వీనిలో చిన్నాముదపు చెట్టునకే చిట్టాముదమని పేరు. ఇదే శ్రేష్టమైనది. ఆకుకు ఐదు పొడవైన కొనలు కలిగి అరచేతిలా ఉంటాయి. ఆకులకు పొడవైన కాడలుంటాయి. కాయ మూడు పలకలు కలిగి ఉంటుంది. కాయలోపల మూడు గింజలుంటాయి. కాయపైన గరుకుతనము గల మృదువైన ముళ్ళు ఉంటాయి. కాయ బాగా పండిన తరువాత పగులుతుంది. అవి కోసి ఎండబెడితే గింజలు ఊడి క్రిందపడతాయి. గింజలపైన దళసరి పెంకు ఉంటుంది. దీని ఆకులు పైకే గాని కిందకు వాలవు.
ఆముదపు చెట్టు ఉపయోగాలు
చేదు, తీపి కలిసిన రుచి కలిగి ఉంటాయి. వేడి చేస్తాయి. మిక్కిలి వాతహరము, ఉదరరోగములు, గుల్మరోగములు, పొత్తికడుపులోని శూలలు, అండవృది లను హరిస్తాయి. రక్తవికారములను అన్నింటినీ తగ్గిస్తుంది. పండు కొంచెం తీపిగా ఉంటుంది. వీర్యవృద్ధిని చేస్తుంది. వాతపిత్తములను రెండింటినీ హరిస్తుంది. దీనిలో క్షారగుణము ఉంది.
తెల్లాముదము కలిగిన ఆముదము చెట్టు కారము, చేదు రుచి కలిగి ఉంటుంది. వేడి చేస్తుంది. ఎర్రాముదము కలిగిన చెట్టు కూడా ఇదే గుణము కలిగి విశేషముగా వాపులను తగ్గిస్తుంది. రక్తప్రదరము, రక్తగుల్మము, పాండురోగము, దగ్గు, జ్వరము, కఫము, అరోచకము తదితర వాటిని తగ్గిస్తుంది.
ఆముదపు ఆకు వాతహారి, కఫ, క్రిములను పోగొడుతుంది. మూత్ర రోగములను అణుస్తుంది. పైత్యమును, రక్తమును ప్రకోపింపచేస్తుంది. ఆముదపు చిగుళ్ళు గుల్మములను, పొత్తికడుపులోని శూలలను తగ్గిస్తుంది. కఫవాతములను, క్రిములను, వివిధ అండవృద్ధులను శమింపచేస్తుంది. ఆముదపు పండు మిక్కిలివేడిచేస్తుంది. గుల్మములు, శూలలను, వాతమును తగ్గిస్తుంది. ఉదరములు, మూలశంకలు పోగొడుతుంది. మంచి జఠరదీప్తి నిస్తుంది. కారపురుచిగా ఉంటుంది. ఆముదపు పండు గుంజు విరేచనకారి.