తాని చెట్టుతో త్రిదోషాలు మాయం (Terminalia Bellerica, Berlic Myrlaballam)

విభీతకము, తిలపుష్పము, కర్షఫలము, విషఘ్నము, అనిలఘ్నకము అనే విశేష పదాలు కూడా కలిగిన తానిచెట్టు పెద్ద వృక్షజాతిలోనిది. అడవులలో పెరుగుతుంది. మన్యంలోని అడవులలో ఉంటాయి, ఆకులు ఇంచుమించుగా జీడిమామిడి ఆకులను పోలి ఉంటాయి. నువ్వు పువ్వులవలె చిన్న చిన్న పువ్వులు కలిగి ఉంటుంది. తానికాయలు గుండ్రంగా ఉండి ముచిక దగ్గర కోలగా ఉంటాయి. గింజ గట్టిగా ఉండి లోపల నూనె కలిగిన పప్పు ఉంటుంది. ఎండిన కాయ బూడిద రంగులో ఉంటుంది.  ఈ చెట్టున కాసే కాయలే ప్రధానంగా ఉపయోగకరమైనవి. ఈ తానికాయ త్రిఫలములలో ఒకటి. 

తానికాయ గుణములు

తానికాయలో ఒక ఉప్పు తప్ప మిగిలిన ఐదు రుచులను కలిగి ఉంటుంది. వేడిచేసే స్వభావముకలిగినది. విపాకమున తీపి రుచిగా మారుతుంది. మూడు దోషములను హరిస్తుంది. విశేషముగా కఫపిత్తములపై పనిచేస్తుంది. దగ్గు, నేత్రరోగములు హరింపచేస్తుంది. విరేచనము చేస్తుంది. తలవెంట్రుకలను బాగా పెంచుతుంది. క్రిములను చంపుతుంది. తెల్లవెంట్రుకలను నల్లబరుస్తుంది. గింజలలోని పప్పు తియ్యగా ఉంటుంది. దప్పిని, వాంతిని, కఫవాతములను హరిస్తుంది. 

అతిసారము పోగొడుతుంది

తానికాయను కాల్చి దానిలో కొంచెము ఉప్పును చేర్చి తినినచో అతిసారము వ్యాధి తగ్గుముఖం పడుతుంది. 

గుండె వ్యాధులకు

తానికాయ పెచ్చులు, పెన్నేరు ముద్దగా నూరి కొంచెం బెల్లము చేర్చి వేడినీటితో సేవించినట్లయితే గుండెకు వచ్చే వాతరోగములు తగ్గుతాయి. 

శ్వాసరోగములు

తానికాయ చూర్ణమును తేనెతో కలిపి సేవిస్తే శ్వాసరోగములు శమిస్తాయి. 

నేత్రరోగములకు మందు

తానికాయలో ఉండే పప్పుతో తీసిన నూనెను తేనెతో కలిపి కళ్ళకు కాటుకలా ధరించినా, లేక లోపలికి సేవించినా కంటిలోపలి పువ్వులు, పొరలు మొదలైన కంటిరోగాలు పోతాయి. 

వాపులు తగ్గుతాయి

తానికాయలోని పప్పును మెత్తగా నూరి పైన పూత పూసినట్లయితే శరీరంపై ఉబ్బులు, వాపులు తగ్గుతాయి. 

దగ్గుకు మందు

తానికాయకు నెయ్యిపూసి, ఆవుపేడ కూడా రాసి నిప్పులపై కొంచెం ఉడికించి మెత్తబడిన తరువాత పెచ్చును బుగ్గన పెట్టి నమిలితే తప్పనిసరిగా దగ్గులు ఉపశమిస్తాయి. 

ఆయాసము తగ్గుతుంది

తానికాయ చూర్ణమును కొంచెం తీసుకుని దానిని తేనెతో కలిపి నాకినట్లయితే తీవ్రతరంగా ఉన్న శ్వాస సమస్యలు కూడా తగ్గుతాయి. 

పుండ్లు తగ్గుతాయి

తానికాయ పప్పును అరగదీసిన గంధమును పైన పూస్తూ ఉన్నట్లయితే పుండ్లు నయమవుతాయి. 

గొంతు నొప్పులు

కాల్చిన తానికాయలో ఉప్పు, పెద్ద పిప్పళ్ళ చూర్ణమును కలిపి సేవిస్తే గొంతు బొంగురు వంటివి తగ్గుతాయి. 

నేతితో వేయించిన తానికాయను చప్పరించినట్లయితే అతిసారము, మూలశంక, ప్లీహ(pancreas) రోగములు ఉపశమిస్తాయి. 



Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.