ధనియాలతో కలుగు మేలు

ధన్యాకా, ధాన్యకా, కస్తుంబరీ అనే శాస్త్రీయ నామములు కలిగిన ఈ ధనియాలు రెండు అడుగులవరకూ పెరిగే మొక్క. ఆకులు సరస్వతీ ఆకుల వలె  గుండ్రముగా, చిన్నవిగా ఉంటాయి. భారతదేశములో చాలాచోట్ల పెరుగుతాయి. ఈ మొక్క సంవత్సరముపాటు జీవిస్తుంది. ఆకులకు చుట్టూరా కంగోరా ఉండును. ఈ మొక్క చిలువలు పలువలుగా అల్లుకుని ఉంటుంది. ఆకు నునుపుగా ఉంటుంది. పువ్వులు గుత్తులు గుత్తులుగా పూస్తాయి. పువ్వు తొడిమలు అన్నీ కలిసి కింద గిన్నెవలె ఏర్పడతాయి. పుష్పములలో రెండేసి పుప్పొడితిత్తులు ఉంటాయి. ఈ ధనియాల మొక్క ప్రతీ ఇంట్లోను పెంచుకోవచ్చు. ఈ మొక్కనే కొత్తిమీర అంటారు. ఈ కొత్తిమీర సువాసనా ద్రవ్యముగా వివిధ రకాల కూరలు, పులుసులు, పచ్చళ్ళు, అల్పాహారాలలోను విరివిగా వినియోగిస్తారు. కేవలము కొత్తమీరకోసం మాత్రమే పెంచినట్లయితే సంవత్సరములో కొంతకాలము మాత్రమే పెంచుకుంటారు. అయితే ఈ మొక్క ఔషధములకు మిక్కిలి ఉపయోగకరముగా ఉంటుంది. ఈ ధనియాల నుంచి నూనె కూడా తీస్తారు. దీని కాండము పెళుసుగా ఉంటుంది. 

ధనియాలు- గుణములు

పచ్చిధనియము లేక ఆకు స్వాదురుచి కలిగి ఉండును. సౌగంధికము, హృద్యముగా ఉంటుంది. 

ధనియాలు

తీపిరుచి కలవి. కషాయానురసము గలిగినది. శీరవీర్య ద్రవ్యము. మధురవిపాకము. పైత్య శామకమైనది. జ్వరము, దగ్గు, దప్పి, వాంతి, కఫములను హరించును. జఠరదీప్తిని కలిగించును. భావప్రకాశిక కారకుడు ధనియమును ఉష్ణవీర్య ద్రవ్యమని, కారపురుచిగా ఉంటుందని, మూత్రమును సాఫీగా జారీచేయు స్వభావము కలిగినది అని తెలియచేసాడు. 

వాత ప్రధానమైన వ్యాధులకు

ధనియాలు శొంఠి చేర్చి తీసిన కషాయము సేవించినట్లయితే వాతము హరించడంతోపాటు, మలము అనులోమగతికి తెచ్చునని వస్తుగుణ ప్రకాశిక అనే గ్రంథములో తెలియచేసారు. 

రోగముల సమయాల్లో వచ్చే దప్పికి

ధనియాల నీటిని పంచదారతోను, తేనెతోను చేర్చి ఇచ్చినట్లయితే దప్పిక శమిస్తుంది.

శ్వాసకాసలకు

ధనియపు చూర్ణము పంచదార చేర్చి బియ్యపు కడుగుతో కలిపి ఇచ్చినట్లయితే కాసశ్వాసలు హరించును. 

అమాజీర్ణ శూలలకు

ధనియాలు, శొంఠి కలిపి తీసిన కషాయము సేవించినట్లయితే అమాజీర్ణ శూలలు తగ్గుతాయి.

పైత్య అతిసారమునకు

ధనియాల రసానికి నాలుగు రెట్లు నీళ్ళు, దానిలో నాలుగవ వంతు ఆవు నెయ్యి పోసి నెయ్యి మాత్రమే మిగిలేటట్లు మరగబెట్టి ఆ నేతిని సేవిస్తూ ఉన్నట్లయితే పైత్యము వల్ల వచ్చిన అతిసారము శమిస్తుంది.

అంతర్దాహమునకు

రాత్రిపూట ధనియాలు నీటిలో నానబెట్టి ఉదయాన్నే ఆ ధనియాలు బాగా పిసికి కలిపి ఆ నీటిని వడగట్టి దానిలో పంచదార కలిపి సేవించినట్లయితే చిరకాలమునుంచీ ఉన్న కడుపుమంటలు తగ్గుతాయి.

అతిసారమునకు

ధనియాలు, వట్టివేరు కలిపి కషాయము పెట్టి సేవించిన అతిసారము, దప్పి, తాపము శమించును.

నిద్రపట్టుటకు

ధనియాల కషాయములో పాలు, పంచదార చేర్చి త్రాగినట్లయితే మంచి నిద్ర పడుతుంది. తలత్రిప్పట కట్టును. వీర్య నష్టము ఆపుచేయును.

మూత్రము సాఫీగా అవడానికి

ధనియాల కషాయములో రేవలచిన్ని కలిపి లోనికి పుచ్చుకున్నట్లయితే మూత్రము సాఫీగా జారీ అగును.

ధనియాలపొడి

ధనియాలు, జీలకర్ర, ఎర్రమిరపకాయలు, కరివేపాకు, కొంచెము నేతితో వేయించి ఉప్పువేసి పొడిచేసి అన్నములో కలుపుకుని తింటే రుచిగా ఉంటుంది. జీర్ణమును చేయును. అరోచకమును పోగొడుతుంది. పథ్యకారి. 

ధనియాలతో అరకు కూడా తయారుచేస్తారు. ఈ మందు అజీర్ణము తగ్గుటకు, మూత్రాఘాతములు తగ్గుటకు పనిచేస్తుంది. ఈ ధనియాల నీటిని వాము అరకు వలె తీయుదురు.

పైత్యము శమించడానికి ధనియాల పానకము

ధనియాలు ముద్దగా నూరి ఆ ముద్దను పంచదార నీటిలో కలిపి అందులో పచ్చ కర్పూరాది సుగంధ ద్రవ్యములు చేర్చి సేవించినట్లయితే పైత్యము హరించును.

ఉడికించిన బార్లీ గింజలను, కొత్తిమీర ఆకులను కలిపి నూరి పైన లేపనము చేసినట్లయితే వాపులు తగ్గును. 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.