అక్కలకర్ర మరీ పెద్దదికాదు, చిన్నది కాకుండా మధ్యస్థంగా ఉండే మొక్క. దీని ఆకులు మాచిపత్రి యాకులను పోలి ఉంటాయి. కాయలు గుండ్రముగా ఉంటాయి. పువ్వులోనే విత్తనాలు ఉంటాయి. దీని వేరుకే అక్కలకర్ర అని పేరు. వీటి కాయలకు, ఆకులకుకూడా కొద్ది ఉపయోగం ఉన్నప్పటికీ వేరుకు మాత్రం విశేషమైన ఉపయోగాలు ఉన్నాయి. ఈ అక్కలకర్ర వేడి చేసేస్వభావము ఉంటుంది. కారపు రుచి కలిగిఉంటుంది. నరములకు మిక్కిలి బలమును కలుగచేస్తుంది. సాధారణ శ్లేష్మవాతములను పోగొడుతుంది. అయితే చర్మముపై వేసినట్లయితే పొక్కుతుంది. వాతపువాపులు, దెబ్బల వలన కలిగిన వాపులు, దొంగవాపులు దీనివలన తగ్గుతాయి. మంచి జీర్ణకారి. మూర్ఛవ్యాధిని తగ్గిస్తుంది.
పలు రకాల వ్యాధులు తగ్గిస్తుంది
- అక్కలకర్ర వేరు గంధముగా నూరి వాపులు ఉన్న ప్రదేశములో పట్టువేసి కొంచెం సెగ చూపించినట్లయితే బాధ శమించి వాపులు కడతాయి.
- వేరు రసము ఐదు లేక ఆరు చుక్కలు ముక్కులో వేసి పీల్చించిన తెలివి వచ్చి ఫిట్స్ తగ్గుతాయి. దీని కషాయం ఒక తులం లోనికి ఇచ్చినట్లయితే తెలివి వస్తుంది.
- దీని వేరు గంధము కణతలకు పట్టులా వేసినట్లయితే పార్శ్వనొప్పి తగ్గుతుంది. పగులని గడ్డలకు పట్టువేసిన గడ్డలు చితుకుతాయి.
- వేరుచూర్ణమును పిప్పి పంటిలో వేసి నొక్కినట్లయితే బాధ ఉపశమిస్తుంది.
- అక్కలకర్రవేరు కషాయమును కొంత లోపలికి తాగి కొంత పుక్కిలించి ఉమ్మివేసినట్లయితే ఊపిరి ఆడని పడిశము, పలు విధాలైన గొంతుక నొప్పులు,నాలుక జిగురు, రుచి తెలియకపోవడం వంటి లక్షణాలు తగ్గుతాయి.
- వేరుచూర్ణము తేనెతో కలిపి లోనికి ఇచ్చినట్లయితే నాలుక పలుచబడి ముద్దమాటలు పోతాయి. చిలుక, గోరింకలకు మాటలు రావడానికి ఇది తినిపిస్తారు.
- పచ్చి అక్రలకర్ర ముద్ద లేపనము చేసినట్లయితే ఎముకలు విరుగుట, నరుకులు , విడివడుట మొదలయిన వన్నీ తగ్గుతాయి.