ధన్యాకా, ధాన్యకా, కుస్తుంబరీ-Coriandrum Sativum. రెండడుగుల వరకూ పెరిగే మొక్క. ఆకులు సరస్వతీ ఆకులవలె గుండ్రముగాను, చిన్నవిగాను ఉంటాయి. ఇండియాలో చాలాచోట్ల పెరుగుతుంది. సంవత్సరమువరకూ జీవిస్తుంది. ఆకులు వంటరి, చేరిక కలిగి ఉంటుంది. ఆకులకు చుట్టూ కంగోరా ఉంటుంది. ఈ మొక్క చిలవలు పలవలుగా అల్లుకుంటుంది. ఆకు నల్లివాసనగా ఉంటుంది. కొన్ని లఘుపత్రములు, ఆకుయొక్క తొడిమ ప్రకాండమును ఆవరించి ఉంటాయి. ఆకు నునుపుగా ఉంటుంది. పువ్వులు గుత్తులుగా ఉంటాయి.
పువ్వు తొడిమలన్నియు కలసి క్రింద గిన్నెవలె ఏర్పడతాయి. పుష్పములలో రెండేసి పుప్పొడి తిత్తులు ఉంటాయి. కింజల్కములు అండాశయమునంటి ఉంటాయి. ఒక్క అండాశయములో రెండు గింజలు ఉంటాయి. కాయ రెండు దళములుగా విభవింపబడి ఉంటుంది. ఈ పలదళములు రెండింటియందు రెండు బీజములు ఉంటాయి. కాయలపైన చారలుంటాయి. ప్రతి ఇంటిలోను వీటిని పెంచుకుంటారు.
అన్ని ఋతువులలోను వీటిని పెంచవచ్చు. ఈ ధనియపు మొక్కలనే కొత్తిమీర అంటారు. సువాసన ద్రవ్యముగా కూరలలోను, పచ్చళ్ళలోను, పులుసు తదితర వాటిలో విశేషంగా వినియోగిస్తారు. కేవలం ధనియాలకోసమే పెంచేవారు కొన్ని ఋతువులలోనే పెంచుతారు. ఇతర ఋతువులలో పంటకు అంత ఉపయోగించదు. ఔషధములకు మిక్కిలి ఉపయోగకారి. విదేశీయులు ఈ విత్తులనుండి చమురు తీస్తారు. కాండము పెళుసుగా ఉంటుంది. కాయలు పండిన వెనుక గోధుమరంగు కలిగి ఉంటాయి. ధనియాలతో కూడా భోజనమునకు కొన్ని ఉపపదార్ధములను తయారుచేస్తారు.
- ధనియాలకు కూడా సువాసన ఉంటుంది.
- శాకయోగ్యం-కూరలకు ఉపయోగపడుతుంది.
- సూక్ష్మపత్ర-చిన్న ఆకులు ఉంటాయి.
- సుగంధి-పరిమళము కలిగి ఉంటుంది.
గుణములు
పచ్చి ధనియాలు లేక ఆకు స్వాదురుచి కలిగి ఉంటుంది. సౌగంధికము. హృద్యముగా ఉంటుంది.
ధనియాలు తీపిరుచి కలవి. కషాయనురసము(వగరు) కలది. శీతవీర్యద్రవ్యము. మధురవిపాకము. పైత్యశామకమైనది. జ్వరము, దగ్గు, దప్పి, వాంతి, కఫములను హరించును. జఠరదీప్తిని కలిగించును. భావప్రకాశిక లో ధనియము ఉష్ణవీర్యద్రవ్యము, కారపురుచిగా అని వర్ణించడం జరిగింది. మూత్రము సాఫీగా జారీచేస్తుంది.
వాత ప్రధానమైన మూలవ్యాధులకు
ధనియాలు, శొంఠి కలిపి చేసిన కషాయముతో అన్నపానాదులకు ఉపయోగించినట్లయితే వాతము, విరేచనము అనులోమనగతికి వస్తుంది. రోగముల సమయంలో వచ్చే దాహానికి ధనియాల నీటిని పంచదారతోను, తేనెతోను చేర్చి ఇచ్చినట్లయితే దప్పిక తగ్గుతుంది. ధనియాల చూర్ణమును పంచదార చేర్చి బియ్యపు కడుగుతో ఇచ్చినట్లయితే కాసశ్వాసలు హరిస్తుంది. అమాజీర్ణ శూలలకు ధనియాలు, శొంఠి కలిపి తీసిన కషాయము హరిస్తుంది.
