చల్లతో చేయును చలువ - మజ్జిగలో ఎన్నో రకాలు

పెరుగులో నీళ్ళుపోసి కవ్వముతో చిలికి వెన్న తీసేస్తే వచ్చేది చల్ల అంటే మజ్జిగ. 

చల్ల గుణములు 

చల్ల( మజ్జిగ ) వగరు, పులుపు రుచి. ఉష్ణవీర్యము. విపాకమున పులుపు రుచిగా మారుతుంది. దీపనకారి, శ్లేష్మములు హరించును. మూత్రమును సాఫీగా జారీచేయును. విరేచనకారి. గ్రహణీ రోగులకు, మూలవ్యాధులు కలవారికి అమృతంలా పనిచేస్తుంది. అగ్ని సంస్కారము పొందిన భూమియందు గింజలు ఎలా మొలవవో అలాగే చల్లను పానము చేసినవారి దేహమునందు మూలములు అలాగే మొలవవు. మజ్జిగతోనే భోజనమునకు పరిపూర్ణత్వ తృప్తి కలుగుతుంది. సాధారణముగా ఆవు మజ్జిగకు ఇలాంటి ప్రయోజనాలు ఉంటాయి. మజ్జిగలో శొంఠి చూర్ణమును, సైంధవలవణమును చేరిస్తే అజీర్ణములు, గుల్మములు, పాండురోగములు పోగొట్టును. శూలలను అణచును. జీర్ణ జ్వరములకు మజ్జిగ మంచిది. ఉష్ణ కాలములోను, దుర్బలులకు, రక్తపిత్తము ఉన్నవారికి, భ్రమ, మూర్ఛ, దాహ రోగము ఉన్నవారికి మజ్జిగ పనికిరాదు. వాంతులను విషజ్వరములకు హితకరమైనది. 

చల్లలో ఎన్నో రకములు, ప్రాకారాంతరములు ఉన్నాయి. వాటిలో ఈ క్రిందివి ముఖ్యములు. 

1.సముద్ధృత ఘృతము

ఘృతము అనగా వెన్న అన్నమాట. సముద్ధృత ఘృతము అనగా వెన్న తీసినది. ఇది లఘువైనది. త్రిదోషములను హరింపచేయునది. 

2.అర్ఘోద్ధృతఘృతము

అనగా, సగము వెన్నతీసినది. ఇది వీర్యవృద్ధి, పుష్టి, బలము కలిగించును. 

అమద్ధృతఘృతము

అనగా, కొంచెమైనను వెన్నతీయనిది. ఇది ఘనమై గురుత్వము కలిగించును. కఫము పెంచును. దుర్జరము అనగా త్వరగా జీర్ణముకాదు. జఠరదీప్తి లేనివారికి ఇది మంచిదికాదు. 

పంచవిధ తక్రములు

ఘోలము

అనగా, పెరుగులో నీళ్ళు కలుపకుండా, వెన్నతీయకుండా చేసిన చల్ల. ఇది కఫము ప్రకోపించి ఉన్నప్పుడును, శ్రమపడి ఉన్నప్పుడు, వాతము ప్రకోపించినప్పుడు, వాంతులు అయినప్పుడు మిక్కిలి మంచిది.

మధితము

పెరుగులో నీళ్ళు కలపకుండా, వెన్నతీసివేసి చేసిన చల్ల. కఫము, పిత్తము హరించును. రుచి పుట్టిస్తుంది. ధాతుపుష్టి. 

ఉదశిత్వము

పెరుగెంతో నీరంత కలిపి వెన్నతీసివేసి చేసినది. ఇది దప్పిక, తాపము, ముఖశోషమును పోగొట్టును. పిత్తము, శ్లేష్మము హరించును. ఇది శరీరమునకు పూసినచో కుష్ఠరోగము తగ్గిపోవును. 

ఛవిక

రెండు రెట్లు నీళ్ళు కలిపి, వెన్నతీసివేసి చేసినది. స్వచ్ఛముగా ఉంటుంది. త్రిదోషములు, శ్రమ, క్లమము, ఛర్ది హరించును. రుచి, ఆకలి పుట్టించును. 

మస్తు

ఎక్కువగా నీరు కలిపి, వెన్నకూడా తీసివేసినది. రుచి పుట్టించును. దప్పిక, తాపము, నులిపురుగులు, మూలశంక, ప్లీహ వ్యాధులు పోగొట్టును. జీర్ణశక్తి వృద్ధిచేయును. 

దశవిధక్రమములు

ఇవి మధితము, మిళితము, ఘోళము, షాడబము, కాలశేయము, కరమధితము, ఉదశ్వితము, తక్రము, దండాహతము, అతిమిళితము, 

మధితము

మీగడ తీసివేసి పెరుగులో నీళ్ళు కలపకుండా చేసినది. జిడ్డుగా ఉండును. శోష, అరుచి, ఉదర రోగములు, మూత్రాఘాతము, గ్రహణిపోగొట్టును. పిత్తము, వాతము హరించును. బలము చేయును. వర్షాకాలమున తప్ప తక్కిన కాలములలో మేలు చేయును.

