భృంగ, మార్కవ అనే పేర్లు కూడా కలిగిన గుంటకలగర సర్వాంగములు కూడ ఉపయోగకరమైనవి. నలుపు, తెలుపు, పసుపుపచ్చ రంగుల పూవులతో మూడు రకములు ఉంటాయి. నీటి ప్రదేశాలలో ఈ మొక్క ఎక్కువగా పెరుగుతుంది. మనం ‘‘భృంగరాజ్ తైలం’’ అని ఆయుర్వేద షాపుల్లో దొరికే ఆయిల్ ఈ గుంటకలగర నుంచి తయారు చేసినదే.
నల్ల గుంటకలగర
ఆకులు, పువ్వుడు, కాడలు కూడా నల్లగా ఉంటాయి. సంస్కృతంలో నీలభృంగరాజము, మహాభృంగము, శ్యామలము, సునీలకము అనే పేర్లతో కూడా పిలుస్తారు. నల్ల గుంటకరగర అన్నింటికన్నా విశేషమైనది. కాని లభించడం కష్టము.
పురాణాల ప్రకారం నల్లగుంటకలగర రసము శరీరానికి పూసుకున్నట్లయితే అదృశ్యయోగము సిద్ధిస్తుందని, జరామరణములు కలుగవనీ వాడుక. అందుకే ఈ మొక్క అలభ్యము.
పచ్చగుంట కలగర
సంస్కృతములో పీతభృంగరాజము, స్వర్ణభృంగారము, అని కూడా అంటారు. కళ్ళకు మేలు చేస్తుంది. కఫము, ఆమము, ఉబ్బులు హరిస్తుంది. జుట్టు నల్లబరుస్తుంది.
నొప్పులకు
గుంటకలగర రసము, మేక పాలు సమానముగా కలిపి ఎండలో ఇరగనిచ్చి రాసినట్లయితే ఎటువంటి నొప్పులైననూ తగ్గుతాయి.
గుంటకలగర రసమును రాసినట్లయితే ఎటువంటి పుండ్లు అయినా తగ్గుతాయి.
గుంటకలగర చూర్ణము ఆ రసముతోనే నూరి మాత్రలుగా చేసి సేవించినట్లయితే రక్త విరోచనాలు తగ్గుతాయి. కడుపునొప్పి తగ్గుతుంది.
రేచీకటికి
చేపగుడ్డు, గుంటకలగర ఆకు రసం కలిపి లోనికి పుచ్చుకుంటే రేచీకటి తగ్గుతుంది. అయితే ఏడు రోజుల పాటు ఇలా చేసినట్లయితే తప్పక మంచి ఫలితం ఉంటుందని చక్రదత్త అనే గ్రంథంలో పేర్కొనబడింది.
ఆవుపాలు, గుంటకలగర రసం, యష్టి మధుకం, నువ్వుల నూనె సమమైన పాళ్ళలో కలిపి బాగా మరగబెట్టి ఆ నూనెను మర్దన చేస్తూ ఉన్నట్లయితే అకాలములో తెల్లబడిన వెంట్రుకలు నల్లబడతాయి.
గుంటకలగర పువ్వులు, మందారపువ్వులు, మేకపాలతో నూరి ఆ ముద్దను ఇనుప పాత్రలో ఉంచి, వారంరోజులపాటు భూమిలో పాతిపెట్టి తీసి, దానిని మరలా గుంటకలగర రసముతో కలిపి తలకు మర్దనా చేసి ఒక రాత్రి అంతా ఉంచి ఉదయాన్నే తలస్నానం చేస్తే వెంట్రుకలు నల్లగా, గుజ్జుగా ఎదుగుతాయి.
కొలెస్టరాల్
గుంటకలగర చూర్ణము, కరక్కాయ చూర్ణము, పాతబెల్లముతో కలిపి సేవించినట్లయితే కొలెస్టరాల్ అదుపులోకి వస్తుంది.
బొల్లి వ్యాధికి
లోహపాత్రలో నూనె వేసి అందులో గుంటకలగర వేయించి తిని, పాలు తాగినట్లయితే బొల్లి వ్యాధి తగ్గుతుందని వస్తుగుణ ప్రకాశిక గ్రంథం తెలియచేస్తోంది.