Gymnema Sylvestre Asclepias Geminata అనే శాస్త్రీయ నామం కలిగిన ఒద్దిచెట్టు పెద్ద వృక్షము. సంస్కృతంలో మేషశృంగీ అనే పేరుతో పిలువబడుతుంది. పర్వతారణ్యములలో విస్తారంగా పెరుగుతుంది. ఎర్రటిపూలు పూస్తుంది. గుండ్రంగాను, పొడవుగాను ఉండే పండ్లు కాస్తుంది. ఆకులు మోదుగ ఆకుల వలె ఉంటాయి. ఈ ఒద్దిచెట్టు లో వృశ్చికాలీ అనే మరో రకము ఉంటుంది. దీనికి కొంచెం నూగు ఉంటుంది. గుత్తులు గుత్తుగా తెల్లని పుష్పములు పూస్తుంది. ఒద్ది చెట్టుకు చేదుగల పాలు ఉంటాయి.
ఒద్దిచెట్టు గుణములు
కారము, చేదు కలగలిసిన రుచిగా ఉంటుంది. శీతవీర్యము కలిగినది. కఫమును, మూలవ్యాధులను, శూలలను, ఉబ్బులను, దప్పి, వాంతిని పోగొట్టును. నేత్రములకు చాలా హితకరమైనది. విషములను, దగ్గులను, కుష్ఠురోగమును శమింపచేస్తుంది.
ఒద్ది పండు గుణములు
ఒద్దిపండు చేదు రుచి కలిగి ఉంటుంది. కుష్ఠురోగములు, మేహములు, కఫము శమింపచేస్తుంది. జఠరదీప్తిని కలిగిస్తుంది.
ఒద్దిచెట్టుతో ఔషధములు
- పండు రసమును గాని, వేరు గంధము గాని కంటికి కాటుకలా పెట్టినట్లయితే విషము హరిస్తుంది.
- గారచెక్క, ఒద్దిచెట్టు చెక్క కలిపి గుండకొట్టి ఆకులో వేసి చుట్టగా చుట్టి నిప్పులో వేసి ఆ పొగ పీల్చినట్లయితే కఫ శిరో రోగములు నివారింపబడతాయి.
- ఒద్దివేరు ముద్దగా నూరి మేక మూత్రముతో కలిపి త్రాగినట్లయితే మూల వ్యాధులు శమిస్తాయని వస్తుగుణప్రకాశిక గ్రంథం వివరిస్తోంది. ఈ మందు వాడినప్పుడు బెల్లము, నేల ములగకాయలు పధ్యముగా వాడవలెను.
- జ్వరములో వచ్చు దగ్గునకు కూడా ఈ చెట్టు పండు రసమును వినియోగిస్తారు. వేరుచూర్ణమును ఆముదముతో కలిపి పైన రాసినచో పాము, పురుగుల వలన కలిగిన విషకాటులకు పనిచేస్తుంది. ఆకులు వెచ్చచేసి పైన కట్టినా, రసము లోనికి ఇచ్చినా ప్లీహపెరుగుదల అనే వ్యాధిని తగ్గిస్తుంది.