ఇంగువతో మూర్ఛకు చెక్

హింగు, రామఠ అనే పేర్లు కలిగి, ఫెరూలా అసఫటోడా అనే శాస్త్రీయ నామం కలిగిన ఇంగువ చెట్టు నిలువెత్తు పెరిగే మొక్క జాతి లోని వృక్షము. ఈ చెట్టు అడవులలో పెరుగుతుంది. ఎక్కువగా పంజాబ్, కాశ్మీర్, పెరిసియా, ఆఫ్ఘనిస్థాన్ వంటి శీతల ప్రాంతాల అడవులలో 

 విస్తారముగా కనిపిస్తుంది ఇంగువ చెట్టు. ఇంగువచెట్టు జిగురు, ఆకులు, వేరు కూడ ఉపయోగకరమైనవే. ఇంగువచెట్టు మ్రాను అరచేయి మందమైన దళసరిగా ఉంటుంది. ఆకులు కోలగా వాలివి ఆకులవలె  ఉంటాయి. ఒక కొమ్మకు నాలుగైదు ఆకులు ఉంటాయి. పువ్వులు వావిలి పువ్వులవలె జంటగా ఉంటాయి. ఈ చెట్టు జిగురు లేక పాలకే ఇంగువ అని పేరు. అసలైన ఇంగువ ఎప్పుడైనా మెత్తగా ఉంటుంది. దీనిలో కొన్ని వస్తువులను చేర్చి వంట వండి అనేక రకముల ఇంగువను తయారు చేస్తారు. ఇంగువ హిందూ దేశములో ప్రాచీన కాలము నుంచీ వాడుకలో ఉంది. 

ఇంగువ గుణములు

ఇంగువ మూర్ఛకు ముఖ్యమైన మందు. బాలింతకు ఇంతకంటె పరమ ఔషధము వేరే లేదు. ప్రత్యేకముగా పొత్తి కడుపులో వచ్చే వ్యాధులకు, గుండె వ్యాధులకు పనిచేస్తుంది. ఇంగువ మిక్కిలి వేడి చేసే గుణము ఉంటుంది. మిక్కిలి కారము, వేడిచేసే గుణము కలిగి ఉంటుంది. విరేచనము చేస్తుంది. వాత, కఫములను హరిస్తుంది. గుల్మములు, ఉదర రోగములను, కడుపు ఉబ్బు, వంధ్యత్వము, శూలలు, హృద్రోగములను నాశనము చేస్తుంది. నేత్రములకు మంచిది. రుచ్యమైనది. పచనమును చేస్తుంది. పైత్యము చేస్తుంది. స్త్రీల ఋతుబద్ధమును పోగొట్టి ఋతువును జారీచేస్తుంది. ఇంగువ కొంచెం వెచ్చచేసి పిప్పిపంటిపై బెడితే క్రిమి నశించి బాధ తగ్గుతుంది. అజీర్ణములకు దీనికంటే మందేలేదు. 

ఇంగువ ప్రయోజనాలు

ఇంగువ ఒక భాగము, పిప్పళ్ళు ఒక భాగము, హారతి కర్పూరము ఒక భాగము, తుంగ దుంపల చూర్ణము రెండు భాగములు ఇవన్నీ కలిపి నీళ్ళతో మెత్తగా నూరి శనగగింజలంత మాత్రలు చేసి జీలకర్ర రసముతో తాగించినట్లయితే కలరా వ్యాధి అరికట్టబడుతుంది. ప్రబలమైన అజీర్ణ విరేచనములు కడతాయి. ఇంగువ, ముసాంబ్రము సమముగా నూరి శనగగింజలంత మాత్రలు చేసి కురంజీవాము రసముతో సేవింపచేస్తే కడుపులో ఏలుకపాములు చచ్చి పడిపోతాయి. 

నారి కురుపులకు మంచి మందు

ఇంగువ, సీతాఫల ఆకు రసముతో అరగదీసి పైన రాసినట్లయితే నారి కురుపులోని పురుగు చస్తుంది. గర్భిణీస్త్రీలు ఇంగువ వాడకూడదు. ఇంగువ అరుకు గాయాలనుండి స్రవించే రక్తమును ఆపుతుంది. పిల్లలకు వచ్చే అసాధ్యమైన కోరింతదగ్గులు ఈ ఇంగువవలన తగ్గుతాయి. 

బ్రోంఖైటిస్ అనే గొంతుక దగ్గులు కూడా శమిస్తాయి. అజీర్ణము, ఆమదోషము వలన కలిగే వికారములు ఒకటి ,రెండు గ్రాముల ఇంగువ పాలతో కలిపి ఇచ్చినట్లయితే శమించును.  

మూర్ఛలు  తగ్గును

ఇంగువను ఆరులేక ఏడు గ్రాములు తీసుకుని నిప్పులపై వేసి దాని పొగ నోటితో పీల్పించినట్లయితే మూర్ఛలు ఉన్నవారికి బాగా పనిచేసి తగ్గిస్తాయి. రెండు లేక మూడు గ్రాముల ఇంగువను తేనెతో కలిపి నాకిస్తే కూడా మూర్ఛలు తగ్గుతాయి. చిన్న పిల్లలకు వాతరోగములు తగ్గడానికి ఇంగువను నీళ్ళలో కలిపి ఎనిమాలా లోనికి ఇచ్చినట్లయితే చక్కని వేడి చేసి నాడికి చురుకుదనం ఇచ్చి పొట్టను వేడెక్కిస్తుంది. ఇన్ని రకాల లాభాలు కలిగిన ఇంగువను వినియోగించడం ఎంతో మంచిదని ఆయుర్వేద నిపుణులు చెపుతున్నారు. 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.