ఎప్పుడూ నిద్రపోతూనే ఉండడం, వేళకు తినకపోవడం, వేకువనే లేవలేకపోవడం, చిరాకు కలగడం, ఏదో చేయాలనుకోవడం, ఏదీ చేయలేక విచారించడం, చదువుమీద శ్రద్ధ తగ్గడం, చదివినా జ్ఞప్తికి ఉండకపోవడం, ఏపని చేయాలన్నా, ఎవరితోమాట్లాడాలన్నా చీదరించుకోవడం, తలబిరుసుగా సమాధానాలివ్వడం, గుర్రుగాచూడడం, అనవసరమైన డాంబికాలకు పోవడం, ఆవేశాలకు, కయ్యాలకు కాలుదువ్వడం, ఇలా ఎన్నెన్నో చిన్నెలు.
చిత్రమైన జబ్బులు, ఆటంకాలు మనం మన సమాజంలో చూస్తూనే ఉంటాం. వీటన్నింటికీ కారణం ఆధునికపోకడలు. అక్కరలేని అలవాట్లు, అదుపులేని ఆలోచనలు, జీవితమైతే ఇలాగే సాగిపోవాలనుకుని శ్రమలేని సుఖ సౌఖ్యాలను వెతుక్కుంటూ, వెంపరలాడుతూ మధ్యలోనే అర్ధాయుష్కులై అంతరించిపోవడం శోచనీయం.
నిజమైన జీవితంలో ఇదీ అని తెలుసుకోలేక, తెలిసినా ఆచరించపోక, చెప్పినా పెడచెవిన పెట్టి చెడిపోయాక కన్నీరు కూడా కరువై కడతేరిపోవడం నాగరికతగా ఊహించుకుని ఉరుకులు, పరుగుల బతుకులో వెనుదిరగని, గమ్యంలేని ప్రయాణం ఈ యువతది. ఇలా నానా రకాలుగా శారీరక, మానసిక దురభ్యాసాలవల్ల ఎన్నెన్నో మానసిక వ్యాధులు, అంటువ్యాధులు రెండూ కలిసి జీవితాంతం వేదనకు గురిచేయడం సమాజంలో మనం చూస్తూనే ఉన్నాం.
ఇలాంటి రోగాలు ఎన్నాళ్ళయినా తగ్గకుండా బాధిస్తున్నట్లయితే కింది చిట్కాను పైవాటన్నింటికీ ఉపశమనంగా అనుసరించాల్సి ఉంటుంది.
మందు తయారీ
లవంగచెక్క మూడు తులాలు, నాగకేసరాలు నాలుగు తులాలు, ఏలకులు ఐదు తులాలు, మిరియాలు ఆరు, పిప్పళ్ళు ఆరుతులాలు, శొంఠి ఆరుతులాలు, శుద్ధిచేసిన అశ్వగంధ-పెన్నేరుగడ్డ చూర్ణం సమానంగా చేర్చి పంచదార కలిపిన పాలతో ఒక చెమ్చా కలిపి రో జుకు రెండు మూడు పర్యాయములు సేవిస్తూ ఉండాలి. ఉదయం పరగడుపున , మధ్యాహ్నం, రాత్రి భోజనానికి అరగంట ముందుగా ఈ మందు ఒక 40 రోజులపాటు తీసుకోవాలి.
అశ్వగంధి గడ్డను ముక్కలుగా కొట్టి లోపలి పుల్లల్ని తీసి మెత్తని చూర్ణాన్ని పాలల్లో వేసి బాగా మరిగి ఇగిరాక తీసి నీడలో అరబెట్టి చిన్నమాత్రలుగా చేసుకుని భద్రపరుచుకోవాలి. ఈ మాత్రలను ఉదయం పరగడుపున ఒకటి, మధ్యాహ్నం, సాయంత్రం భోజనానికి అరగంట ముందు ఒక్కొక్కటి చొప్పున వేడినీటితో కలిపి సేవించాలి. ఇలా 40 రోజులపాటు వాడుతూ ఉండాలి. వీటితోపాటు చద్ది తినడం, మాదకద్రవ్యాలు, శీతలపదార్ధాలు పూర్తిగా మానివేసి, సంభోగానికి దూరంగా ఉండాలి. ఈ మందును లోనికి తీసుకోవడంతోపాటు మలాములా చేసుకుని రోజూ వ్రణాలకు, క్రిమి నాశనానికి పైపూతగా కూడా ఉపయోగించవచ్చు. అయితే బట్టలకు తగలకుండా జాగ్రత్తపడాలి.
లేపనానికి మలాము దినుసులు
రేలపువ్వును లేదా లేత చిగుళ్ళను దంచి పొడి చేసి అరపావు ఆముదంలో మూడు చెమ్చాలు కలిపి, అందులో ఒక చెమ్చా పసుపు, కర్పూరం తగినంత, కొద్దిగా గంధకం, కొద్దిగా గుగ్గిలం చేర్చి నిప్పులపైన ఉడికించి పాకానికి వచ్చి ఎర్రగా మారిన తరువాత దించి చల్లార్చి వడగట్టి భద్రపరుచుకోవాలి.
గాయం తగిలిన చోట ముందుగా గాయాన్ని శుభ్రపరిచి మంచి పత్తిని తైలంలోతడిపి వ్రణం లోపలికంతా పెట్టి గట్టిగా కట్టువేయాలి. ప్రతీ 12 గంటలకు ఒకసారి డెటాల్తో గాయాన్ని శుభ్రం చేయడం మళ్ళీ ఇలా చేస్తూ ఉంటే గాయం మానిపోతుంది.