్టి శీల ఇచ్చి పుటము వేసినట్లయితే చక్కని భస్మము అవుతుంది. దీనినే వంగ తామ్రము అంటారు. ఈ భస్మము సేవించడం వల్ల ప్రబలమైన శ్వాసకాసలు(ఆస్థమా)తగ్గించి, శ్లేష్మమును పోగొడుతుంది. శుక్ల నష్టమును కూడా అరికడుతుంది. రసము తీసుకోవడం వల్ల కంఠస్వరము బాగుపడుతుంది.