కొర్రలు బలిష్టమైన ఆహారం. ఎక్కువ శ్రమ కలిగిన పనులు చేసేవారు ఈ కొర్రన్నము తింటే చాలా సమయం వరకూ ఉత్సాహంగా పనిచేయగలుగుతారు. ఈ చిరుధాన్యాలను ప్రస్తుత కాలంలో ఎంతో మంది వినియోగిస్తున్నారు. వీటిని అన్నంగా వండుకుని తింటున్నారు. అంతేకాక వీటితో ఉప్మా చేసుకుని తినొచ్చు. ఈ కొర్రలను ఆహారంగా తీసుకోవడం వల్ల షుగర్ వ్యాధిని కూడా కంట్రోల్ లో ఉంచుకోవచ్చు. రోజూ షుగర్ వ్యాధిగ్రస్తులు ఆహారంలో బియ్యానికి బదులుగా ఇలాంటి చిరుధాన్యాలను వివిధ కూరలతో కలిపి తీసుకుంటే షుగర్ కంట్రోల్ లో ఉండటమే కాకుండా నీరసం కూడా ఉండదని చాలా మంది డాక్టర్లు కూడా సూచిస్తున్నారు. ఈ కొర్రలతో ఇంకా అనేక రకాల ఉపయోగాలు ఉన్నాయి.
శరీరంలో వచ్చే వ్రణములు తగ్గుతాయి
కొంతమంది శరీరంలో పుండ్లతో చాలా బాధ అనుభవిస్తూ ఉంటారు. వీటిని పోగొట్టుకోవడానికి డాక్టర్లను సంప్రదిస్తూ ఉంటారు. దీనికి మంచి మందు కొర్రలు. ఈ కొర్రలను అన్నముగా వండి దానిలో గేదె పెరుగును కలిపి తినడం వల్ల చిరకాలము నుండీ బాధపెడుతున్న నాడీవ్రణములు తగ్గుతాయి. మరో పద్ధతి ప్రకారం కొర్ర మొక్కల వేళ్లను మెత్తగా నూరి ఆ చూర్ణమును గేదెపెరుగుతో కలిపి తిన్నా మంచి ఫలితం కనిపిస్తుంది.