ఈ నిమ్మ జంభ, దంతశఠ, జంబీల, దబ్బ, నారింజ మొదలగు సిట్రస్ జాతికి చెందిన చెట్టు. ఈ నిమ్మ సాధారణ వృక్షము. చెట్టుకు ముళ్ళుండును. ఆకులు పెళుసుగాను, నలుపుగాను ఉండును. పువ్వు తెల్లగా ఉంటుంది. పువ్వులో కేసరములు ఉంటాయి. కాయలు గుండ్రముగా ఉంటాయి. పచ్చికాయలు ఆకుపచ్చ, పండువి పసుపుపచ్చగాను ఉంటాయి. ఆకుకు, పండునకు, పువ్వునకు ఒకే సువాసన ఉండును. నిమ్మలో పుల్లనిమ్మ, తియ్యనిమ్మ అనేరెండు రకాలు ఉంటాయి.
నిమ్మ గుణములు
నిమ్మపండు పులుపురుచి కలది. వేడిచేయును. విపాకమున పులుపు రుచిగానే ఉండును. గురుగుణము, దప్పి, శూల, కఫోత్కేశము, వాంతి మొదలగు రోగములు నివారించును. వాత శ్లేష్మములను, మలబంధములను పోగొట్టును, పైత్యమును చేయును. గుల్మములు, శ్రమ, శీత, పిత్త జ్వరములను హరించును.
తియ్యనిమ్మ
పండు తీపి రుచి కలది. శీతవీర్యము, కఫ, పిత్తము, మూలవ్యాధిని నివారించును. తృప్తిని, పుష్టిని కలిగించును. పచనకారి, అగ్నిదీపనకారి, రుచికరమైనది.
అధికముగా సేవించిన నెయ్యి జీర్ణించుకోవడానికి నిమ్మకాయల రసము సేవించవలెను.
పైత్య అజీర్ణములకు
జంబీర రసాయనము సేవించాలి. నిమ్మపండ్ల రసము ఒకసేరు, అల్లంరసం పావుశేరు, పంచదార ఒక సేరు ఇవన్నీ కలిపి లేతపాకముగా కాచినట్లయితే జంబీర రసాయనము తయారవుతుంది. ఇది సేవించినట్లయితే పైత్యము, అజీర్ణము, అరోచకము, మలబద్ధము మున్నగు రోగములు హరించును.
అజీర్ణ తేనుపులకు, ఎక్కిళ్ళకు
ప్రతిదినము భోజనానికి ముందు, తరువాత రెండు చెంచాల నిమ్మరసం సేవిస్తూ ఉన్నట్లయితే ఎక్కిళ్ళు, అజీర్ణ తేనుపలు కట్టును. ప్లీహములయందు దోషములు కూడా నివారించును. చక్కగా విరేచనమగును.
దెబ్బ నొప్పులకు, వాత నొప్పులకు
శేరు నిమ్మపళ్ళ రసములో అర్థశేరు నువ్వుల నూనెకలిపి నూనె మాత్రం మిగులునటుల కాచి నూరి మద్దనాచేసి వేడినీళ్ళతో కాపడము పెట్టినచో దెబ్బనొప్పులు, వాతనొప్పులు హరించును. నిమ్మకాయ రెండు చెక్కలుగా కోసి నూనెలో ముంచి వేడిచేసి దెబ్బలపైన కాచినను వాతనొప్పుులు హరించును.
రెప్పల వెంట్రుకలు ఊడినందుకు
రెండు ని మ్మకాయల రసము, నాలుగు తులాల ఆవువెన్న లో కలిపి నూరి, నీళ్ళుపోసి రెండు రాత్రుళ్ళు, రెండు పగళ్ళు ఉంచి ఆ వెన్ననీటితో రెప్పలను 25 పర్యాయాలు కడిగి, పింగాణి గాని, గాజు సీసాలో గాని ఉంచి రెండు గసగసాల ప్రమాణం కంటిలో పెట్టిన కనురెప్ప వెంట్రులకు కనురెప్ప సంబంధించిన వాపు, దురద నివారణ అగును.
కంటి జబ్బులకు
వేపాకు మట్టి పిడతలో వేసి పై మూత కప్పి చీలమన్ను ఇచ్చి కాల్చి ఆకులు బూడిద అయ్యేవరకూ నిప్పులలో ఉంచి ఆ బూడిదను నిమ్మకాయ రసముతో నూరి కంటిలో పెట్టినచో దురద, ఎరువు, నీరుకారుటతగ్గును.
కంటి మచ్చలకు
జింక కొమ్మును నీళ్ళతోను, నిమ్మకాయ రసము తోను బాగుగా నూరి మిరియపు గింజంత మాత్రలు చేసి అవసరమైనప్పుడు పెట్టిన ఎడల కంటి మచ్చలు నివారణ అగును.
గంజాయి, నల్లమందు మత్తు పోవడానికి
రెండు లేక మూడు చెంచాల నిమ్మపండు రసము, గంటకొక చెంచా చొప్పున ఇచ్చుచుండిన గంజాయి, నల్లమందు మత్తులువిడును.
ఉన్మాదములకు నిమ్మపండ్ల రసము తలకు మర్దనా చేసి, కడవలతో నీళ్ళ స్నానము చేయించిన ఉన్మాదములు, మూర్ఛలు కట్టును.
