కలువలు ఔషధయుక్తములు

కలువలు తెలుపు, ఎరుపు నలుపు రంగులలో మూడు జాతులు ఉంటాయి. పూల యొక్క రంగును బట్టి  ఏ జాతివో తెలుసుకోవాలి. కలువపువ్వులకు ఐదు లేక ఆరు రేకలు ఉంటాయి. వీటి ఆకులు గుండ్రముగా ఉంటాయి. పువ్వులకు కొద్దిపాటి సువాసన ఉంటుంది. వీటి దుంపలు, పువ్వులు కూడ ఉపయుక్తములైనవి. కలువలలో మూడింటికి సమమైన గుణములు ఉంటాయి. నీలిరంగులో ఉన్న కలువలకు మాత్రం కొన్ని గుణములు అధికముగా ఉంటాయి. నల్ల(నీలం)కలువకు ఇందీవరము, తెల్ల కలువకు శ్వేతోత్పల, ఎర్ర కలువకు రక్తోత్పల అని పేర్లు. 

నీలోత్పల:

ఇది మిక్కిలి తీపిరుచి కలిగి ఉంటుంది. మిక్కిలి చలువ చేస్తుంది. మంచి సువాసన కలిగి ఉంటుంది. విపాకమున చేదు రుచి కలిగి ఉంటుంది. రక్తపైత్య వ్యాధిని తగ్గిస్తుంది. 

తెల్లకలువ

శీతవీర్యమైనది. మిక్కిలి చలువచేస్తుంది. వీర్యనష్టమును కడుతుంది. తీపి కొంచెం, వగరు కొంచెం కలిసి ఉంటుంది. క్షయను తగ్గి స్తుంది. నేత్రములకు చాలా హితమైనది. దీని పువ్వులను జ్వరము సమయంలో తలకు వేసి కట్టినచో వేడి తగ్గుతుంది. మంచు గడ్డకు బదులుగా  ఈపువ్వులు వాడవలెను. పువ్వుల రసమును కొద్దిగా ముక్కులో వేసినట్లయితే ముక్కులోంచి రక్తము కారడం ఉపశమిస్తుంది. పువ్వుల రసమును తేనెతో కలిపి తాగినట్లయితే శ్లేష్మము, రక్తము పడడం మొదలైనవి తగ్గుతాయి. మూడు విధములైన కలువలకూ  ఈ గుణము ఉంది. కలువయొక్క రంగును బట్టి  ఆ రంగునకు సంబంధించిన వ్యాధులకు వినియోగిస్తారు. అనగా తెల్ల కలువ బొల్లి, శుక్ల నష్టము, తెల్లకుసుమ మొదలగు వాటికి వాడతారు. ఎర్రది ఎర్రకుసుమ, రక్తపైత్యము, ఎర్రశగ మొదలగు వాటికి, నల్లది అన్ని వ్యాధులకు వాడవచ్చు. 

కలువదుంప 

తెల్ల, ఎర్ర, నీలం లేక నల్ల కలువల దుంపలు రుచి తీపి, వగరు కలిసి ఉంటాయి. దుంపరంగు కూడా పువ్వు రంగును బట్టే ఉంటుంది. మేహశాంతిని కలిగిస్తాయి. స్త్రీలలో గర్భస్రావాలను అరికడతాయి. శిరోరోగములను హరించును. కలువదుంపలను చూర్ణముగాను, రసము గాను వినియోగించవచ్చు. గేలిక్ యాసిడ్, పిండిపదార్ధము, జిగురు పదార్ధములు దుంపలో ఉంటాయి. జీర్ణకారిగా ఉపయోగిస్తుంది. 

కలువల నుంచి ఔషధ తయారీ

ఐదు ఔన్సుల పువ్వుల రసము,ఒక ఔన్సు పంచదార కలిపిన పానకమును సేవించినట్లయితే తీవ్ర జ్వరములు, శిరోవాతములు మొదలైనవి తగ్గుతాయి. పువ్వుల రసమును దగ్గు నివారణలో వాడవచ్చు. శరీరంలో వేడి ఎక్కువైనప్పుడు పువ్వుల రసమును లోనికి తీసుకున్నా, పైన పూసినా తాపము తగ్గుతుంది. మూలవ్యాధి ఉపశమిస్తుంది. కలువ గింజల చూర్ణమును పెరుగు, తేనె కలిపి ఇచ్చినట్లయితే రక్త స్రావము తగ్గుతుంది. గింజల చూర్ణము మధుమేహ వ్యాధులు తగ్గిస్తాయి. దుంపల చూర్ణమును పాలలో కలిపి పంచదార చేర్చి కాచి తాగించినట్లయితే ఆమ విరేచనములు, పువ్వుల కషాయము లోనికి తీసుకున్నట్లయితే గుండెదడ పోగొడుతుంది. 

కలువ పాన్పు

ఇది రెండు రకములు. మొదటిది కలువ రేకులతో సిద్ధంచేసినది. రెండవది ఆకులతో సిద్ధం చేసినది. రెండు పాన్పులూ ఒకేరకమైన ప్రభావం చూపిస్తాయి. చలువచేయడంలో సమానంగా ఉంటాయి. ఉడుకు, తాపము తగ్గిస్తాయి. రక్త తీవ్రత(బీపీ) పోగొట్టి మనస్సును కుదుటపరచును. కళ్ళమంట, తలనొప్పి పోగొట్టి మంచి నిద్ర కలిగిస్తుంది. 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.