మంజిష్ఠ: మంజిష్ఠ, కాలమేషికా, సమంగా, అరుణ అనే పేర్లు సంస్కృతంలోను, Rubia Maunjistha అని ఇంగ్లీషులోను పిలువబడే మంజిష్ట తీగజాతికి చెందినది. ఆకులకు నూగు ఉంటుంది. కాండమునకు కూడా గరుకుదనము గలనూగు ఉండును. దీని పుష్పగుచ్ఛము జడలాఉంటుంది. మొగ్గ నాగకేసరపు మొగ్గలాగ ఉంటుంది. ఒక పుష్పములో ఐదు లేక ఆరు రేకలు ఉంటాయి. దీని వేరు దూరముగా పాకుతుంది. వేరు రంగు ఎర్రగా ఉంటుంది. ఈ వేరుతో బట్టలకు ప్రసస్తమైన రంగు వేస్తారు.
రక్తయష్టి, ఎర్రనికర్ర కలది, యోజనపల్లి, పొడుగుగా ప్రాకే తీగ అనే పేర్లు కూడా ఈ మంజిష్టకు ఉన్నాయి.
జ్వరహంత్రి, రాగాఢ్యా, వస్త్రభూషణ అనే పర్యాయపదాలు కూడా ఉన్నాయి. అంటే జ్వరాన్ని తగ్గించేది, రక్తిమమును కలిగి ఉండేది, బట్టలకు మంచి రంగును ప్రసాదించునది అని అర్థం.
మంజిష్ట గుణములు
ఇది మధురరసము కలది. వగరు రుచి కూడా ఉంటుంది. వేడిచేసే స్వభావము కలిగి ఉంటుంది. కఫమును, తీవ్రమైన వ్రణములను(కురుపులు), రక్తవ్యాధులను, నేత్రరోగములను తగ్గిస్తుందని ధన్వంతరి నిఘంటువులో తెలియచేసారు.
మంజిష్టతో స్వరమును(గొంతు) బాగుగా చేయవచ్చు. శరీరమునకు మంచి రంగును ఇస్తుంది. రక్తాతిసారమునకు, కుష్టురోగమును హరిస్తుందని భావప్రకాశిక గ్రంథం తెలియచేసింది.
ఔషధములు
మూత్రములో ఎరుపురంగును తగ్గిస్తుంది
మంజిష్ట, మంచి గంధము కలిపి పెట్టిన కషాయము మంజిష్ఠామేహమును (మూత్రం ఎరుపురంగులో రావడం) హరిస్తుంది.
లైంగిక సంబంధ వ్యాధి కోసం
మంజిష్ఠ కషాయాన్ని తేనెతో కలిపి సేవించినా, పైన పూసినా లైంగిక సంబంధమైన వ్యాధి తగ్గుతుంది.
పిల్లలకు వచ్చే పాల ఉబ్బసవ్యాధికి
మంజిష్టతో పలుచని కషాయమును కొద్దిగా పట్టిస్తే పిల్లలకు వచ్చే పాల ఉబ్బసవ్యాధి తగ్గుతుంది.
స్త్రీల ఋతు దోషములకు
మంజిష్ట కషాయమును ప్రత్యేకముగా సేవించినట్లయితే స్త్రీల ఋతు దోషములు తగ్గుతాయి.
అంతేకాక మంజిష్ఠ ఆకులను వాత ,పిత్త దోషములను హరించుటకు కూరగా కూడా వండుకుని తినవచ్చు.