ఈ రోజుల్లో చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరూ ఈ కీళ్ళనొప్పులు, కండరాల నొప్పులతో బాధపడడం చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా బంగాళాదుంపలు, శనగపిండి పదార్ధాలు, వేరుశనగలు, పచ్చికొబ్బరి, పనస, జామ, చిలకడదుంప, జున్నుపాలు, గొర్రెమాంసం, గుమ్మడికాయ, తాబేలు మాంసం లాంటి పదార్ధాలను తరచూ తీసుకుంటూ ఉండడంవల్ల మలబద్ధకం పెరుగుతోంది.
దీనివల్ల శరీరంలో వాయుగమనం నిరోధించబడి శరీరంనిండుగా ఉష్ణభరితమైన ఈ వాయువు చేరి ముఖ్యంగా కీళ్ళనడుమ, నడుముభాగాలు, మెడ నరాలు, కడుపులో, ఎదలో, చివరికి తలలోను కూడా చేరిపోయి తన ప్రభావాన్ని చూపించే వాతరోగం కలిగిస్తోంది. ఇది అందరికీ తెలిసిన రోగమే అయినా పైన చెప్పిన పదార్ధాలను వీడలేకపోతున్నారు. కీళ్ళనొప్పులకు ఈ పదార్ధాలు ఒక కారణమైతే వ్యవహారదోషాలు, ప్రమాదాలబారిన పడడం, విషపదార్ధాల వాడకం తదితర కారణాల వల్ల కూడా ఈ కీళ్ళనొప్పులు మనకు సంధివాతాలుగా వేదన కలిగిస్తూనే ఉంటాయి. ఇందుకు పరిష్కారాలను చూద్దాం.
పైపూతమందు
కీళ్ళనొప్పులతో బాధపడుతున్నవారికి ముందుగా విరేచనాలకు మందు ఇచ్చి ఆ తర్వాత వెల్లుల్లిపాయల ముద్దను రెండు మూడు చెమ్చాలను నువ్వులనూనెలో వేసి నిప్పులపైన ఉంచి బాగా మరిగిన తర్వాత హారతికర్పూరం, వాముపూవు, పుదీనా పూవులను చేర్చి వెంటనే దించి నిల్వ ఉంచుకోవాలి.
ఈ మందును రోజూ రాత్రి నొప్పి ఉన్నచోట మర్దన చేస్తూ ఉండాలి. వారం వారం తాజాగా తైలాన్ని తయారుచేసుకుని వాడాలి. వాడేసమయంలో కళ్ళకు తగలకుండా జాగ్రత్తపడాలి. తలకు కూడా మర్దన చేస్తే శిరోవాతం, వేడి, కళ్ళమంట, పెదాలు, చెంపలు అదరడం, చెవివ్యాధులు, శీతలం జలుబు, నిద్రలేమి, నరాల బలహీనత తగ్గి మేధాశక్తి పెరిగి ఉత్సాహాన్ని కలిగిస్తుంది. దీన్ని లోపలికి తీసుకోకూడదు.
వాతవ్యాధులకు లోపలికి
వావిలి చిగుళ్ళు రెండు పిడికిళ్ళు, తులసి ఆకులు రెండు పిడికిళ్ళు, వాము రెండు పిడికిళ్ళు, త్రికటుకాలు చూర్ణం రెండు పిడికిళ్ళు, లవంగ, దాల్చిన చెక్క యింగువ చూర్ణాలు రెండు పిడికిళ్ళు ఆముదపు చిగుళ్ళు రెండు పిడికిళ్ళు, వెల్లుల్లిపాయలు నాలుగుపిడికిళ్ళు మొత్తం కాటుకలా మెత్తబడేటట్లు నూరాలి. అవసరమనుకుంటే మరికొన్ని వెల్లుల్లిపాయలు కొద్దిగా సైంధవలవణం, కొంచెం వాము పూవు, మరికొంచెం పుదీనా పూవు చేర్చి మొత్తం బాగా నూరి మాత్ర తయారు చేయడానికి వీలుగా ముద్ద చేసుకుని వాటిని చిన్న చిన్న బఠాణీ గింజంత గుళికలుగా చేయాలి.
మాత్రలు సరిగా రాకపోతే దానిలో మరిన్ని వెల్లుల్లి, తమలపాకులను నూరి కలపవచ్చు. ఈ మాత్రల్ని జాగ్రత్తపరుచుకుని రోజూ రెండుపూటలా నెలరోజులపాటు వాడాలి. నొప్పి తీవ్రత మరీ ఎక్కువగా ఉంటే రెండేసి మాత్రలు వాడవచ్చు. ఈ మాత్రలను వేసుకునే ముందు వేడినీరు గాని, శొంఠికషాయం, అల్లంకషాయం ఏదివీలైతే అది సిద్ధంగా ఉంచుకుని దానితోపాటు మాత్రలు వేసుకోవాలి. మాత్రలు నమలకుండా మింగాలి.
ఈ మందు వాడడంతో పాటు వాతము చేసే పైన చెప్పిన పదార్ధాలన్నీ మానేయాలి. రెన్నెల్లకోమారు విరేచనాలకు ఔషధం తీసుకునేవారికి ఈ నొప్పులు దరిచేరవు. ఒకవేళ బాధలు కలిగినా రెండుమూడు పూటల్లోనే తగ్గిపోతాయి. పైన చెప్పిన తైలాన్ని రాత్రివేళ్ళల్లో మర్దనా చేసుకుని ఉదయాన్నే వేడినీటితో స్నానం చేయాలి.
మరో చిన్న చిట్కా
మూడు పిడికిళ్ళ బియ్యం, మూడు పిడికిళ్ళ పెసరపప్పు, రెండు పిడికిళ్ళ నువ్వులపొడి, ఒక పిడికెడు పంచదార, అరపిడికెడువంగచూర్ణం, అరపిడికెడు మెంతుల చూర్ణం, మొత్తం పొడిచేసి ఉదయం, సాయంత్రం వేడినీటిలో ఒక చెమ్చాలు వేసుకుని తాగాలి.