తుంబీ, అలాబూ అని సంస్కృతంలోను, Cucurbita Lagemaria అనే శాస్త్రీయనామం కలిగిన తియ్య ఆనబ తీగజాతిలోనిది. చాలా పొడవుగా పాకుతుంది. ఆకులు గుండ్రంగా శ్రీ ఆకారంలో గుమ్మడికాయంత ఉంటాయి. ఆకులకు కొంచెం నూగు ఉంటుంది. పువ్వు తెల్లగా గ్రామ్‌ఫోను గొట్టంలా ఉంటుంది. తియ్యఆనబ అని, చేదు ఆనబ అని రెండు రకాలు ఉంటాయి. తియ్య ఆనబ ఇంటి పెరట్లోను, పొలాల్లోను పెరుగుతుంది. దీనిలో కోల కాయలు కాసేది, గుండ్రని కాయలు కాసేది రెండు ఉంటాయి. తెల్ల ఆనబ, నల్ల ఆనబ రెండూ కూరకు ఉపయోగిస్తాయి.
తీపి ఆనబ గుణములు
ఈ రెండు రకాలకు గుణము సమానంగానే ఉంటుంది. తీపి రుచి కలిగి ఉంటుంది. విపాకమున కూడా తీపి రుచితోనే ఉంటుంది. వాత కఫములను చేస్తుంది. మలబద్ధమును పుట్టిస్తుంది. పైత్య హరము. గింజలు వీర్యవృద్ధిని కలిగిస్తాయి. ఆవు నేతితో వేయించుకుని తింటే వీర్యమును స్తంభింపచేస్తుంది. ఈ కాయ ముదిరితే కూరకు పనికిరాదు. కొన్నిచోట్ల ఆనబ ఆకులను కూడా కూర వండుకుని తింటారు. ఆకుకూర మేహశాంతి. మూత్రమును జారీచేయును.
తీపి ఆనబతో ఔషధములు
బాగా పండిన తీగ తియ్య ఆనబను సమూలముగా తీసి నీడలో ఆరనిచ్చి కాల్చి మసిచేసి, ఆ మసి నీటిలో కలిపి నీరు ఇగిరే వరకూ కాచి అడుగున ఉన్న క్షారము తీసి నాలుగు చెంచాల నీటిలోకలిపి సేవించినట్లయితే ఎలాంటి మూత్రపు పట్లను అయినా విడగొడుతుంది.
ఆనబకాయ ముక్కలుగా కోసి ఎండబెట్టి చూర్ణము చేసి, ఆ చూర్ణమును తేనెతో గాని, బియ్యపు కడుగుతో గాని సేవిస్తే ప్రదర రోగములు నశిస్తాయి.
చేదు ఆనబ
చేదు ఆనబను తిక్తాలాలు అని, కటుతుంబీ అని, ఇక్ష్వాకు అని అంటారు. దీని అంగముల యొక్క యాకృతి అంతా మామూలు అనబ వలె ఉంటుంది. కాని రుచి చేదుగా ఉంటుంది. దీనిలో కాయ, ఆకులు, గింజలు కూడా ఉపయోగకరమైనవే. ఈ చేదు ఆనబ అడవులలో పెరుగుతాయి.
గుణములు
చేదు రుచి కలిగినది. వీరవీర్యము విపాకమున కారపు రుచిగా మారుతుంది. తీక్ణగుణము. హృదయమునకు చాలా మంచిది. పైత్య శమనము. విషమును హరిస్తుంది. శ్వాసలను తగ్గిస్తుంది. వాత, పైత్య జ్వరము తగ్గిస్తుంది. వాంతిని చేయుటకు ఇది ముఖ్యమైన మూలిక. గింజల నుండి నూనె తీస్తారు.
చేదు ఆనబతో ఔషధాలు
మూత్రకోశంలో రాళ్ళకు
మూత్రకోశములోని రాళ్ళు (అశ్మరీ వ్యాధి) చేరి మూత్రము జారీ అవకుండా బాధపడుతున్నవారు. ఆనబ గింజల చూర్ణమును తేనెతో కలిపి గొఱ్ఱెపాలతో పాటు సేవించినట్లయితే రాళ్ళు కరుగుతాయి. పండిన ఆనబకాయ రసములో పంచదార కలిపి తాగినట్లయితే రాళ్ళు కరుగుతాయని వస్తుగుణ ప్రకాశిక వివరిస్తోంది.
మూలశంకకు
చేదు ఆనబగింజలు చవటుప్పు కడుగుతో నూరి కుంకుడు గింజలంత మాత్రలుగా చేసి గేదె పెరుగుతో కలిపి సేవించిట్లయితే మూలశంకలు ఉపశమిస్తాయి.
యోని రోగములకు
చేదు ఆనబ ఆకు, లొద్దుగ సమాన భాగాలుగా నూరి యోనియందు లేపనము చేసినట్లయితే తక్షణం యోని రోగములు శమిస్తాయి.
పిప్పి పంటికి
చేదు ఆనబ వేరు చూర్ణము చేసి పిప్పంటిపై వేసి నొక్కినట్లయితే క్రిమి చచ్చి బాధ శమిస్తుందని భావప్రకాశిక గ్రంథంలో తెలుపబడింది.
ఆయాసము(ఆస్థమా)
చేదు ఆనబ కషాయముతో ఆస్థమా రోగి ఆవిరి పట్టినా, కషాయముతో కాపడం పెట్టినా ఆస్తమా రోగాలు తగ్గుతాయి.
చెవి రోగములకు
చేదు ఆనబ రసము చెవిలో బోసినట్లయితే శూలలు మొదలైనవన్నీ శమిస్తాయి.