రాజమాషఅని సంస్కృతంలోను , Dolichos Catiang అని ఇంగ్లీషులో పిలువబడే ఈ అలచందలు మొక్కరకములోనిది. తీగలు కూడా ఉంటాయి. నాలుగు అంగుళముల పొడవు గల సన్నని కాయలు కాస్తాయి. ఈ కాయలు పండిన తరువాత ఎండబెట్టి గింజలు తీస్తారు. ఈ గింజలకే బొబ్బర్లని పేరు కూడా ఉంది. మెట్టభూములలో విస్తారముగా పండుతాయి. నవ ధాన్యాలలో ఒక రకం అలసంద. ఇది ఫాబేసి కుటుంబానికి చెందినది.
అలచందలు ఉపయోగములు
శాకాహారులకు ఇది మంచి ప్రోటీన్ ఉన్న ఆహారము. మాంసకృత్తుల లోపము రాకుండా కాపాడుతుంది. చనుబాలను వృద్ధిచేస్తుంది. బలకరము. మలమూత్రములను వెడలించును.గుండె జబ్బు, మధుమేహము ఉన్నవారికి మంచిది.
అలచందలు గుణములు
వగరు, తీపి కలిసిన రుచి కలిగి ఉండును. విపాకమున తీపి రుచిగా మారును. కొంచెం వేడిచేసే స్వభావం కలది. ఆమదోషము, కఫము, వాతమును కలిగిస్తుంది. ఇనుము, మెగ్నీషియం, కాల్సియం, ఫాస్ఫరస్, లాంటి ఖనిజ లవణాలు ఉన్నాయి. థయామిన్, రైబోఫ్లెవిన్, నియాసిన్, లాంటి విటమిన్లు ఉన్నయి .ఈ పప్పుతో గారెలు కూడా వండుకోవచ్చు. మినపగారెల కంటె, పెసరట్లు కంటె ఈ పప్పు రుచిగా ఉంటుంది. దీని పప్పు వేయించి పప్పుగా వండినా, లేక కట్టుగా కాచినా రుచిగా ఉంటుంది. పప్పు వేయించినట్లయితే లఘుగుణముగా మారుతుంది. పైత్యము చేస్తుంది. పచ్చికాయలు ఆమమును పెంచుతాయి. అలచందల మొక్కను పశువుల మేతకు ఉపయోగిస్తారు.