అడవుల్లో లభించే కొన్ని పాదులు చూస్తే మనము పిచ్చిమొక్కలు అని, పిచ్చి తీగలు అని తీసిపారేస్తాం. కానీ అటువంటి వాటిని తీసిపారేయకూడదని శాస్త్రజ్ఞులు ఎప్పుడో నిరూపించారన్న విషయం మనకు తెలియదు. ఆ కోవకు చెందినదే జ్లరాది లేదా గుడూచిపాదు. దీనినే వాడుకభాషలో తిప్పతీగ అని పిలుస్తారు.
చిన్న, పెద్ద చెట్లపైకి పాదులా పాకి ఆంధ్రప్రదేశ్ అంతటా అడవుల్లో కనిపిస్తుంది. టినోస్పోరా కార్థిఫోలియో అనే శాస్త్రీయనామం కలిగిన మినిస్పెర్మేసి కుటుంబానికి చెందినది ఈ తిప్పతీగ.
దీని ఆకులు, కాండము, పువ్వులు, ఫలాలు, వేర్లు అన్నీ ఆయుర్వేద వైద్యానికి ఉపయోగిస్తారు. మధుమేహం వ్యాధికి తిప్పతీగ మంచి ఔషధంగా ఉపయోగపడుతుంది.
సర్వరోగహారి తిప్పతీగ
- ముదిరిన తిప్పతీగ కాండాన్ని నీళ్ళలో నానబెట్టి దానిని చితక్కొట్టగా వచ్చే రసాన్ని ఫిల్టర్ చేస్తే ‘తిప్పసత్తు’ అనే పదార్ధం వస్తుంది. ఇది ఔషధంతో సమానం. ఈ పాదును అమృతారిష్టం, ధన్వంతరి తైలం, సుదర్శనచూర్ణం, సంజీవనివటి, ఫలాత్రికాదిక్వతం, గుడూచి తైలం, పెప్పలిమూలికాదిక్వతం, పంచభద్రక్వతం, రసససప్తకక్వతం, యోగరాజగుగ్గులు, గుడూచ్చాదిక్వతం, గుడూచ్యాదిచూర్ణం, గుడూచిలేహ వంటి ఆయుర్వేద మందుల్లో ఉపయోగిస్తారు.
- ఈ మొక్కలో బెబ్బరిన్, గిలోయిన్, గిలోయినిన్, టినోస్పోరిన్, టినోస్పోరిన్ ఆమ్లం వంటి రసాయనాలు ఉన్నాయి.
- చర్మ సౌందర్యాన్ని కాపాడుకోవడానికి శరీర పుష్టికి ఈ మొక్కతో చేసిన మందులు ఉపకరిస్తాయి. గుడూచిక్వతాన్ని పంచదార, పాలతో కలిపి తీసుకుంటే గనేరియా తగ్గుతుంది.
- తిప్పతీగ రసం తేనెతో కలిపి తీసుకుంటే తలనొప్పి, పార్శ్వపునొప్పులు, జ్వరాలు నివారణ అవుతాయి.
- మూడు దోషములను హరిస్తుంది. క్రిమి హరముగా పనిచేస్తుంది.
- తిప్పతీగ కుష్టువ్యాధి నివారణకు కూడా దోహదపడుతుందని వస్తుగుణ ప్రకాశిక గ్రంథము వివరిస్తోంది.
- తిప్పతీగ కషాయము పూటకు మూడు లేక నాలుగు చెంచాలు సేవించినట్లయితే వాత జ్వరములు హరిస్తాయి.
- తిప్పతీగ రసములో తేనె కలిపి తాగినట్లయితే వేడి తగ్గుతుంది.
- తిప్పతీగ, ఏడాకుల అరటి పట్ట, శొంఠి కలిపి కాచిన కషాయమును గాని, చూర్ణముగాని సేవించినట్లయితే స్తన్యశుద్ధి కలుగుతుంది.
- తిప్పతీగతో కాచిన నీటిని కొంచెం కొంచెం తాగిస్తూ ఉంటే పైత్యమువలన వచ్చే వాంతులు తగ్గుతాయి.
- తిప్పతీగ రసమును ప్రతి దినము పరగడుపున ఒక నెలరోజులపాటు తాగుతూ ఉంటే ఇమ్యూనిటీ పెరిగి ఎలాంటి వ్యాధులు దరిచేరవు.
- బాగా మరిగించి చల్లార్చిన తి ప్పతీగ కషాయమును తేనెతో కలిపి సేవిస్తే త్రిదోషాల వల్ల వచ్చే వాంతులు కడతాయి.
- తిప్పతీగ ఆకును కూరగా వండి తినిపించినట్లయితే జ్వరము తగ్గుతుంది.
- కుష్టువ్యాధి నివారణకోసం తిప్పతీగ నిజరసమును తాగగలిగినంత తాగి జీర్ణమైన తరువాత నెయ్యి వేసిన అన్నమును పలుచని కందికట్టుతో తిన్నట్లయితే దుర్వాసన ఉన్న శరీరము కూడా తేజస్సు పొందుతుందని వస్తుగుణ ప్రకాశిక గ్రంథములో వివరింపబడింది.
- తిప్పతీగ దుంప, వేరులతో తయారు చేసిన తిప్పసత్తును తేనెతో కలిపి తీసుకుంటే కఫము తగ్గుతుంది. బెల్లముతో తీసుకుంటే మలబద్ధకము తగ్గుతుంది. పంచదారతో కలిపి తింటే పైత్యము తగ్గుతుంది. నేతితో కలిపి ఇచ్చినట్లయితే వాతము తగ్గుతుంది. ఈ తిప్పతీగ సర్వరోగహారి.
- ఎండిన తిప్పతీగ కంటే పచ్చిది చాలా శ్రేష్టము. మాటిమాటికి వచ్చే జ్వరాలను తగ్గించాలంటే తిప్పతీగ కషాయము చాలా బాగా పనిచేస్తుంది. పాంక్రియాస్ వ్యాధులను తగ్గిస్తుంది. చర్మరోగాలు తగ్గిస్తుంది.