సర్పగంధితో కలుగు మేలు

 

రావుల్ఫియా సర్పంటైనా(లిన్నేయస్) బెంధమ్ ఎక్స్ కుర్జ్ అనే శాస్త్రీయనామం కలిగిన సర్పగంధి మొక్క అపొసైనేసి కుటుంబానికి చెందినది. 

ఈ మొక్క 75 సెంటీమీటర్ల ఎత్తు వరకూ పెరిగే బహువార్షికమొక్క. గిచ్చితే పాలు వస్తాయి. పత్రాలు కణుపుకు మూడు చొప్పున ఏర్పడతాయి. పత్రాలు కుంభకటకా కారంలో ఉంటాయి. పుష్పాలు కాండం చివర పొడవైన కాడపైన గుత్తులుగా వస్తాయి. ఆకర్షణపత్రావళి తెల్లగా లేదా లేత గులాబిరంగులోను, రక్షకపత్రావళి ఎర్రగాను ఉంటాయి. ఫలాలు గుండ్రంగా ఒకే విత్తనంతో లేదా మధ్యలో నొక్కు కలిగి రెండు విత్తనాలను కలిగి నల్లగా ఉంటాయి. 

పుష్పాలు, ఫలాలు 

అక్టోబరు-జనవరి మాసాలలో లభిస్తాయి. 

లభించే ప్రదేశాలు

ఈ మొక్క ఆంధ్రప్రదేశ్ లో పశ్చిమగోదావరి జిల్లా పాపికొండలలోను, తూర్పుగోదావరి జిల్లా మారేడుమిల్లి, పుల్లంగి, పాతకోట ప్రాంతాలలోను, విశాఖ జిల్లా చోడవరం ప్రాంతాలలోను అరుదుగా పెరుగుతుంది. 

ఉపయోగపడే భాగాలు:ఈ మొక్క వేర్లు, పత్రాలను వైద్యపరంగా ఉపయోగిస్తారు.

రసాయన పదార్ధాలు: ఈ మొక్కలో అనేక ఆల్కలాయిడ్‌లు ఉన్నాయి. రిసర్పైన్, ఆజ్మలైన్ , సర్పంటినైన్, అజమాలిసైన్ వంటి పెక్కు రసాయన పదార్ధాలు ఉంటాయి.  

సర్పగంధి ఉపయోగాలు

  • రిసర్పైన్ అనే ఆల్కలాయిడ్ కు అధిక రక్తపోటును తగ్గించే గుణం ఉంది. నిద్రను కలిగిస్తుంది. 
  • వేరు కషాయాన్ని స్త్రీల ప్రసవ సమయంలో ఇస్తే సులువుగా కానుపు అవుతుంది. 
  • ఈ మొక్క నరాల బలహీనతను కూడా తగ్గిస్తుంది.
  • పత్రాల రసాన్ని కంటిలో వేస్తే కండ్ల మసక తగ్గుతుంది. 
  • పాము కాటుకు విరుగుడుగా వేరు కషాయాన్ని లోనికి తీసుకుంటారు.
  • మానసిక వ్యాధులు నివారణ అవుతాయి. మూర్ఛ, పిచ్చి తదితర మానసిక రోగాలకు వినియోగిస్తారు.
  •  ఈ మొక్కను అజీర్ణం, మలబద్దకం, కడుపులోని క్రిములు పోవడానికి వాడతారు.
  • పిల్లలను నిద్రపుచ్చడానికి వేరును నూరి చనుపాలతో ఇస్తే హాయిగా నిద్రపోతారు. 
  • వేరు పొడిని ఐదు నుంచి 10 గ్రాములను ప్రతిరోజూ తీసుకుంటే అధిక రక్తపోటు(బీపీ) తగ్గుతుంది.
  • దీనితో తయారుచేసిన ‘సర్పినా’ బిళ్ళలను గాని, సర్పగంధి బిళ్ళలను గాని వాడితే అధిక రక్తపోటు తగ్గుతుంది. 

ఆయుర్వేద మందులు

సర్పగంధాది చూర్ణం, సర్పగంధయోగ, సర్పగంధవటి, నిర్గుండ్యాది ఘృతం, సర్పగంధాది గుళిక. 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.