ఉలవలతో శ్వాసరోగములకు చెక్

కుళుద్ధ, తామ్రబీజ అనే నామాలు కలిగిన ఉలవలలో మూడు రకములు ఉంటాయి. తెలుపు, నలుపు, ఎరుపు. నల్ల ఉలవలు మిక్కిలి శ్రేష్ఠమైనవి. 

గుణములు

  • ఉలవలు వగరు రుచి కలిగి ఉంటాయి, వేడి చేస్తాయి. విపాకమున కారపు రుచిగా ఉంటాయి. రూక్షగుణము కలది. కఫవాతములను శమింపచేస్తుంది. దగ్గులు, శ్వాసరోగములు హరిస్తుంది. విదాహమును కలిగిస్తుంది. మలబద్ధకము చేస్తుంది. రక్తపైత్యవ్యాధిని కలిగిస్తుంది. శరీరంలోని నీటిని ఆరుస్తుంది. ఋతు రక్తమును జారీచేస్తుంది. ప్రసవ స్త్రీల మైల రక్తమును కూడా విడుదల చేస్తుంది. 
  • ఉలవకట్టు వాతమును తగ్గిస్తుంది. మహావాతములను కూడా శమింపచేస్తుంది. మూత్రకోశములోని రాళ్ళను కరిగించి మూత్రమును జారీచేస్తుంది. నల్ల ఉలవల కట్టు చాలా మంచిది. ఉలవ పప్పు కూడ చాలా రుచిగా ఉంటుంది. ఉలవలతో ఏరకమైన పదార్ధాలను తయారుచేసి సేవించినా ఉలవలయొక్క స్వాభావిక గుణములనే కలిగి ఉంటాయి. 
  • ఉలవలు మానవులకే కాక పశువులకు కూడ మిక్కిలి ఉపయోగకరమైనవి. పశువులకు దొమ్మరోగములు కలిగినప్పుడు నల్ల ఉలవలు ఉడకబెట్టి పెడతారు. అలసి పనిచేసిన పశువులకు ఉలవలు నానబెట్టి పెట్టినట్లయితే వంటినొప్పులు తగ్గి బలము చేకూరుతుంది. 
  • పాడిపశువులకు కూడా ఉలవలు నానబెట్టి మెత్తగా రుబ్బి పెట్టినట్లయితే పాలు బాగా ఇస్తాయి. పశువులకు తగిలిన దెబ్బలకు ఉలవనీళ్ళతో ఎఱ్ఱమట్టి కలిపి పట్టు వేస్తారు. ఉలవ పొట్టు కూడా పశువులకు మంచి ఆహారము. ఉలవలకు లోచనాహిత అనే పేరు కూడా ఉంది. అంటే ఇవి నేత్రములకు మిక్కిలి హితకరమైనవి అని అర్థము. 
  • వేడిచేస్తాయి. కఫమును హరిస్తాయి. వీర్యమును శమింపచేస్తాయి. మూలవ్యాధులను తగ్గిస్తాయి. 
  • ఉలవలు కటువిపాకము కలవి. లఘు గుణము కలిగినవి. చెమటను హరిస్తాయి. క్రిమి హరము, జ్వరహరము. 
  • ఉలవ కషాయములో కొంచెం పులుపుచేర్చి కొంచెం సైంధవ లవణము, మిరియపు పొడిని కూడా చేర్చి త్రాగినట్లయితే వాతశూలలు హరించును.
  • వేయించిన ఉలవల చూర్ణము లోనికి తీసుకున్నట్లయితే జ్వర సమయములో వచ్చిన తీవ్ర చెమటను తగ్గిస్తుంది.

ఉలవకట్టు 

వేయించకుండ ఉలవలు పప్పుచేసి దానితో తయారుచేసినదే ఉలవకట్టు. మధుర రసము, ఉష్ణవీర్యము కలది. ఆకలి పుట్టిస్తుంది. కఫప్రకోపమును, మూలశంకలు హరిస్తుంది. కొవ్వు తగ్గించి శరీరాన్ని తేలికపరుస్తుంది.

ఉలవ గుగ్గిళ్ళు

బళ్ళులాగటం, దుక్కిదున్నటం మొదలైన బరువు పనులు చేసే ఎడ్లకు, గుర్రములకు, దున్నలకు ఇవి అత్యావశ్యకములు. ఉలవలు అందించకపోతే గుఱ్ఱములు ఎందుకూ పనికిరావు. ముఖ్యంగా వాతములు, మేహములు, గుల్మములు, ఉదరవ్యాధులు, క్షయ హరిస్తాయి. నీరసము దరిచేరనీయవు. శ్రమను హరిస్తాయి. 

ఉలవచారు

వేయించిన పప్పును కానీ లేక పచ్చిపప్పును కానీ వండి, దానిలో కొద్ది చింతపండు రసము చేర్చి తిరిగి కాచి, తాలింపుపెడితే ఉలవచారు తయారవుతుంది. ఇది చాలా రుచిగా ఉంటిం. రుచి, అన్నహితవు కలిగిస్తుంది. గర్భవాతమును హరిస్తుంది. బలము కలిగిస్తుంది. మలబంధము చేస్తుంది. వీర్యము పలుచబలచి శీఘ్రస్ఖలనము కలిగిస్తుంది. 

ఉలవ పప్పు

కందిపప్పువలె వేయించిన ఉలవలు పప్పు చేసి వండినది. సంస్కృతములో దీనిని కుళుత్థసూప అంటారు. కటురసము కలది. కఫము, వాతము, శ్వాసకాశలు హరిస్తుంది. వేడిచేయును, రక్తపుష్టి, బలము, వీర్యవృద్ధి కలిగిస్తుంది. 

ఉలవ పచ్చడి

ఉలవలు వేయించి పప్పుచేసి, ఉప్పు, కారము, జీలకర్ర చేర్చి కందిపప్పు పచ్చడిలాగా చేయాలి. ఇది బలిహారము. అయితే జీర్ణించికోగలిగినవారికి బలము, పుష్టి కలిగించును. హితము కలిగిస్తుంది. 

ఉలవ పులగము

బియ్యములో సగమైనను, నాలుగవ వంతు అయినను వేయించిన ఉలవపప్పు, చాలినంత ఉప్పు, రవంత పసుపును చేర్చి అత్తెసరుగా వండిన అన్నమునే పులగము అంటారు. కటువిపాకము, వేడిచేయును. ఆకలి పుట్టించును. తృప్తి కలిగిస్తుంది. కఫము, వాతము, క్రిములు, శ్వాసకోసలు హరించును. 

ఉలవ పొడి

వేయించిన ఉలవపప్పుతో కందిపొడివలె తయారుచేసినది. రుచి, అన్నహితవు కలిగించును. వేడిచేయును. బలము, పుష్టి కలిగించును. కాని అజీర్తి, మలమూత్రబంధము పుట్టిస్తుంది. కడుపునొప్పి, కడుపు ఉబ్బరము కలిగిస్తుంది.   

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.