కంద దుంప: మూలవ్యాధులకు మంచిమందు కంద

కంద: Tacca Pinnatifida , Arum, Campanulotus అనే శాస్త్రీయ నామాలు కలిగిన కంద దుంప పెరళ్ళలోను, పొలములలోను పెరిగే మొక్క. ఈ కందకు సంస్కృతములో సూరణ, అర్శోఘ్న అనే పర్యాయపదాలు ఉన్నాయి. ఊర కందలో పాటికంద, నీటికంద అనే రెండు రకాలు ఉన్నాయి. పాటికంద శ్రేష్టమైనది. తేలికగా ఉంటుంది. ఈ కందలో ఎరుపు, తెలుపుఅనే రెండు రకాలు. దీనిలో తెల్లకంద శ్రేష్టం. తెల్లకందకు దురద తక్కువగా ఉంటుంది. ఎర్రకంద దురద ఎక్కువ. 

కంద గుణములు

గుణములు ఇంచుమించుగా అడవికందకు, ఊరకందకు సమానముగానే ఉంటాయి. కారపు రుచి కలిగి ఉంటుంది. వగరు రుచి కూడా కొంచెం ఉంటుంది. ఉష్ణవీర్యము కలిగినది. విపాకమున కారపురుచిగా మారుతుంది. జఠరదీప్తిని కలిగిస్తుంది. కఫ వాతములను తగ్గిస్తుంది. క్రిములను పోగొడుతుంది. మూలవ్యాధులకు దీనికంటె మించిన మందు లేదు. వాతశూలలు, శ్వాసకాసలు, ప్లీహ, గుల్మములను హరిస్తుంది. దద్దుర్లు వచ్చేవారికి, కుష్ఠురోగులకు, రక్తపిత్త రోగులకు మాత్రం ఈ కంద ఎంతమాత్రమూ పనికిరాదు. 

తెల్లకంద

ఇది కారపు రుచి. ఉష్ణవీర్యము కలది. రుచి పుట్టించును. నులిపురుగులు, గుల్మములు, శూలలు హరిస్తుంది.

ఔషధములు

మూలవ్యాధికి 

కంద దుంపకు మట్టిపూసి కణకణలాడే నిప్పులలో ఉంచి ఉడికించి ఉడికిన తరువాత దానిని తీసి ఉప్పు, నూనె కలిపి సేవించినట్లయితే మూలశంకలు హరిస్తాయని వస్తుగుణప్రకాశిక అనే ఆయుర్వేద గ్రంథరాజం తెలియచేస్తోంది. 

బోదకాలుకు

కందదుంప మెత్తగా నూరి తేనె, నెయ్యి కలిపి పైన రాసిన బోదకాళ్ళు  వాపు తగ్గుతాయని చక్రదత్త గ్రంథం వివరిస్తోంది. 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.