Cynodon Dactylon, Panicum Dactylon అనే శాస్త్రీయ నామాలు కలిగిన గరికను సంస్కృతములో దూర్వా, శాద్వల, శష్ప, శతపర్విక అని పిలుస్తారు. ఈ గరికలో అనేక రకములు ఉన్నాయి.
నీలదూర్వా-నల్లగరిక, శ్వేత దూర్వా-తెల్ల గరిక, గండ దూర్వా-పెద్ద గరిక, మాలాదూర్వా-చాలా దూరం ప్రాకే గరిక.
నల్లదూర్వా: పచ్చగా ఉంటుంది. అనేక కణుపులు కలిగిఉంటుంది.
శ్వేతదూర్వా: తెల్లనికాడ కలిగి ఉంటుంది. రేకులు కూడా తెలుపు. మంచి కణుపులు కలిగి ఉంటుంది.
మాలా దూర్వా: గ్రంధిలా కణుపులు, ముడులు కలిగి ఉంటుంది. కణుపు కణుపునకు మొలకలు వస్తాయి.
గండదూర్వా: సూదులవంటి ఆకులు కలిగి ఉంటుంది.
గరిక సామాన్య గుణములు
గరికకు ఫలములు, పువ్వులు ఉండవు. శీతవీర్యము కలిగినది. కషాయ మధుర రసమిశ్రమ రుచి కలిగి ఉంటుంది. రక్తపిత్తము శమింపచేస్తుంది. శ్లేష్మ హరము, వాతమును చేస్తుంది. తాపము, పిపాస, విసర్పి తదితర రోగములను శమింపచేస్తుంది. వాంతులు కడుతుంది. అరోచకమును తగ్గిస్తుంది. గండదూర్వా మాత్రము కటువిపాకము కలది. చర్మరోగములను హరిస్తుంది.
ఔషధములు
ముక్కువెంబడి కారే రక్తమునకు
గరిక వేళ్ళ రసమును 10 చుక్కలు ముక్కులో వేసి పీల్చినట్లయితే రక్తస్రావము కడుతుంది.
సర్పికి
గరిక రసముతో కాచిన ఆవునెయ్యి పైన పూసినట్లయితే చప్పి (ఎలర్జీ) హరిస్తుంది.
రక్తపైత్యమునకు
గరిక, మర్రిచిగుళ్ళు మెత్తగా నూరి తేనెతో కలిపి సేవించినట్లయితే రక్తపిత్తము శమిస్తుందని శుశ్రుతము అనే గ్రంథంలో వివరించారు.
కచ్చూపామాదులకు
గరికరసములో నాలుగ రెట్లు నూనె వేసి మరగబెట్టి ఆ నూనె రాసినట్లయితే కచ్ఛూపామాదులు తగ్గుతాయి.
మూత్రాఘాతమునకు
పల ప్రమాణము గరికివేళ్ళ ముద్దను నీళ్ళలో వేసికాచి చల్లారనిచ్చి త్రాగినట్లయితే మూత్రబంధము విడుతుంది.