చిర్రికూర: తండులీయక, మేఘనాద, జలతండులీయ, మారిష అనే పేర్లతో సంస్కృతంలోను, Amaranthus Polygamus, Amaranthus Spinosns అనే పేర్లతో ఇంగ్లీషులోను పిలువబడే చిర్రి కూర లో చిర్రి, నీటి చిర్రి, చిన్న చిర్రి అనే మూడు రకములు ఉన్నాయి. కొన్ని మార్పులతో ఈ మూడు రకాలు చూడటానికి ఒకేలా ఉంటాయి. కొంచెం తేమ ఉన్న ప్రదేశాల్లో నేలను పాకి ఉంటాయి. కాడ కొంచెం ఎర్రగా ఉంటుంది. ఆకులుగుండ్రంగా చిన్నవి. మొక్క ముళ్ళతోటకూరను పోలి ఉంటుంది. వెన్ను కూడా అలాగే ఉంటుంది. కాని దీనికి ముళ్ళు ఉండవు. దీనిని విషానికి విరుగుడుగా వండి పెడతారు.
చిర్రికూర గుణములు
చిర్రికూర తీపి రుచి కలిగి ఉంటుంది. చలువ చేస్తుంది. మధురవిపాకము. లఘు, రూక్ష్ణ గుణములు కలిగి ఉంటుంది. కఫ పైత్యము, రక్త దోషములను హరిస్తుంది. మలమూత్రములను జారీ చేస్తుంది. విషహరమైనది. దీపనము, రసపట్లను విప్పుతుంది. వేరు రసము విష దోషములను హరిస్తుంది. రక్త ప్రదరమూలు కట్టుతుంది. వీటిలో తండులీయకమే శ్రేష్టము.
చిర్రికూర తో గ్రహణులు తగ్గుతాయి
చిర్రి చిగుళ్ళు, దానిమ్మ, నేరేడు చెక్క కషాయము, పెట్టి సేవించినట్లయితే అసాధ్య గ్రహణులు కడతాయి.
చిర్రికూర సర్వ విషదోషములకు
చిర్రికూర కషాయము గాని, కూర వండుకుని గాని సేవించినట్లయితే సర్వ రకములయిన విషదోషములను పోగొడుతుందని వస్తుగుణప్రకాశిక గ్రంథం తెలియచేస్తోంది.
వేడినీళ్ళలో చిర్రి వేరు నూరి కలిపి తాగినట్లయితే తెలియకుండా సేవించిన విషము వాంతి ద్వారా పోతుంది.
చిర్రికూరతో పిప్పి గోళ్ళకు మందు
చిర్రిచిగుళ్ళు ఎండబెట్టి చూర్ణముచేసి గోరులో పెట్టవలెను. కొంత చూర్ణముతేనెతో తినవలెను. ఇలా కొంతకాలంపాటు చేస్తే పిప్పిగోళ్ళకు పరిష్కారం కలుగుతుంది.
చిర్రికూర గనేరియాకు మంచి ఔషధం
చిర్రి వేరు గనేరియా రోగమునకు అద్భుతమైన గుళిక. మూత్రనాళమందలి మంటను, పచ్చబట్టను తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తుంది.