కటు ఫలము, పాండు ఫలము అని దీనికి కొన్ని పేర్లు.తెల్లని పండ్లు కాస్తాయి. పళ్ళు చేదుగా ఉంటాయి. ఆకులు గరుకుదనంగా ఉంటాయి. ఈ పాదు పొలాల్లో కంచెలపైన, అటవీ ప్రాంతాల్లోనూ పెరుగుతూ ఉంటుంది. ఐదారుగజముల ఎత్తు వరకూ పెరుగుతుంది. ఆకులపై మిక్కిలి నూగు ఉండి గరుకుగా ఉంటాయి. అరచేయిలా ఉంటాయి. ఆకులు తీపి పొట్లకాయ ఆకుల కంటే చిన్నవిగా ఉంటాయి. తీగ కూడా నూగుతో ఉంటుంది. పువ్వు తెల్లగా ఉండి పుప్పొడి కలిగి ఉంటుంది. నాలుగు రేకులుకలిగి ఉంటుంది. కాయలు రెండు మూడు అంగుళములు ఉండి గుండ్రముగా తెల్లని చారలు కలిగి ఉంటాయి. వేరు, ఆకులు, కాయలు, తీగ కూడా ఔషధ తయారీలో ఉపయోగిస్తుంది.
చేదుపొట్ల లో ఔషధగుణములు
- చేదు పొట్ల చేదుగాను, వగరు గాను ఉంటుంది. వేడిచేసే స్వభావము కలిగి ఉంటుంది. కఫపైత్య దోషములను హరిస్తుంది. జ్వరాన్ని పోగొట్టగలదు. కుష్ఠురోగము, దురదలు, క్రిములు, తాపములు తగ్గిస్తుంది. త్రిదోషశామకముగా పనిచేస్తుంది.
- చేదుపొట్ల వేరు సుఖవిరోచనకారి. కాండము శ్లేష్మహరము. ఆకులు పైత్య హరము. పండ్లు వాత పిత్త హారకములు. జ్వరంతో బాధపడుతున్నవారికి ఇవి సర్వ విధాల ఉపయోగిస్తాయి.
- చేదు పొట్ల ఆకులను సన్నంగా తరిగి ఉడకబెట్టి వార్చి కూరవండి పెట్టినట్లయితే పైత్య జ్వరములు హరిస్తాయి.
- చేదు పొట్ల ఆకులను, యవలను కలిసి కషాయముపెట్టి ఆ కషాయములో తేనె కలుపుకుని సేవించినట్లయితే తీవ్ర పైత్య జ్వరములు హరిస్తాయి. తాపము, దప్పిక కడతాయి.
- చేదు పొట్ల ఆకులకషాయమును తీసుకున్నట్లయితే వీర్యవృద్ధి, వాతహరము జరుగుతుంది.
- చేదు పొట్ల వేరు కషాయము లోనికి తీసుకున్నట్లయితే పైత్య మశూచి దూరమవుతుంది.