కాయలు సన్నగా పొడవుగా ఉంటాయి. కాయలో ఆరు లేక ఏడు గింజలు ఉంటాయి. దీనిలో ఎరుపు, నలుపు, తెలుపు, గౌర వర్ణమను నాలుగు రకాలు కలవు. వీటినే ఎర్రావాలు, నల్లావాలు, తెల్లావాలు, పచ్చావాలు అంటారు. దీని సర్వాంగములు వైద్యములోనే కాక మామూలు వంటల్లో కూడా ఉపయోగస్తారు.
గుణములు
కారము, చేదు కలిసిన రుచి కలిగి ఉంటాయి. వేడి స్వభావము కలది. విపాకమున కారపు రుచిగా మారును. తీక్ష్ణ గుణము. కఫ వాతములు రెండింటినీ పోగొడుతుంది. రక్తపైత్యమును చేస్తుంది. మిక్కిలి జఠరదీప్తి గల వస్తువు. కుష్ఠురోగము, దురదలు, పొత్తి కడుపులోని నులిపురుగులు హరిస్తుంది.
తెల్లావాలు
కారము, చేదు రుచి కలిగి ఉంటాయి. వేడి చేస్తాయి. వాతరక్తమును చేయును. రుచిని పుట్టిస్తుంది. చర్మరోగములను, ఉబ్బులను, వ్రణములను, విషములను హరిస్తాయి.
ఎర్రావాలు
కారముగాను, చేదుగాను ఉంటాయి. వేడిచేస్తాయి. వాతము, శ్లేష్మము, శూలలు, గుల్మములు, క్రిములు, వ్రణములు పోగొడతాయి. ప్లీహ రోగములు తగ్గిస్తుంది. పిత్తము, తాపము వృద్ధిచేస్తాయి.
ఎర్రావనూనె
తీక్ష్ణమైనది. శీతవీర్యము. వెంట్రుకలకు మేలుచేస్తాయి. దురదలు, చర్మరోగములు, వాతము హరిస్తాయి.
ఎర్రావ ఆకులు : కారము, తీపి రుచులు కలిగి ఉంటాయి. వేడిచేస్తాయి. ఆకలి పుట్టిస్తాయి. క్రిములు, వాతము, కఫము, కంఠరోగములు హరిస్తుంది.
ఆవకూర
విరేచనము చేస్తుంది. ఆమ్లపైత్యమును వృద్ధిచేస్తుంది. గురుగుణము కలిగి ఉంటుంది. కొంచెం తీపిరుచి కలిగి ఉంటుంది. వేడిచేస్తుంది. కఫమును హరిస్తుంది.
వర్ణావాలు
అన్నింటికంటె మిక్కిలి తీక్ష్ణగుణము కలవి. గింజ మిక్కిలి చిన్నది. అమితమైన వేడిచేయును. తాపమును, పైత్యమును కలుగచేయును. గుల్మరోగములు, కృములు, వ్రణములు హరిస్తుంది. ఈ ఆకుకూర గొంతు రోగములకు మంచిది. ఆవపిండి ఉడికించి గుండెకు పట్టువేస్తే శ్లేష్మము కరిగి పట్టువదలుతుంది. రూక్షగుణము కలదగుటచే మలమూత్రములను బంధిస్తుంది.
ఆవనూనె
- కటుతిక్తరసములు, ఉష్ణవీర్యము కలది. గ్రాహి, కఫము, వాతము హరిస్తుంది. నులిపురుగులు, పాండురోగము తగ్గిస్తుంది. పిత్తము ప్రకోపింపచేస్తుంది. కర్ణరోగములు, వాతవ్యాధులు పోగొడుతుంది. దురదలు, కుష్ఠు, క్రొవ్వు, వ్రణములు, వాతరక్తము, శుక్రము హరిస్తుంది. నేత్రములకు మంచిది. పిత్తముపెంచి తాపము కలిగిస్తుంది.
ఈ ఆవాలను పోపులలోను, పిండినూరి కూరలలోను, పచ్చళ్ళు చేయడానికి ఉపయోగిస్తారు. - ఆవనూనె, కానుగనూనె, చేదుబీర గింజలనుండి తీసిన నూనెలు కలిపి రాసినట్లయితే సకలకుష్ఠులు హరిస్తాయి.
ఆవనూనెను ప్రతిదినము పైన రాయడం, పోపులు పెట్టుకోవడం, ఆవనూనెతో పిండివంటలు చేయడం చేస్తూ ఉంటే శ్లీపదరోగము తగ్గుతుంది. ఆవనూనె తరచుగా ఉపయోగించు దేశములో బోదకాలు రోగాలు రావు. - పెద్ద ఆవాలు, కానుగ గింజలు, గొర్రెమూత్రముతో మెత్తగా నూరి గుటికలు చేసి నీడలో ఎండనిచ్చి కంటికి కలికము వేసిన ఘోరమైన అపస్మార, ఉన్మాదములు హరిస్తాయి.
- ఆవాల చూర్ణము, ఉప్పు కలిపి పళ్ళుతోమితే దంతరోగములు శమిస్తాయి.
- ఆవాలు, మునగచెక్క మెత్తగా నూరి పట్టువేస్తే గూబవాపులు హరిస్తాయి.
- తెల్లావాలు ముద్దగా నూరి అరిచేతులకు, అరికాళ్ళకు మర్దనాచేస్తే వాతరక్తవ్యాధి పోతుంది.