నేలతాడి దుంపతో చెముడు మాయం

 

Curculigo Orchioids అనే శాస్త్రీయనామం కలిగిన నేలతాడిలో రెండు జాతులు కలవు. ముసలీ, తాలమూలి, ఖలిని, వారాహి అనే పేర్లు కూడా కలిగిన నేలతాడిలో నల్లరంగు దుంపలు కలిగినదే శ్రేష్ఠమైనది. సాధారణంగా ఇది తేమగల ప్రదేశాల్లో పెరుగుతుంది. దీని దుంప కోలగా, జిగురుగా ఉంటుంది. ఆకులు ఖర్జూరపు చెట్టు ఆకులవలె ఉంటాయి. మిక్కిలి చిన్నవిగా ఉన్న పసుపుపచ్చ రంగు పువ్వులు పూస్తాయి. దుంపకు వెంట్రుకల వంటి నులివేర్లు ఉంటాయి. దుంప విరిచిన లోపల తెల్లగా ఉంటుంది. ఈ నేలతాడి మొక్క అడుగు ఎత్తు ఉంటుంది. దీనిలో దుంపలోనే ఔషధ గుణాలు ఉంటాయి.

నేలతాడి గుణములు

 దుంప తీపి రుచి కలిగినది. చలువ చేయును. మధురవిపాకము, పిచ్ఛలగుణము కలిగినది. మిక్కిలి వీర్యవృద్ధి. పుష్టిని, బలమును కూడా కలిగించును. కఫమును చేస్తుంది. రసాయన ద్రవ్యము. వాతములను హరించును. 

ఔషధములు

ముఖకాంతికి

నేలతాడి దుంపను మేకపాలతో కలిపి నూరి కొంచెం తేనె కలిపి ముఖమునకు రాసిన ముఖము కాంతివంతమవుతుంది. 

చెవితమ్మి పెరుగుటకు

నేలతాడి దుంప చూర్ణము, గేదెవెన్నతో నూరి ఆ ముద్ద చిన్న పిడతలో పెట్టి వారము రోజులు ధాన్యపురాశిలో ఉంచి తీసిన తరువాత దానిని చెవితమ్మికి రాసినట్లయితే కర్ణపాళి వృద్ధినొందును అని వస్తుగుణ ప్రకాశిక గ్రంథం వివరిస్తోంది. 

చెముడునకు

నేలతాడి దుంప, బావంచాలు చూర్ణముచేసి కలిపి తినినట్లయితే చెముడుపోవును.

వీర్యవృద్ధికి

  • దుంపచూర్ణము పాలతో కలిపి కొంచెం పంచదార చేర్చి తాగుతూ ఉన్నట్లయితే వీర్యవృద్ధి జరుగుతుంది. శుక్ల నష్టము అరికట్టి సంభోగశక్తి పెంచుతుంది. 
  • నేలతాడి దుంప, గొబ్బి విత్తనాలు, పల్లేరుకాయలు, దూలగొండి విత్తనాలు ఈ నాలుగూ సమభాగములుగా చూర్ణముచేసి పాలతో కలిపి తాగినా లేక పంచదార, నెయ్యి వేసి లేహ్యముగా తయారుచేసుకుని తినినా వీర్యము బాగా వృద్ధి చెందుతుంది. శుక్ల దోషములు తొలగించి సంభోగ శక్తి పెంచుతుంది. 
  • నేలతాడి చేదురుచి కలిగి ఉంటుంది. సువాసన కలిగి ఉంటుంది. బలకరమైనది. శ్వాస, మూలశంక, మూత్రకృచ్ఛము, అతిసారము, శగ మొదలైన వ్యాధులను పోగొడుతుంది. వీర్యవృద్ధి చేసే ద్రవ్యములలో చేర్చి వాడినచో చక్కని ఫలితమును ఇస్తుంది. 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.