గుమ్ముడుచెట్టులో గొప్ప గుణాలెన్నో...

 

గుమ్ముడుచెట్టు  గంబారీ, కాశ్మరి అని సంస్కృతములోను, Cmelina Arborea and Cmelina Parvitxora అని ఇంగ్లీషులోను పిలువబడే గుమ్ముడు చెట్టు దశమూలములలో చేరిన వృక్షము. దళసరి మానుపట్ట, పాలు కలిగి ఉంటుంది.  నల్లని తొడిమలు,పసుపు రంగు పుష్పాలు కలిగినది. వాతము హరించే గుణము కలిగి ఉంటుంది. రావి ఆకులను పోలిన ఆకులు ఉంటాయి. పళ్ళు కూడా పసుపు రంగులో ఉంటాయి. మాను తెల్లగా ఉంటుంది. ఈ చెట్టు నుండి పాలు కారుతాయి. 

గుమ్ముడుచెట్టు గుణములు

వగరు, చేదు, తీపి కలిపిన రుచి కలిగి ఉంటుంది. పులుపు రుచి కూడా కొంచెం ఉంటుంది. దీని వేరు మాత్రం ఉష్ణవీర్యము కలిగినది. మిగిలిన అంగములు శీతవీర్యము కలిగినవి. పాచనము, శూల, దప్పి, జ్వరము, మూలవ్యాధి, భ్రమ పోగొడుతుంది.  విషమును హరిస్తుంది. 

గుమ్ముడుచెట్టు పండు

పులుపు, వగరు, తీపి కలిగిన రుచితో ఉంటుంది. మలబద్ధమును కలిగిస్తుంది. తలవెంట్రుకలు పెరుగునట్లు చేయును. రసాయనద్రవ్యము. మిగిలిన గుణములన్నీ సమానమే.

గుమ్ముడుచెట్టు ఆకు

వాత, శ్లేష్మహరము. ఉబ్బు,  క్రిములు, మేహమును హరిస్తుంది. 

గుమ్ముడుచెట్టు పువ్వు

పండు రుచులే పువ్వుకు కూడా ఉంటాయి. పులుపు రుచి ఉండదు. చలువచేస్తుంది. వాత హరము. రక్తపైత్యమును హరిస్తుంది. రక్త దోషమును పోగొడుతుంది. వీర్యవృద్ధి కరమైనది. 

గుమ్ముడుచెట్టు వేరు

మిక్కిలి వేడిచేస్తుంది. ఈ వేరు దశమూలకములలో చేర్చి వినియోగించాలి. ప్రత్యేకముగా వాడితే మంచిదికాదు. 

గుమ్ముడుచెట్టు నూనె 

గుమ్ముడు చెట్టు గింజల నుండి నూనె తీస్తారు. రుచి వగరుగాను, తియ్యగాను ఉంటుంది. కఫము, పిత్తము తగ్గిస్తుంది. 

గుమ్ముడుచెట్టు ఔషధములు

రక్త అతిసారమునకు 

గుమ్ముడుచెట్టు పళ్ళు నీటిలో పిసికి గింజలు తీసివేసి దానిలో పుల్ల దానిమ్మ గింజల రసము కలిపి, కాచి నేతితో తాలింపు పెట్టి సేవించినట్లయితే రక్త విరోచనాలు కడతాయి. 

గర్భము శుష్కించి లోపల శిశువు కూడా శుష్కించిన ఎడల

గుమ్ముడు పళ్ళగుంజు పాలలో కలిపి పంచదార చేర్చి త్రాగినట్లయితే గర్భము పెరుగుతుంది. శిశువు కూడా ఆరోగ్యంగా పెరుగుతుందని వస్తుగుణప్రకాశిక అనే ఆయుర్వేద గ్రంథము తెలియచేస్తోంది. 

వాత రక్తమునకు

గుమ్ముడుచెట్టు మ్రాను పట్ట కషాయముగా కాచి నువ్వులనూనె చేర్చి యష్టిమధుకపు ముద్ద దానిలో వేసి నూనె మిగిలే వరకూ కాచి పైనరాసినా లేక సేవించినా వాత రక్తము శమిస్తుంది. 

పైత్య జ్వరమునకు

గుమ్ముడుచెట్టు పళ్ళు కషాయము పెట్టి చల్లార్చిన  తరువాత కొంచెం పంచదార చేర్చి త్రాగినట్లయితే జ్వరతాపము,దప్పి తగ్గుతుంది. 

వాలిన చన్నులు బిగియుటకు

గుమ్ముడు చెక్క చిక్కటి కషాయములో నువ్వుల నూనె కలిపి నూనె మిగిలేలా కాచి ఆ నూనెను కొబ్బరిచిప్పలలో వేసి వాటిని చన్నులకు కట్టి కదలకుండా ఉంచితే చన్నులు బిగువుగా తయారవుతాయని వంగసేన గ్రంథములో తెలుపబడింది. 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.