చల్ల తాగండి ... చల్లగా ఉండండి

 

పెరుగులో నీళ్ళుపోసి కవ్వముతో చిలికి వెన్నతీసివేస్తే అది మజ్జిగ అవుతుంది. 

గుణములు

రుచి వగరును, పులుపు కలిగి ఉంటుంది. ఉష్ణవీర్యము. విపాకములో పులుపురుచిగా మారుతుంది. దీపనకారి, శ్లేష్మములను హరిస్తుంది. మూత్రమును జారీచేస్తుంది. విరేచనము కానివారికి ఇది బాగా పనిచేస్తుంది. గ్రహణీ రోగులకు, మూలవ్యాధులు ఉన్నవారికి అమృతంలా పనిచేస్తుంది. భోజనం పరిసమాప్తమయి సంతృప్తి కలగాలంటే తప్పనిసరిగా మజ్జిగ అన్నం ఆఖరులో తినాల్సిందే.  

అయితే ఆవు మజ్జిగకే ఇలాంటి గుణములు ఉంటాయని ఆయుర్వేదం తెలియచేస్తోంది. మజ్జిగలో శొంఠి చూర్ణము, సైంధవలవణమును కలిపి తాగినట్లయితే అజీర్ణము, గుల్మములను, పాండురోగమును సైతం పోగొడుతుంది. 

జీర్ణ జ్వరములకు మజ్జిగ మంచిది. ఉష్ణ కాలమందు, దుర్బలులకు, రక్తపిత్తము కలవారికి, భ్రమ, మూర్ఛ, దాహరోగము కలవారికి మజ్జిగ పనికిరాదు. మజ్జిగ వాంతులను కడుతుంది. విషజ్వరములకు హితకరమైనది. 

చల్లలో ఎన్నో రకాలు ఉన్నాయి. 

1.సముద్ధృత ఘృతము

ఘృత అనగా వెన్న అని అర్థము. సముద్ధృత ఘృతము అంటే వెన్నతీసిన మజ్జిగ అని అర్థం. ఇది లఘుగుణము కలిగి త్రిదోషములను హరిస్తుంది. 

2.అర్ధోద్ధృత ఘృతము

సగము వెన్నతీసిన మజ్జిగ. ఇది వీర్యవృద్ధి, పుష్ఠి, బలము కలిగిస్తుంది.

3.  అమద్ధృత ఘృతము

అనగా కొంచెం కూడా వెన్న తీయకుండా చేసిన మజ్జిగ. అంటే చిక్కటి మజ్జిగ. ఇది ఘనంగా ఉండి గురుత్వము కలిగిస్తుంది. కఫము పెంచుతుంది. త్వరగా జీర్ణము కాదు. జఠరదీప్తి లేనివారికి ఇది మంచిదికాదు. 

పంచవిధ తక్రములు 

ఘోలము

అనగా పెరుగులో నీళ్ళు కలుపకుండా, వెన్నతీయకుండా తరచి చేసిన చల్ల. ఇది కఫము ప్రకోపించినప్పుడు, శ్రమపడి ఉన్నప్పుడు, వాతము ప్రకోపించినప్పుడు, వాంతి అయినప్పుడు మిక్కిలి మంచిది.

మధితము

పెరుగులో నీళ్ళు కలపకుండా, వెన్నతీసివేసి చేసిన చల్ల. కఫము, పిత్తము హరిస్తుంది. రుచి పుట్టిస్తుంది. ధాతుపుష్టి. 

ఉదశ్వితము

పెరుగు ఎంత ఉందో అంత నీరు కలిపి, వెన్నతీసివేసి చేసినదే ఈ మజ్జిగ.ఇది దప్పిక, తాపము, ముఖశోష పోగొడుతుంది. పిత్తము, శ్లేష్మము హరిస్తుంది. ఇది శరీరానికి పూసినట్లయితే కుష్ఠురోగము కూడా శమిస్తుందని వస్తుగుణప్రకాశిక అనే ఆయుర్వేద గ్రంథంలో వివరింపబడింది.

ఛవిక

పెరుగుకు, రెండు రెట్లు నీళ్ళు కలిపి, వెన్నతీసి చేసిన దానినే ఛవిక అంటారు. ఇది స్వచ్ఛంగా ఉంటుంది. త్రిదోషములు, శ్రమ, ఛర్ది నివారిస్తుంది. 

మస్తు

మిక్కిలిఎక్కువగా నీరు కలిపి, వెన్నతీసి చేసినదే మస్తు. ఇది రుచి పుట్టిస్తుంది. దప్పిక, తాపము, నులిపురుగులు, మూలశంక, ప్లీహ వ్యాధులు పోగొడుతుంది. జీర్ణశక్తి పెంచుతుంది. 

ఇవే కాకుండా మజ్జిగలో మధితము, మిళితము, ఘోళము, షాడబము, కాలశేయము, కరమధితము, ఉదశ్వితము, తక్రము, దండాహతము, అతి మిళితము అని మరో పది రకాలు కూడా ఉన్నాయి. 

చల్లతో ఔషధములు

నెయ్యి రాసిన కుండలో పుల్లనిమజ్జిగ వేసి దానిలో ధనియాలు, నల్లజీలకర్ర, బోడతరము, పిప్పళ్ళు, ఏనుగు పిప్పళ్ళు, ఇంగువ, మోడి, కచ్చోరములు, వాము, చిత్రమూలము, కురాసానివాము ఒక్కొక్క దినుసులు చూర్ణముచేసి కుండలో కలిపి శీలమన్ను ఇచ్చి, పదిహేను రోజులు ఉంచి వడకట్టి అది రెండేసి ఔన్సుల వంతున సేవించినట్లయితే మూలవ్యాధులు, అరుచి, గ్రహణులు, వాతకఫములు తగ్గుతాయి. బలకరమైనది. 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.