కాకర ఆకు కషాయము రెండు చెమ్చాల వంతున సేవిస్తూ ఉంటే వాత రక్తము తగ్గుతుంది. జ్వరపీడితులకు కాకరాకు తరిగి కూరగా వండి పెడితే జ్వరం నెమ్మదిస్తుంది. కాకర ఆకు రసములో పసుపును కలిపి తాగినట్లయితే మసూచి తగ్గుతుంది. మసూచి వల్ల వచ్చిన పొక్కులు కూడా తగ్గుతాయి. కాకర ఆకు రసములో నిమ్మరసం కలిపి లోనికి తీసుకుంటే మశూచి వ్యాధి దరిచేరకుండా ఉంటుంది.
కాకర ఆకు రసములో నూనె కలిపి సేవించినట్లయితే కలరా వ్యాధిని నివారించవచ్చని భావప్రకాశిక గ్రంథంలో వివరించబడింది. కాకర ఆకు ఎండబెట్టి చేసిన పొడితో పులుసు కాచుకుని తింటే క్రిములు హరిస్తాయి. పైత్యము తగ్గుతుంది. కాకర ఆకు రసము కంటిలో పిండినట్లయితే విష జ్వరములు తగ్గుతాయని వస్తుగుణప్రకాశిక గ్రంథములో పేర్కొనబడింది.
అన్నహితవు కోసం కాకర పులుసు
కాకరకాయను చిన్న ముక్కలుగా కోసి నూనెలో వేయించి, దానిలో వేయించిన ఒడియములు వేసి చింతపండు పులుసు, బెల్లము వేసి తాలింపు పెట్టి పులుసుగా కాచుకోవాలి. ఇది చేదుచేదుగాను, తియ్యగాను ఉంటుంది. ఇది తినడం వల్ల నాలుకకు రుచి కలుగుతుంది. పైత్యము, క్రిములు హరిస్తుంది. మూలశంక వ్యాధి ఉపశమిస్తుంది. అన్నహితవు కలిగిస్తుంది.
కాకర వరుగులు
పొట్టికాకరకాయలు గాని, పెద్ద కాకరకాయలు గాని సన్నని చక్రాల్లా తరిగి ఎండబెట్టాలి. ఎండిన ముక్కలను నిల్వ చేసుకుని అవసరమైనప్పుడు నూనె వేసి వేపుడులా చేసుకుని తింటే త్రిదోషములను తగ్గిస్తుంది.