ఊరగాయలలో ఆవకాయ చాలా గొప్పది. ఆంధ్రులు ప్రతిదినమూ వాడబడే ఆధరువు. ప్రతి పూట ఈ ఆవకాయ లేనిదే భోజనము తృప్తి ఉండదు.
ఆవాల గుండ, ఉప్పు పొడి, మిరపకాయల గుండ సమముగా చేర్చి అందులో కొంచెం మెంతులు, నువ్వుల నూనె కాని, ఆవ నూనె కాని కలిపి పుల్లని మామిడికాయ ముక్కలు వేసి తయారు చేసినదే ఆవకాయ. ఈ ఆవకాయను జాడీల్లో నిల్వ ఉంచుకుని ఏడాది పాటు తృప్తిగా ఆరగిస్తారు. కొందరు ఈ ఆవకాయలో బెల్లం కూడ చేర్చి తయారుచేస్తారు.
ఆవకాయ గుణములు
ఆవకాయ వేడిచేస్తుంది. అరుచి పోగొడుతుంది. చాలా రుచిగా ఉంటుంది. నులిపురుగులు నశింపచేస్తుంది. వాతము హరిస్తుంది. కొందరికి శ్లేష్మము పెంచుతుంది. కడుపునొప్పి, కడుపు ఉబ్బరము తగ్గిస్తుంది. అతిసారము పోగొడుతుంది. అజీర్తికి ఇది అందరికీ తెలిసిన ఔషధము. దీనికి విరుగుళ్ళు నేయి, మజ్జిగ. అన్నములో ఆవకాయ కలుపుకుని ఎంత నేయి వేసుకుంటే అంత రుచికరముగా ఉంటుంది. అందులో కొంచెం పెరుగు కూడా కలుపుకుని తింటే ఆ రుచి చెప్పతరము కాదు. అమృతముకైనా అంత రుచి ఉండదు. ఇలా తిన్నట్లయితే ఎక్కువగా వేడి చేయదు.
ఆవకాయ కలుపుకున్నప్పుడు కొందరు నువ్వులనూనె గాని వేరుసెనగ నూనె వేసుకుని తింటారు. దీనివల్ల రుచి పెరుగుతుంది. కానీ పైత్యము కూడా పెంచుతుంది. దురదలు పుట్టిస్తుంది. కావున నేతిని గాని, వెన్నను గాని కలుపుకుని తింటే మంచిది. రుచిని కూడా పెంచుతుంది.