కసివిందతో కఫము మాయం

కసివింద చెట్టు మనం రోజూ చూస్తూనే ఉంటాం. కానీ ఆ చెట్టులో అన్ని విశేష గుణాలున్నాయని తెలియదు. రోడ్లపక్కన నిత్యం కనిపిస్తూనే ఉంటుంది. ఈ చెట్టు గజము ఎత్తు వరకూ పెరుగుతుంది. ఆకులు మూడు అంగుళముల పొడవు కలిగి, రెండు అంగుళముల వెడల్పు కలిగి ఉంటాయి. మిరప ఆకులవలె ఉంటాయి. దీని కాయలు పొడవుగా ఉంటాయి. పువ్వులు పసుపుపచ్చరంగులో ఉంటాయి. ఈ కసివింద మొక్కలోని వేరు, ఆకులు, గింజలు, పువ్వులు కూడా ఉపయుక్తమైనవే. 

కసివింద గుణములు

మిక్కిలి చేదురుచి, కొంచెం తీపి రుచి కలిగి ఉంటాయి. కఫమును, వాతములు పోగొడతాయి. పచనకారి, కంఠమును శోధించును. ఉష్ణవీర్యము కలిగి ఉంటుంది. విపాకములో కారపు రుచిలో ఉంటుంది. అజీర్ణమును, దగ్గును హరిస్తుంది. మొత్తంగా ఈ మొక్క త్రిదోషహరమైనది. 

కసివిందతో ఔషధములు

  • కసివింద ఆకుల కషాయము లోనికి తీసుకున్నట్లయితే ఎక్కిళ్ళు, శ్వాస రోగములు శమిస్తాయి. రసమును సేవించినట్లయితే దగ్గు తగ్గుతుంది.
  • వేరును, సౌవీరమును కలిపి నూరి పైన లేపనము చేసినట్లయితే తామర, దద్దుర్లు, కుష్టువ్యాధి సహితము తగ్గుముఖం పడుతుంది. 
  • కసివింద వేరు నోటిలో పెట్టుకుని కొంచెం నమిలి తేలు కుట్టిన వారి చెవిలో ఊదినట్లయితే తేలు విషము దిగుతుంది. 
  • కసివింద ఆకులు ఆముదములో వెచ్చచేసి కంటికి కట్టినట్లయితే కంటిబాధలు తగ్గుతాయి. ఆకుల రసమును కంట్లో వేసినట్లయితే కొంచెం మండినా కండ్ల కలక, దురదలు తగ్గుతాయి.
  • ఆకుల రసము వంటికి పూసినట్లయితే చిడుము తగ్గుతుంది. 
  • పసుపు, కసివింద ఆకు మెత్తగా నూరి గాయములపైన వేసి కట్టు కడితే మానుపడతాయి. తేనెలో ఆకుల రసమును, పటికబెల్లం పొడిని కలిపి నాకినట్లయితే కళ్ళి దగ్గులు కడతాయి. 
  • నిమ్మ రసములో కసివింద వేరును అరగదీసి పైన పూసినట్లయితే తామర తగ్గుతుంది. 
  • రెండు లీటలర్ల కసివింద రసమును, అరలీటరు నువ్వుల నూనెలో కలిపి నూనె మాత్రమే మిగిలేలా మరగబెట్టి ఆ నూనెను పైన పూసినట్లయితే వాత నొప్పులు, పక్షవాత నొప్పులు హరిస్తుంది. 
  • లేతగా ఉన్న కసివింద కాయలు కూరవండుకుని తింటే శ్వాసకాసలు హరిస్తాయి. ఆకులను కూరగా వండుకుని తిన్నా వాతము కట్టును. ఆకుల రసమును వెన్నతో కలిపి మర్దనా చేసినట్లయితే పక్షవాతములు తగ్గును. నరముల బలహీనత తగ్గుతుంది. కసివింద వేరు విషజ్వరములను హరిస్తుంది. 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.