జీలకర్ర మొక్క ఔషధీ జాతిలోనిది. గజం ఎత్తు వరకూ పెరుగుతుంది. వాము మొక్క వలె ఉంటుంది. ఆకులు సన్నగా గుజ్జుగా పెరుగుతాయి. పువ్వులు గుత్తులు గుత్తులుగా ఉంటాయి. పువ్వు తెలుపు రంగులో ఉండి సువాసనగా ఉంటాయి. పూవులోనే గింజలు ఉంటాయి. దీని గింజలకే విశేష ప్రయోజనం ఉంటుంది. గింజలు సువాసన కలిగి ఉండి గట్టిగాను, చమురు కలిగి ఉంటాయి. వేయిస్తే కాని సాధారణముగా గింజ నలగదు. భోజన పదార్ధములలో పోపులకు వాడతారు. ఔషధానుపానములకు శ్రేష్టమైనది. జీలకర్రలో అనేక రకాలు కలవు. వీటిలో తెల్ల జీలకర్ర గుణములను గురించి తెలుసుకుందాం.
గుణములు
కారపు రుచి, ఉష్ణవీర్యము విపాకమున కారపు రుచిగ మారుతుంది. రూక్ష గుణము. వాతహరము. జీఠరదీప్తిని కలిగిస్తుంది. గుల్మములను, కడుపు ఉబ్బరములను, ఆమవిరేచనములను, గ్రహణి రోగములను హరిస్తుంది. క్రిములను అణుస్తుంది. జీర్ణ జ్వరములను తగ్గిస్తుంది.
విషజ్వరములకు
జీలకర్ర చూర్ణమును పాత బెల్లముతో కలిసి ఇచ్చినట్లయితే జ్వరములు హరిస్తాయి. అగ్నిసాదమును పోగొడుతుంది. వాతాన్ని తగ్గిస్తుంది.
రక్తపిత్తమునకు
జీలకర్ర 16 గురువింద ఎత్తు, రెండు రెట్లు పంచదార కలిపి సేవించినచో నిశ్వాసము, తేనుపులు, రక్తవాసనగ నుండిన రక్తపిత్తమును శమింపచేయును.
తేలుకాటునకు
జీలకర్ర మెత్తగా నూరి సైంధవలవణము కలిపి, జీలకర్ర కషాయములో ఈ ముద్ద ఉంచి దానిలో ఆవునెయ్యి వేసి నెయ్యి మిగిలేవరకూ మరిగించి ఆ నేతిని తేలు కుట్టిన చోట పూసినట్లయితే తేలుబాధ శమిస్తుంది.
చిత్తభ్రమమునకు
జీలకర్రను కొబ్బరికాయ నీళ్ళతో కలిపి రుబ్బి దానిలో నిమ్మకాయ రసము కలిపి తలకు మర్దనా చేసి, చల్లని నీళ్ళు స్నానము చేయించినట్లయితే చిత్తవిభ్రమము, ఉన్మాదము మొదలైనవి తగ్గుతాయి.
జీలకర్రతో తయారుచేసిన జీరకారిష్టము సూతికములను పోగొడుతుంది. జీర్ణకోశమును బాగుచేస్తుంది.