జామ చెట్టు: అమృతఫలము, పేరుక ఫలము, పేయార అని సంస్కృతంలోను, Psidium Guyava, P.Pyriferum, White Guava, P.Pomiforum, Red Guava అనే పేర్లతో ఇంగ్లీషులోను పిలువబడే జామ చెట్టులోని ప్రతీ భాగము ఔషధ ఉపయుక్తమైనదే. ఈ జామలో తెల్లజామ, ఎఱ్ఱజామ, సీమ జామ, గింజలేని జామ, గులాబీజామ మొదలైన రకాలున్నాయి. ఇది గొప్ప ఫల వృక్షమని చెప్పవచ్చు. దీని చర్మం దళసరిగా ఉంటుంది. పెళుసుగాఉంటుంది. ఆకులు మూడు అంగుళాల వెడల్పు, ఆరు అంగుళాల పొడవు కలిగి కోలగా ఉంటాయి. ఆకు వగరుగా ఉంటుంది. పువ్వు, కేసరములు విస్తారముగా కలిగి నిమ్మ, నారింజ పువ్వు వలె ఉంటుంది. కాయలు కొన్ని గుండ్రముగాను, కొన్ని కోలగాను ఉంటాయి. కాయ రంగు పచ్చరంగు, పండు రంగు తెలుపు. జామకాయలో గింజలు గట్టిగా ఉంటాయి.
జామ చెట్టు గుణములు
చెట్టంతా వగరురుచి కలిగి ఉంటుంది. పండు వగరు, తీపి, పులుపు రుచులు కలిగి ఉంటుంది. శీతవీర్యమైనది. శ్లేష్మమును చేస్తుంది. మధుర విపాకము కలిగినది. గురుగుణము. వాతము కూడా చేస్తుంది. పైత్యహరము. వీర్యవృద్ధి. రుచికరమైనది, బలకరమైనది. గింజలు మాత్రం అజీర్ణంచేస్తాయి. సర్వాంగములు విషహరమైనవి. వేరు, ఆకు, చెక్క, పండు కూడా ఉపయోగకరములే.
ఔషధములు
గంజాయి మత్తుకు
కొన్ని జామ చిగుళ్ళు నమిలి మింగినా, ఆకుల రసము తాగినా గంజాయి సేవించిన ప్రభావం తగ్గుతుంది.
తేలు విషమునకు
జామచెక్క గంధము అరగదీసి తేలుకుట్టినచోట రాసి గుడ్డను కాల్చి పొగవేసినట్లయితే తేలువిషం హరించి బాధ తగ్గుతుంది.
నోటిపూతలకు
జామ ఆకుల రసము కాని, కషాయముగాని, పుక్కిలించినట్లయితే నోటిపూతలు, పళ్ళు కదలడం, సలుపు తగ్గుతుంది.
కురుపులు తగ్గడానికి
జామచెక్క గాని, ఆకులను గాని కషాయము పెట్టి కురుపులను కడిగినట్లయితే వ్రణములలో ఉన్న పురుగులు చచ్చి తగ్గుముఖం పడుతుంది.
నేత్రస్రావమునకు
జామపువ్వు పన్నీరుతో నూరి గుడ్డతో వడగట్టి దానిలో చిటికెడు పొంగించిన పటిక చూర్ణము కలిపి ఐదు, ఆరు చుక్కలు కంటిలో వేసినట్లయితే నేత్రస్రావములు, ఎరుపులు తగ్గుతాయి. లేక పువ్వులు ఆవునేతితో ఉడికించి కంటికి కట్టినా కంటి బాధలు తగ్గుతాయి.
నీళ్ళ విరేచనములకు
జామ ఆకుల కషాయముతో కర్పూరాదివటి ఇచ్చినట్లయితే నీళ్ళవిరేచనములు కడతాయి.
వాంతులకు
ఆకు రసము, తేనె కలిపి నాకించినట్లయితే వాంతులు కడతాయి. ఆకు తిన్నా వాంతులు తగ్గుతాయి. జామపండు ఎక్కిళ్ళను తగ్గిస్తుంది.