స్ట్రిక్‌నాస్ నక్స్వామికా లిన్నేయస్ అనే శాస్త్రీయనామం కలిగిన ముషిణి లొగానియేసి కుటుంబానికి చెందిన వృక్షం. ఈ చెట్టు 15 మీటర్ల ఎత్తు వరకూ పెరుగుతుంది. దీని పత్రాలు దళసరిగా, ముదురు ఆకుపచ్చగా ఉండి ఈనెలను కలిగి ఉంటాయి. పుష్పాలు లేత ఆకుపచ్చగా ఉండి శాఖల చివర గుత్తులుగా వస్తాయి. ఫలాలు గుండ్రంగా నిమ్మకాయ పరిమాణంలో ఉండి, పండినప్పుడు కమలాఫలం ఎరుపులో ఉంటాయి. విత్తనాలు తప్పడగా, గుండ్రంగా ఉండి తెల్లని గుజ్జుతో కప్పబడి ఉంటాయి. ఫలాలకు పైన గట్టి పెంకు ఉంటుంది.
పుష్పాలు, ఫలాలు
మార్చి- మే మాసాలలో లభిస్తాయి. విత్తనాలు ఆగస్టు నుంచి ఫిబ్రవరి మాసాలలో లభిస్తాయి.
ఉపయోగపడే భాగాలు
ఈ మొక్క విత్తనాలను కాండం, బెరడు, వేర్లను వైద్యపరంగా ఉపయోగిస్తారు.
రసాయన పదార్దాలు
ఈ మొక్కలో స్ట్రిక్‌నైన్, బ్రూసైన్, సూడో స్ట్రిక్‌నైన్ అనే రసాయన పదార్ధాలు ఉంటాయి.
ఉపయోగాలు
- ముషిణికి హోమియో వైద్య విధానంలో అత్యంత ప్రాముఖ్యత గలదు.
- విత్తనాలను లైంగికశక్తిని పెంచడం కోసం వాడతారు. అజీర్ణం, నరాల వ్యాధులు, నరాల బలహీనత, విరోచనాలు, మలబద్ధకం తగ్గుతాయి.
- నరాల బలహీనత పోవడానికి ‘సామిరాగాజికేసరి’ ని వాడతారు. ‘శూలహరణ యోగ’ ని వాడితే విరోచనాలు అరికడతాయి.
- విత్తనాలు గుండెకు, వెన్నుపాముకు, శ్వాసకోశాలకు బలాన్నిస్తాయి.
- పక్షవాతం, జ్వరాలు, కడుపులో క్రిములు, మూర్ఛ, కీళ్ళనొప్పులు, నిద్రలేమి, కడుపునొప్పి, శూల, నపుంసకత్వం, దగ్గు, కలరా తగ్గడానికి వాడతారు.
- జీర్ణశక్తిని పెంచుతుంది. చర్మవ్యాధులు పోతాయి. విషానికి విరుగుడుగా పనిచేస్తుంది. రక్తహీనత, ఆస్థమా, బ్రాంఖైటిస్, మధుమేహం, నిస్సత్తువ తగ్గుతాయి.
- విత్తనాల పొడిన ఒకటి లేదా రెండు గ్రాములు నెయ్యితో కలిపి లోనికిస్తే పిచ్చికుక్క కాటుకు విరుగుడుగా పనిచేస్తుంది.
- పత్రాలు రసాన్ని మొటిమలపై పూస్తే పోతాయి.
- పండిన ఫలంలోని గుజ్జును, మజ్జిగతో తీసుకుంటే చక్కెరవ్యాధి నయమవుతుంది.
ఆయుర్వేద మందులు
అగ్నితుండివటి, విషముష్టివటి, నవజీవనరస, లక్ష్మీవిలాస రసం, క్రిమ ముద్గార రసం, శూలహరణయోగ.