ఓక చెట్టు శాస్త్రీయనామం Jasmine Flowered Carrissa. కరమర్ద అనే పేరు కూడా కలిగిన ఓకచెట్టు ఒక పొద జాతికి చెందినది. కొమ్మలకు వాడిగా ఉన్న ముళ్ళు ఉంటాయి. ఆకులు పెళుసుగా, గుండ్రముగా ఉంటాయి. ఆకు చిన్నదిగా ఉంటుంది. పళ్ళు ముఖ్యముగా ఉపయోగకరమైనవి. కాయలు కోలగా, గుండ్రదనము కలిగి ఉంటాయి. కాయలపైన ఎర్రటి మచ్చలుంటాయి. పండు నల్లగా ఉంటుంది. లోపలి రసము ఎర్రగా ఉంటుంది. కాయ పులుపు రుచి కలిగి ఉంటుంది. పండు, తీపి, కొంచెం పులుపు కలగలసి ఉంటుంది.
ఓక చెట్టు గుణములు
వేడిచేసే గుణము కలది. విపాకమున పులుపు రుచిగా మారుతుంది. పచ్చికాయ దప్పిని కడుతుంది. రుచిని పుట్టిస్తుంది. రక్తదోషమును, పైనమును, కఫమును చేస్తుంది. పండు రుచికరమైనది. పైత్యమును, వాతమును శమింపచేస్తుంది. వేరు క్రిములను పోగొడుతుంది. పచ్చికాయలతో పచ్చడి కూడా తయారుచేస్తారు. పప్పులో వేసి వండుకుంటారు. కొబ్బరికాయ, పెసర పప్పుతో కలిపి ఓక కాయలను పచ్చడిగా చేసుకుని తింటారు. ఓక వేరును నిమ్మరసంతో కలిపి నూరి రాసినట్లయితే తామర వ్యాధి తగ్గుతుంది. హారతికర్పూరము, కొబ్బరి నూనెలో, ఓక వేరు రసాన్ని కలిపి రాసినట్లయితే గజ్జి లాంటి చర్మవ్యాధులు తగ్గుతాయి. దీన్ని వాక చెట్టు అని కూడా అంటారు.