గన్నేరుచెట్టు Nerium Odorum, Nerium Thebaci అనే శాస్త్రీయ నామాలు కలిగి ఉంటుంది. సంస్కృతంలో కరవీరము, చండాతక, అశ్వమార అనే పేర్లు కూడా కలిగిన గన్నేరు చెట్టును పువ్వుల రంగును బట్టి ఏ రకమో నిర్ణయించవచ్చు. వాడుకలో ఉన్న రకములు ఎర్ర గన్నేరు, పచ్చ గన్నేరు, తెల్ల గన్నేరు, ముద్ద గన్నేరు, వాడ గన్నేరు, బిళ్ళ గన్నేరు మొదలైనవి. ఇంచుమించు చెట్టు రూపం కూడా సమానంగానే ఉంటాయి. పచ్చ గన్నేరు మాత్రం వేరుగా ఉంటుంది. గన్నేరు ఆకులు మిక్కిలి సన్నంగా ఉంటాయి. కాయలు గుండ్రంగా, పకలదేరి ఉంటాయి. కాయలు పండితే నల్లగా మారతాయి. ఈ చెట్టు సర్వాంగములలోను పాలు కారుతుంది. ఈ పాలు కొంచెం పొక్కే స్వభావం కలిగి ఉంటాయి. ఈ కాయలోని గింజలు విషపూరితాలు.
గన్నేరు చెట్టు గుణములు
కారము, చేదు కలిసిన రుచి కలిగి ఉంటుంది. జ్వరమును హరిస్తుంది. నేత్రములకు మంచిది. కుష్ఠురోగము, దురదలు పోగొడుతుంది. పైన పూతగా మాత్రమే వినియోగించాలి.
ఎర్రగన్నేరు తీక్ష్ణగుణము కలిగి ఉంటుంది. విరేచనకారి, విషహారి, చర్మదోషములు, వ్రణములు, కుష్ఠు నివారిస్తుంది.
గన్నేరు చెట్టులో ఔషధములు
కుష్ఠు నివారణకు
గన్నేరు చెట్టు వేరు కషాయమును తీసి లేపనముగాను, లోనికి పుచ్చుకోవడం, స్నానం చేసేటప్పుడు నీటిలో కలిపి చేయడం వంటి వాటి వలన కుష్ఠురోగము శమిస్తుందని వస్తుగుణ ప్రకాశిక అనే వనమూలికా గ్రంథం లో వివరింపబడింది.
తెల్ల వెంట్రుకల నివారణకు
గన్నేరు వేరు పాలతో కలిపి నూరి తెల్ల వెంట్రుకలకు జాగ్రత్తగా లేపనం చేసినట్లయితే తెల్ల వెంట్రుకలు రావడం తగ్గుతుంది.
మూత్రకోశములో రాళ్ళు కరగడానికి
పాటలీ వృక్షము యొక్క వేరు, గన్నేరు చెట్టు వేరు కలిపి బూడిదగా అయ్యే వరకూ కాల్చి దానిని నీటిలో కలిపి లోనికి ఇచ్చినట్లయితే అంటే సేవించినట్లయితే మూత్రకోశములో రాళ్ళతో బాధ పడుతున్న రోగికి ఉపశమనం కలుగుతుంది. ఈ మందు వాడుతున్నప్పుడు పాలు, నెయ్యి, తీపి పదార్ధాలను మాత్రమే భుజించవలెను.
వ్రణములు పగలడానికి
దారుణమైన వాపులు గాని, వ్రణములు గాని పగులని ఎడల చిత్రమూలము, గన్నేరు వేర్లను నూరి పైన రాసినట్లయితే పగులును.
కండ్ల కలకలకు
ఎర్ర గన్నేరు గాని, తెల్ల గన్నేరు గాని చిగుళ్ళను పిండితే వచ్చే నీటిని కండ్ల కలక ఉన్న వారి కళ్ళలో వేసినట్లయితే పుండుపడిన కళ్ళు కూడా మానిపోతాయని చక్రదత్త అనే గ్రంథంలో వివరించారు.
గజ్జి నివారణకు
గన్నేరు వేరును కల్వంలో వేసి నూనెతో కలిపి నూరిన నూనెను గజ్జి వంటి చర్మరోగంపై పూసినట్లయితే తప్పనిసరిగా ఉపశమిస్తుంది.