సుఖరంజక, తిమిర అనే పేర్లు కూడా కలిగిన గోరింటాకు చెట్టు నాలుగుగజముల ఎత్తువరకూ పెరుగుతుంది. పెరట్లో పెరిగే ఈ గోరింట తెల్లని పువ్వులు పూస్తుంది. కాయలు గోధుమరంగులోఉండి గుత్తులు గుత్తులుగా కాస్తాయి. స్త్రీలు చేతులకు, కాళ్ళకు ఈ గోరింటాకు ధరిస్తారు. గోళ్ళ సంబంధమైన వ్యాధులు రాకుండా కాపాడటానికి ఈ గోరింటాకు ధరించడం మంచిది.
గోరింటాకు గుణములు
చేదు రుచి కలిగినది. ఉష్ణవీర్యము కుష్ఠురోగము, కాలిన పుండ్లు, తిమిర వాతము, నోటిపూతలు తగ్గిస్తుంది. శ్లేష్మమును హరిస్తుంది.
ఔషధములు
- గోరింటాకు గింజలు జ్వరమును తగ్గించడానికి ఉపయోగిస్తాయి.
- గింజల చూర్ణము, దాల్చినచెక్క రసముతో కలిపి ఇస్తే గ్రహణులు తగ్గుతాయి.
- గోరింటాకు రసములో రసోత్తమాది చూర్ణము కలిపి పైన పూసినట్లయితే గజ్జి తగ్గుతుంది.
- గోరింటాకు కషాయములో మాదీఫల కాయల చూర్ణముకలిపి పైన రాసినట్లయితే కాలి పుండ్లు తగ్గుతాయి.
- గోరింటాకు రసముతో రస కర్పూరము బాగా నూరి పైన రాసినట్లయితే పుండ్లు మానుతాయి. కుష్ఠవ్యాధులు తగ్గుముఖం పడతాయి.
- పువ్వులు పక్కలో పరుచుకుని నిద్రించినా, లేక మూటలా కట్టి తలకింద పెట్టుకునినా నిద్ర హాయగా పడుతుంది.
- గోరింటాకు ఆకుల రసము కొబ్బరినూనెలోకలిపి తలకు మర్దనా చేసినట్లయితే తల వెంట్రుకలు గట్టిపడతాయి.