రక్తికా, గుంజా అనే పేర్లు కూడా కలిగిన ఎర్ఱగురివింద సన్నని తీగజాతిలోనిది. ఆకులు చింతాకులవలె చిన్నవిగా ఉంటాయి. గుత్తులు గుత్తులుగా తెల్లని పువ్వులు పూచి, జాబరాకాయలవంటి కాయలు కాస్తాయి. కాయలు పండి ఎండినచో పగులుతాయి. కాయలో ఎఱ్ఱని గింజలు ఉంటాయి. గింజలయొక్క ముచిక వద్ద నల్లని రంగుగల మచ్చ ఉంటుంది. గింజల రంగు బట్టి జాతిని నిర్ణయించవచ్చు.
ఎఱ్ఱ గురివింద గుణములు
చేదు, వగరును కలిగిన రుచి కలిగి ఉంటాయి. వేడి చేయును. విపాకమున కారపురుచిగ మారును. రూక్షగుణము కలది. విషమువలన కలుగు ఉపద్రవములను, క్రిములను చంపును. గింజలు వాంతిని కలిగించును. వేరు శూలలను, విషమును హరించును. తలవెంట్రుకలకు హితకరమైనది. వాతపైత్యములను జ్వరమును తగ్గించును. నేత్రరోగములనన్నింటిని పోగొట్టును. మిక్కిలి వీర్యవృద్ధిని చేయును. బలకరమైనది. శ్వాస, దప్పి మదమును హరించును. దురదలు, వ్రణములు నశించును. కుష్ఠువ్యాధిని తగ్గిస్తుంది. దీని ఆకునకు విషమును హరించు శక్తి కలదు. మొత్తంగా ఈ గురివింద సర్వాంగసారమైనది.
ఇంద్రలుప్త బట్టతలకు
గురివింద ఆకు మెత్తగా నలిపి పైన పలుమార్లు రాస్తూ ఉంటే వ్యాధి నశించును.
వీర్యవృద్ధికి
గురివింద పండ్లు పాలలో వేసి కాచి, ఆ పాలు త్రాగినచో మిక్కిలి వీర్యవృద్ధి కలుగును. గురివింద గింజలు పేరు గుచ్చివేసికొన్నచో గ్రహబాధలు తొలగును.
చెవికుట్లు పెద్దవగుటకు
గురివింద గింజల చూర్ణము గేదెపాలలో వేసి కాచి తోడుపెట్టి వెన్నతీసి ఆ వెన్న రాసికొన్నచో కర్ణపాలి వృద్ధినొందును.
పైత్యసర్పికి
గురివింద ఆకు రసము రాసినట్లయితే సర్పిలు హరించును.
గండమాలలకు
గురివింద ఆకు మెత్తగా నూరి, నూనెలో వేసి, రెండు రెట్లు నీరు వేసి నూనె మాత్రం మిగిలేలా మరగ కాచి ఆ నూనెను వంటికి పూసుకుని అభ్యంగన స్నానం చేసినను గండమాలలు శమించును. గింజల తైలము మర్దనాచేసినచో అన్ని అవయవమములకు గూడ బలము కలుగును. గింజల గంధము పట్టువేసినచో తలనొప్పులు, పార్శ్వశూలలు, నొప్పులు తగ్గును. దీనికి వీర్యస్తంభన శక్తి కూడా కలదు.