చిత్రక, అగ్ని, Plumbago Zeylanica అనే శాస్త్రీయనామం కలిగిన చిత్రమూలము చెట్టు సుమారు రెండు అడుగుల ఎత్తు వరకూ పెరుగుతుంది. కాండము నున్నగా ఉంటుంది. అకులు చిన్న తమలపాకులను పోలి ఉంటాయి. వాటి కంటె కొంచెం గుండ్రముగా ఉంటాయి. ఆకులు విడివిడిగా ఉంటాయి. వీటికి ఉత్తరేణి వంటి వెన్నులు ఉంటాయి. నక్కిరి కాయల వలె ఇవి బట్టలకు పట్టుకుంటాయి. వేరు చితగ్గొడితే పసుపు రంగుగా ఉంటుంది. దీనిలో ఎరుపు, తెలుపు, పసుపచ్చ రంగులతో మూడు జాతులు ఉన్నాయి. పువ్వుల రంగునుబట్టి, కాండము రంగును బట్టి వాటి జాతులను నిర్ణయించవచ్చు. చిత్రమూలములో ఇతర అంగములకంటే వేరులోనే అధిక ఔషధ గుణాలు ఉంటాయి.
చిత్రమూలము గుణములు
చిత్రమూలపు వేరు మిక్కిలి కారపు రుచి కలిగి ఉంటుంది. వేడిచేసే స్వభావము కలిగి ఉంటుంది. విపాకమున కూడా కారపు రుచిగానే ఉంటుంది. వాత, కఫములను పోగొట్టును. వాతోదరమును, గ్రహణీరోగములు, మూలశంకలు నివారిస్తుంది. పాండు రోగమును, క్షయను హరిస్తుంది. క్రిములను, దురదలను పోగొడుతుంది. ఎర్రచిత్రమూలము, నల్ల చిత్రమూలము రెండూ ఇంచుమించు ఒకేగుణములు కలిగి ఉంటాయి. లోహస్వర్ణీకరణమునందు కూడా దీనిని వినియోగిస్తారు. నల్లచిత్రమూలమునకు వెంట్రుకలను నల్లబరిచే గుణము ఉంది.
చిత్రమూలముతో ఔషధములు
- చిత్రమూలపు ఆకులు నూరి కూరగా వండి పెడితే ఉబ్బులు తగ్గుతాయి.
- చిత్రమూలము పెద్దములకల యొక్క క్షారమును వారమురోజులు స్రవింపచేసి పిమ్మట దానిని తీసి, దానికి రెండురెట్లు ఆవునేతితో కలిపి వాటిని పాకముగా కాచి సేవించినట్లయితే జఠరదీప్తిని కలిగించి గ్రహణి రోగమును తగ్గిస్తుంది.
- వేరు చూర్ణము తేనెతో సేవించినట్లయితే మేదో రోగమును హరిస్తుంది.
- చిత్రమూలపు వేరు ముద్దగాని, దేవదారు ముద్దగాని, రెండూకలిపి గాని పైన లేపనము చేస్తే బోదకాలుకు ప్రయోజనకారిగా ఉంటుంది.
- నలుపు, ఎరుపు చిత్రమూలముల వేరు తీసి నీడలో ఆరబెట్టి చూర్ణము చేసి ఆ చూర్ణము నేతిలో గాని, నెయ్యి తేనె కలిపి గాని, పాలతో గాని, నీళ్ళతో గాని ఒక నెలరోజుల పాటు నిత్యం సేవించినట్లయితే ఏ రోగములు లేకుండా నిస్సంశయంగా నూరు సంవత్సరాలు జీవిస్తారు. ఈ వేరు పొడిని మంచినూనెతో సేవించినట్లయితే కఠినమైన వాతములు శమిస్తాయి. గోమూత్రముతో కలిపి సేవించినట్లయితే కుష్ఠురోగములు పోతాయి. బొల్లి నివారణ అవుతుంది. చిత్రమూలపు వేరు చూర్ణమును మజ్జిగతోకలిపి సేవిస్తే మూలశంకలు మొదలగు రహస్య రోగములు హరిస్తాయి.
- చిత్రమూలమును, శొంఠి కలిపి సీధు మద్యముతో పానము చేసినట్లయితే మూలశంకలు హరిస్తాయని వస్తుగుణప్రకాశిక గ్రంథం వివరిస్తోంది.
- చిత్రమూలపు వేరు, తెల్లబాడిద వేరు, బెరడులను తెచ్చి నీళ్ళతో నూరి రసము తీసి పొంగించి దానిలో తేనె కలిపి ఇచ్చిన దారుణములైన కఫము వల్ల వచ్చే ఆయాసము నశిస్తుంది. చిత్రమూలపు వేరు వంటికి తగిలితే నిప్పువలె పుండవుతుంది. ఎంతకీ చితకని వ్రణములకు, గ్రంథులకు గాని పుండు అవడానికి చిత్రమూలమును పైన పూస్తారు. చిత్రమూలము గర్భిణులకు వాడకూడదు. గర్భస్రావములు కలుగవచ్చు. పైన లేపనము చేయుటవల్ల పక్వముగాని వ్రణములు పక్వమగుట, పక్వమైనవి చితుకుట జరుగుతుంది.