కంటి కలకలకు
పటిక చూర్ణమును, నిమ్మపండ్ల రసముతో భావన చేసి ఆ చూర్ణమును కలబంద గుజ్జు ముక్కపై చల్లి ఆ ముక్క పల్చని గుడ్డపై వేసి కంటికి అద్దుచుండిన సమస్త కండ్ల కలకలు, బాధలు శమించును.
సన్నిపాత జ్వరము, జిహ్వ దోషములకు
నిమ్మపండ్ల రసముతో రుద్రాక్ష, పగడము అరగదీసి నాలుకకు రాసినట్లయితే రోగములు హరించును.
వాంతులకు, అగ్నిదీప్తికి నిమ్మకాయ మురబ్బా
నిమ్మకాయలను ఉప్పునీటిలో పది రోజులు ఊరబెట్టి వానిని తీసి ఒకమారు మంచి నీటితో ఉడకపెట్టవలెను. ఈ ఉడకపెట్టడంలో కొన్ని కాయలు పగులును. ఆ పగిలిన కాయలను తీసి రెట్టింపు పంచదార నీళ్ళతో ఉడకపెట్టిన మురబ్బా అగును. దీనిని సేవించిన వాంతియు, అగ్నిదీప్తియు, ఎక్కిళ్ళు, త్రేనుపులు కట్టును.
కంటి జబ్బులకు జంబీరాద్యంజనము
నిమ్మపండ్లను రాగి సూదులతో పొడవవలెను. ఆ కన్నములయందు లవంగములను గుచ్చవలెను. పిమ్మట కాయకంతకును దళసరిగా వెన్నరాయవలెను. అది నలభైరోజులు మంచినీటిలో నానబెట్టి ప్రతీ దినము పాతనీరును తీసింవేసి, కొత్తనీరు పోస్తూ ఉండాలి. పిమ్మట ఆ కాయలను రాగిపళ్ళెముపై కంచుపాత్రతో 15 దినాలు మర్దనా చేయవలెను. అది కాటుక అగును. దీనిని కంటికి పెట్టుకొనుచుండిన కంటి పూసలు, పొరలు మొదలగు నేత్రరోగములు హరించును.
రక్తక్షీణతయందును, ఉబ్బు వ్యాధియందును , శ్లేష్మరోగులకు నిమ్మకాయ పనికిరాదు.
నిమ్మతో ఇతర ఉపయోగాలు
- ఈ నిమ్మకాయతోె అనేక ఊరగాయలను పెట్టుకుంటారు. సంవత్సరము పొడవునా నిల్వ ఉంటుంది. ఆవకాయవలె పెట్టుకొనుట ఒక పద్ధతి . మెంతికాయవలె పెట్టుకొనుట ఒక పద్ధతి. నిమ్మకాయలను నాలుగు చెక్కలుగా కోసి ఉప్పు పొదిగి ఎండబెట్టి తరువాత ఆ ముక్కలను వేయించిన మెంతికారములో కలిపి ఊటలో పడవేయుదురు. ఇది మెంతికాయ పద్ధతి.
- నిమ్మకాయ రసము కూరలలోను, పచ్చళ్ళలోను , చారులో కూడా వేసుకుంటారు. చింతపండు రసముకంటె ఇది ఎంతో రుచిగాను, పథ్యముగాను ఉండును.
- నిమ్మకాయ పెచ్చులను ఎండబెట్టి, కాల్చి ఆ మసిలో ఉప్పుకలిపి పండ్లు తోముకొనిన దంత బాధలన్నియు శమించును. ఆ మసిని కొబ్బరినూనెలో కలిపి పైన రాసినట్లయితే గజ్జి, చిడుము మొదలగు చర్మరోగములు నశించును.
నవీన వైద్యకమతము
నిమ్మకాయ రసము తాగుతూ ఉన్నట్లయితే యూటలిక్ యాసిడ్ మూత్రము వెంబడిని హరించును. అశ్మరోగము వలన మూత్ర బంధము కలిగినప్పుడు ఉపయోగకారిగా ఉండును. ఈ నిమ్మరసము చాలా విస్తారముగా వాడిన జీర్ణశక్తియందు దుర్బలత్వము ఏర్పడును. రక్తమునందలి జీవశక్తి తగ్గును. అష్ఠీలరోగమునకు మిక్కిలి హితకరమైనది. పిపాసమెండుగా ఉండునపుడు నిమ్మరసం ఉపయోగిస్తారు.చర్మము, వృషణములయొక్క శక్తిని వృద్ధిచేయును.మూత్ర ప్రతాపములయందు శీతలపానీయములతో నిమ్మరసము చేర్చి వాడిన గుణకారిగా ఉండును. కడుపు శెగపోయినప్పుడు జఠరదీప్తి లేనప్పుడు కూడ దీనిని వాడవచ్చును. మరియు రక్తములో స్వభావముగా ఉండు క్షారగుణము, వ్యాప్తినొందునప్పుడు గృధసీవాతము, కటివాతము మొదలయినవి బయలుపడును. అవి నిమ్మరస పానమువల్ల శమించును. ఈ రసము అమితముగా వాడినట్లయితే ఊబశరీరము పెరుగును.