Cashewnut Tree అని ఇంగ్లీషులో పిలువబడే జీడిమామిడి చెట్టు పెద్ద వృక్షజాతిలోనిది. ఇంచుమించు మామిడి చెట్టంత పెరుగుతుంది. చెట్టు మాను కడుతుంది. మాను కొంచెం తెల్లగా ఉంటుంది. ఆకులు ఈనెలు కలిగి చిన్న బాదం ఆకుల వలె ఉంటాయి. తెల్లని పువ్వులు గుత్తులు గుత్తులుగా పూస్తాయి. పళ్ళు పసుపురంగులో ముందు సన్నముగాను, కొసలు లావుగాను ఉంటాయి. జామపళ్ళను పోలి ఉంటాయి. బంగారు రంగుగల పళ్ళకు దిగువన గింజ వేళాడి ఉంటుంది. గింజ పై పొరలో జీడి ఉంటుంది. గింజలోపల పప్పు ఉంటుంది. అదే రుచికరమైన జీడిపప్పు. ఈ చెట్టు సర్వాంగములో ఔషధములలో వినియోగిస్తారు.
జీడిమామిడి గుణములు
మధుర రసము కలిగినది. ఉష్ణవీర్యము, లఘుగుణము, మధుర విపాకము. శ్లేష్మమును చేస్తుంది. మిక్కిలి ధాతువృద్ధిని కలిగిస్తుంది. వాత, కఫగుల్మ, ఉదర జ్వరములను తగ్గిస్తుంది. అగ్నిమాంద్యమును, మూలశంకలు, కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తుంది.
ఔషధాలు
గింజలలోని పప్పు కాల్చితే కమ్మగా ఉంటుంది. పిండిపదార్ధం ఎక్కువగా కలిగి ఉంటుంది. కొంచెం నూనె కూడా ఉంటుంది. అతిమూత్రము, చక్కెర వ్యాధి ఉన్నవాళ్ళు ఈ జీడిపప్పు ఎక్కువగా వినియోగిస్తారు. జీడిపప్పు అనేక రకాల తీపి పదార్ధాల్లోలో వేస్తారు. అయితే జీడిపప్పు సులభంగా జీర్ణం కాదు. బలకరమైనది. పైత్యము చేస్తుంది.
జీడిమామిడి పండు
పండు రసముతో రసాయనము తయారుచేస్తారు. ఈ జీడిమామిడిపండు తినటం వల్ల బలము, పుష్ఠి, వీర్యవృద్ధి, మేహశాంతి కలుగుతుంది. ఈ పళ్ళను కొందరు కూరగాను, పులుసుగాను కూడా వండుకుని తింటారు. సువాసన గాను, మధుర రసముగాను ఉంటుంది.
చర్మరోగములకు
జీడిమామిడి గింజలు కాల్చిపైపెచ్చుకు ఉన్న మసిని తీసి కొబ్బరినూనె తో కలిపి రాసినట్లయితే చర్మరోగములు పోతాయి.