మిళితము

పెరుగుకంటె మూడు రెట్లు నీళ్ళు కలిపి, వెన్నతీసినది. అరుచి, అతిసారము, రక్తవాతము, పిత్తప్రకోపము హరించును. అన్ని కాలములయందు మేలే చేయును. 

ఘోళము

మీగడతీసివేసి పెరుగుకంటే రెండున్నర రెట్లు నీళ్ళు కలిపి చిలికినది. ఆమము, శ్లేష్మ వికారములు, అగ్నిమాంద్యము, విషదోషములు, మేహవ్యాధులు హరిస్తుంది. బలము, వీర్యపుష్టి కలిగించి, కండ్లకు మేలు చేయును. జ్యేష్ఠ, ఆషాఢ, శ్రావణ, భాద్రపద మాసాలలో సేవిస్తే మంచిది. 

షాడబము

పెరుగుకు ఐదు రెట్లు నీళ్ళు చేర్చి తరిచినది. ఆకలిపుట్టించి గుల్మములు, రక్తమూలములను హరించును. శ్లేష్మము ప్రకోపింపచేయును. 

కాలశేయము

పెరుగునకు ఒకటిన్నర రెట్లు నీళ్ళు చేర్చి తరిచినది. ఇది ఆకలి పుట్టించును. శోష తగ్గించును. విషదోషములు, గ్రహణి, వాతప్రకోపము, మూలశంక, వలీపలితములు పోగొట్టును. భాద్రపదమునందును, ఆశ్వయుజము నందును మేలు చేయును. 

కరమధితము

పెరుగు ఎంతో నీరు అంత చేర్చి కవ్వముతో కాక చేతితో తరిచినది. ఆమ్లమధురసములు కలిగినది. రుచి, ఆకలి పుట్టిస్తుంది. మలబంధము కలిగించును. మేహములు, మూలశంక, ఛర్ది, కామెల, కఫ వ్యాధులు, వాత వికారములు హరించును. శ్రమ తగ్గించును. బలము, వీర్యపుష్ఠి చేయును. వర్షాకాలమున మిక్కిని మంచిది.

ఉదశిత్వము 

పెరుగులో నాలుగోవంతు మాత్రమే నీరు చేర్చి తరిచినది. గుల్మములు, అభిఘాతము, వాతవ్యాధులు, గ్రహణి పోగొట్టును. జ్యేష్ఠ ఆషాఢమాసములలో మేలు చేయును.

తక్రము

పెరుగు ఎంతో నీరు అంత పోసి తరచినది. ఇది త్రిదోషహరము. గ్రహణి, మూలశంక, భగందరము, గుల్మము హరించును. చైత్ర, వైశాఖ మాసాల్లో మంచిది. 

దండాహతము

పెరుగుకు రెండు వంతులు నీరు చేర్చి తరచివేసినది. కమ్మగా, రుచిగా ఉండును. మధుమూత్రవ్యాధి, మేహము, అజీర్ణము హరించును. ఉడుకు తగ్గించును. ఎల్లకాలములందు మంచిది. 

అతి మిళితము

పెరుగుకు తొమ్మిది వంతులు నీరు పోసి తరిచి చేసినది.  గుల్మములు, భగంధరము, ఉదరవ్యాధులు, మూలశంక, ముఖ వ్యాధులు హరించును. కొవ్వు తగ్గించును. అన్నింటికంటే శ్రేష్ఠమైనది.

  • కాచిన చల్ల పీనస, శ్వాసకాసలు హరించును.
  • పచ్చి చల్ల పాలు కాచకుండ తోడుపెట్టి తరిచి చేసినది. కోష్ఠమున కఫము పెంచి, కంఠమున కఫము తగ్గించును. 
  • పుల్లని చల్ల  వాతము హరించును.
  • తియ్యని చల్ల పిత్తమును తగ్గించును.
  • వగరు చల్ల కఫము శమించును.

తక్రారిష్టము 

నేయి పూసిన కుండలో నూరుపలముల మజ్జిగను పోసి(పుల్లమజ్జిగ) దానిలో ధనియాలు, నల్లజీలకర్ర, బోడతరము, పిప్పళ్ళు, ఏనుగుపిప్పళ్ళు, ఇంగువ, మోడి, కచ్చోరములు, వాము, చిత్రమూలము, కురాసానివాము ఇవి దినుసు ఒక్కింటికి 1 పలము చొప్పున తెచ్చి చూర్ణముచేసి కుండలో కలిపి శీలమన్ను ఇచ్చి పదిహేను దినములు ఉంచి వడకట్టి అది రెండేసి ఔన్సుల చొప్పున సేవించినట్లయితే మూలవ్యాధులు, గ్రహణులు, అరుచి తగ్గును, వాత కఫములను పోగొట్టును. వాపు శూలలు హరించును. బలకరముగా పనిచేయును. 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.