ధనియాల ముద్దకు నాలుగు రెట్లు నీరు, ఒక వంతు నెయ్యి పోసి నీరు ఇగిరిపోయి, నెయ్యి మిగిలిపోయేలా మరగబెట్టి సేవించినట్లయితే పిత్తాతిసారములు హరిస్తుంది. దీపనము, పాచనమును చేస్తుంది.
వాత రక్తమునకు
ధనియాలు ఒక చెంచా, జీలకర్ర రెండు చెంచాలు వీటికి సమానముగా బెల్లమును చేర్చి లేహపాకముగా వండి సేవించినట్లయితే వాతరక్తము హరిస్తుంది.
అంతర్దాహమునకు
రాత్రిపూట ధనియాలను నీటిలోవేసి ఉదయాన్నే ఆ ధనియాలను పిసికి ఆ నీటిని వడగట్టి కొంచెం పంచదార చేర్చి త్రాగినట్లయితే చాలాకాలం నుంచి ఉన్న కడుపులో మంటలు తగ్గుతాయి.
అతిసారమునకు
ధనియాలు, వట్టివేరు కలిపి కషాయము పెట్టి సేవించినట్లయితే అతిసారము, దప్పిక, తాపము శమిస్తుంది.
నిద్రపట్టడానికి
ధనియాల కషాయములో పాలు, పంచదార చేర్చి త్రాగినట్లయితే నిద్రపడుతుంది. తలత్రిప్పుడు అరికడుతుంది. వీర్యనష్టమును ఆపుచేస్తుంది.
మూత్రము సాఫీగా జారీచేయడానికి
ధనియాల కషాయములో రేవలచిన్ని కలిపి లోనికి ఇచ్చినట్లయితే మూత్రము జారీ చేస్తుంది.
ధనియాలపొడి
ధనియాలు, జీలకర్ర, యర్రమిరపకాయలు, కరివేపాకు, కొంచెం నేతితో వేయించి ఉప్పువేసి పొడిగా చేసుకుని అన్నంలో కలుపుకుని తింటే రుచిగా ఉంటుంది. జీర్ణము చేస్తుంది. అరోచకమును పోగొడుతుంది. పథ్యకారి.
ధనియాలతో అర్కమును కూడా తీస్తారు. ఈ అర్కము అజీర్ణములకు, మూత్రాఘూత, మూత్రాశ్మరులకు, వాతానులోమనమునకు కూడా పనిచేస్తుంది. వామువాటర్ వలె కూడా దీనిని కూడా తీయవచ్చు.
పైత్యానికి ధనియాల పానకము
ధనియాలు మెత్తగా నూరి ఆ ముద్దను పంచదారనీటిలో కలిపి అందులో కర్పూరాది సుగంధ ద్రవ్యములను చేర్చి సేవించినట్లయితే పైత్య శమనమును చేస్తుంది.
ధనియాలు సువాసన గల ద్రవ్యము. వాయునాశకము. పాచనకారి. ముఖరోగమునందు, గ్రహణియందు, పడిశములయందునను ఉపయోగించును. వాంతిని అరికడుతుంది. వాయునాశకమైనది. కడుపు ఉబ్బు, వాతము మొదలగు రోగములకు ఇచ్చే మందులలో ఉపయోగిస్తారు. ఉడికించిన బార్లీ గింజలను, కొత్తిమీర ఆకులను కలిపి నూరి పైన లేపనము చేసినట్లయితే వాపులు తగ్గుతాయి. ధనియాలు, సునాముఖి మొదలగు విచేచనకర ఔషధము యొక్క వికారమును పోగొడుతుంది. దీని తైలము సువాసన కలిగి ఉంటుంది. వాయునాశకము, కడుపు ఉబ్బు పోగొడుతుంది. వాతమును తగ్గిస్తుంది.