ఏడాకుల అరటి గుణములు
ఏడాకుల అరటి సర్వాంగములు కూడ వైద్యంలో ఉపయోగపడతాయి. మూడు దోషములను శమింపచేస్తుంది. గుండెకు చాలామంచిది. రుచి చేదుగా ఉంటుంది. వేడిచేస్తుంది. జఠరదీప్తిని కలిగిస్తుంది. సుఖ విరేచనము చేస్తుంది. శూలలను హరిస్తుంది. గుల్మములను తగ్గిస్తుంది. క్రిములను పోగొడుతుంది. కుష్ఠురోగములను తగ్గిస్తుంది. రక్తరోగములను అన్నింటిని తగ్గిస్తుంది. ఎటువంటి వ్రణములనైనా తగ్గిస్తుంది. జీర్ణజ్వరములు హరిస్తుంది. శ్వాసరోగములు శమింపచేయును. అసాధ్యమైన గ్రహణులను కూడా తగ్గించడంలో మంచిఔషధం. ప్రవాహిక, వాతరక్తము నిర్మూలిస్తుంది. విపాకమున కారపు రుచిగా ఉంటుంది. చెట్టుకు గంటు పెడితే పాలు కారుతుంది.
కుష్ఠునకు
ఏడాకుల అరటి చెక్క, ఆకులు కషాయము పెట్టి స్నానమునకు, తాగడానికి, పైన కడగడానికి ఉపయోగిస్తే కుష్ఠురోగము సైతం నివారింపబడుతుందని వస్తుగుణప్రకాశిక గ్రంథం తెలియచేస్తోంది.
స్తన్యశుద్ధి కోసం
ఏడాకుల అరటి మ్రానుపట్ట, తిప్పతీగ, శొఠి కలిపి కషాయము పెట్టి ఆ కషాయము తాగినట్లయితే స్తన్య దోషము నివర్తింపబడును.
సాంద్రమేహము
సప్తపర్ణము ఆకులకషాయము సేవించినట్లయితే సాంద్రమేహము తగ్గుముఖంపడుతుంది.
విషము హరిస్తుంది
మ్రానిపట్ట కషాయము పెట్టి ఆ కషాయములో తేనె కలిపి దంతములకు, నోటికి రాసినట్లయితే విషము హరిస్తుంది.
దగ్గు, వగర్పు నకు
సప్తపర్ణము పువ్వులును, పిప్పళ్ళు నూరి పెరుగుమీద తేట నీటితో కలిపి తాగినట్లయితే దగ్గు, వగర్పు అంటే ఆస్థమా తగ్గుతుంది.
ఎక్కిళ్ళకు
ఏడాకుల అరటి మ్రానిచెక్క రసములో తేనె, పిప్పలిచూర్ణము కలిపి సేవించినట్లయితే ఎక్కిళ్ళు తగ్గుతాయి.
పిప్పిపంటికి
ఏడాకుల అరటి ఆకుల రసము, జిల్లేడు పాలు కలిపి పిప్పిపంటిలో వేసినట్లయి పురుగుచచ్చి బాధ శమిస్తుంది.
వ్రణములకు
ఆకులు మెత్తగానూరి వ్రణములకు పైన పూసినట్లయితే దుష్టవ్రణములు మానుతాయి.
ప్లీహము పెరుగుదలకు
ఏడాకులపట్ట చూర్ణము రెండు చెంచాలుగాని, కషాయము గాని రాత్రి పడుకునే ముందు సేవించినట్లయితే జీర్ణించిన అజీర్ణములను, ప్లీహము పెరుగుదలను(enlarged spleen) అరికడుతుంది.
ఇతర ఉపయోగాలు
ఈ ఏడాకుల అరటి కషాయమును తరచుగాసేవిస్తూ ఉండడం వలన క్వినైన్ సల్ఫేటుతో సమానముగా పనిచేస్తుందని చాలామంది వైద్యులు అనుభవపూర్వకంగా తెలియచేసారు. క్వినైన్ సల్ఫేటు, సప్తపర్ణము సమాన మోతాదుగా, సమాన గుణములుగా పనిచేస్తుందని రుజువుచేసారు. ప్రత్యేకంగా క్వినైన్ వాడేటప్పుడు చెముడు, నిద్రపట్టక పోవడం వంటి సైట్ ఎఫెక్ట్స్ ఉండవచ్చు. అదే సప్తపర్ణము(ఏడాకుల అరటి) వినియోగిస్తే ఈ చెడు గుణములు కలుగవు.