ఈ ఏలకులు లత జాతిలోనిది. మలబారులో పంట విస్తారముగా ఉండును. చలువగల పర్వత ప్రాంతములలో విస్తారంగా పెరుగుతాయి. శ్రీలంకలో కూడా ఈ యాలకుల పైరు పెరుగుతుంది. పెద్ద ఏలకులు, చిన్న యేలకులు అని రెండు రకాలుగా ఉంటాయి. చిన్నయేలకి కాయలు పాలకాయలంత ఉంటాయి. పెద్దవి ఆల్ బకారా కాయలంత కాయలు ఉంటాయి. ఆకులలోనేమి, తీగలలో నేమి, పువ్వులలోనేమి పెద్దది పెద్దదిగాను, చిన్నది చిన్నది గాను ఉంటుంది. సాధారణముగా వీని గింజలకే ఎక్కువ ప్రాధాన్యము కలదు. వీని గింజలు మిక్కిలి సువాసన కలిగి ఉంటాయి. గింజలలో చమురు (నూనె) ఉంటుంది. ఎండిన కాయ తెల్లగా ఉంటుంది. గింజలు నల్లగా ఉంటాయి. గింజలు పగులగొడితే తెల్లగా ఉంటుంది. దీనికి‘ద్రావిడీ’అనే పేరు కూడా ఉంది. ద్రావిడీ అంటే తమిళ భాషలో పెరుగునది , పెద్దది అనే అర్థం.
గుణములు
యాలకులు కారపురుచి కలిగి ఉంటాయి. ఉష్ణవీర్యము, విపాకమున కూడ కారపురుచియే కలిగి ఉండును. రక్తపైత్యమును, వాంతులను హరిస్తుంది. శుక్రాశ్మరీ రోగమును పోగొట్టును. చలువచేయునని కొందరు ఋషులు తెలియచేసారు. దాహాన్ని, హృచ్ఛలనమును, దురదలను, పైత్యమును, శ్లేష్మమును హరించును. రుచిని కలిగించును. తీక్ష్ణ గుణము కలది. శ్వాసకాసలను ముఖ్యముగా శమింపచేయును. చిన్న యేలకులు: శీతవీర్యముగల ద్రవ్యముగా వర్ణింపబడతాయి. పెద్ద యాలకుల కంటె చిన్నవి తీక్ష్ణమైన సువాసన కలిగి ఉంటాయి. గుణములో కూడా తీక్షణతయే కలిగి ఉంటాయి.
ఉపయోగాలు
- మూత్రము జారీచేయును : ఏలకి చూర్ణము మద్యముతో కలిపి తాగినచో మూత్రాఘాతము తగ్గును.
- కఫమూత్రకృచ్ఛ్రములకు: ఏలకి చూర్ణము మద్యముతో గాని, ఉసిరి రసముతోగాని కలిపి తాగినట్లయితే కఫమూత్రకృచ్ఛ్రములు శమించును అని వస్తుగుణప్రకాశిక గ్రంథం ద్వారా తెలుస్తోంది.
- హృద్రోగమునకు: చిన్న ఏలకుల వేరు నూరి, నేతితో కాచి త్రాగినట్లయితే శ్రీఘ్రముగా హృద్రోగములు నివారింపబడును. గుల్మములు కూడ హరించును.
ఏలకుల తైలము
పిత్తశూలలను, ప్రమేహములను, వాంతులను, రక్తపిత్తమును హరించును. చిన్న ఏలకులు గర్భపాతమును జేయును.