కండ్ల జబ్బులు-కపాలవాతం తగ్గాలంటే ...కేశసంపద పెరగాలంటే....



అన్నిరకాల వయస్సుల్లోనూ అన్ని కాలాల్లోనూ ఈ కంటిజబ్బులు వచ్చే వీలుంది. కాలుష్యం పెరిగిపోయిన ప్రస్తుత వాతావరణంలో ముఖ్యంగా పట్నాల్లో నివసించేవారికి, కర్మాగారాల ప్రాంతాలలో నివసించేవారికి క్షార, మలిన, విష సంబంధిత కల్మషపూరిత మంచినీటిని తాగడం వల్ల ఈ జబ్బులు తప్పక వస్తాయి.

ఈ వ్యాధి సోకినప్పుడు మూర్ఖంగా తోచిన వైద్యాలు చేయించుకోకుండా వెంటనే డాక్టరును సంప్రదించడం మంచిది. మరీ శస్త్రచికిత్స వరకూ రాని కంటిజబ్బులకోసం ప్రధమచికిత్సగా ఈ క్రింది విధానాలను అనుసరించి ఉపశమనం పొందవచ్చు. కడుపులోకి తీసుకునే ఔషధం కూడా తయారుచేసుకుని వాడవచ్చు.

ఔషధం తయారీ విధానం


త్రిఫలచూర్ణం రెండు చెమ్చాలు, ఏలకుల చూర్ణం రెండు చెమ్చాలు, త్రికటుచూర్ణం రెండు చెమ్చాలు, తెల్లగలిజేరు వేరు చూర్ణం రెండు చెమ్చాలు, పటిక రెండు చెమ్చాలు, తులసి ప్రతాల చూర్ణం లేదా ముద్ద తగినంత, అతిమధురం, అమృతవల్లి రెండు చెమ్చాలు, తగినంతగా బెల్లం తీసుకోవాలి.

వీటన్నింటినీ రెండు గ్లాసుల నీళ్ళలో వేసి బాగా మరిగించి అరగ్లాసు మిగిలేవరకూ ఉడికించి చల్లారిన తరువాత వడబోసి ఉంచాలి. దానిలో సగభాగం తేనె కలిపి టానిక్ లాగా మార్చి ఒక శుభ్రంగా కడిగి ఆరబెట్టిన సీసాలో నిల్వ ఉంచాలి. ఈ మందును రోజూ పరగడుపున రెండు చెమ్చాలను అరకప్పు పాలలో కలుపుకుని తాగాలి. వారం రోజుల తరువాత ఈ మందును తిరిగి తయారుచేసుకోవాలి.

మరో మందు


రోజ్ వాటర్ లో కొద్దిగా పాటిక వేసి వెచ్చజేసి చల్లారనిచ్చి సీసాలో నిల్వచేసిన మందును కళ్ళల్లో రెండు చుక్కలుగా రోజుకు మూడుసార్లు వేసుకున్నా కళ్ళజబ్బులు తగ్గుతాయి.

కపాలవాతం మంటలకు మందు తయారీ


సన్నిపాతం ముదిరినవారికి శరీరంలోని వేడి మొత్తం శిరోభాగానికి చేరుకుంటుంది. దీనివల్ల నిద్రలేక తల బరువెక్కి తలంతా మంటగా ఉండి చెమటలు పోస్తూ భగ్గుమంటూ వేదన కలిగిస్తుంది. దీనికి మొదటగా విరేచనాల మందు ఇచ్చి కడుపు ఖాళీచేయించాలి.

ఆ తర్వాత పిప్పళ్ళు, సైంధవలవణం, అతిమధురం, కలకండ, కస్తూరిపసుపు, జీలకర్ర, ధనియాలు, దాల్చినచెక్క, యేలకులు సమంగా తీసి పొడిచేసి, అరచెమ్చా చూర్ణాన్ని బెల్లంకలిపిన పానకంలో వేసుకుని తాగాలి. అరకప్పుకు పైగానే త్రాగవచ్చు. రోజుకు మూడుసార్లు వాడాలి. దీనివల్ల శరీరం శాంతమంది, జీర్ణశక్తి పెరిగి, నోటికి రుచి కలిగి, కళ్ళమంట, తలబరువు తగ్గి హాయిగా నిద్రపడుతుంది.

మరోమందుగా...


నువ్వులనూనె గానీ, కొబ్బరినూనె గానీ తీసుకుని అందులో గుంటగలిజేరురసం, తెల్లగలిజేరు రసం, తులసి, కాకరాకు రసం, వాలివి, గోరింటాకు రసం చేర్చి (పచ్చిది దంచి ముద్దగా చేసినదైనా మంచిదే) నిప్పులపైన పావుగంటసేపు ఉడికించి దించేముందు ముద్దచేసిన వెల్లుల్లిపాయ గుజ్జును, హారతికర్పూరాన్ని కలిపి మరో అయిదు నిముషాల తర్వాత దించాలి.

చల్లారిన తరువాత వడబోసి భద్రపరిచి రోజూ రాత్రులందు తలపైన తగినంత వేసి కపాలానికి గట్టిగా మర్దనచేయాలి. దీనిని ఎవరైననూ వాడవచ్చు. అవసరమనుకుంటే మరో పావునూనెను మళ్ళీ తయారుచేసుకుని వాడవచ్చు.

కేశసంపదకోసం....


ఉసిరికచూర్ణం, గుంటగలిజేరు రసం, నిమ్మరసం, వాలివిరసం వేసిన కొబ్బరినూనెను ఉడికించి రాత్రి వేళల్లో మసాజ్ చేసుకుంటే కేశాలు పెరుగుతాయి.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.