
నేలతాడి ఉపయోగాలు
నేలతాడి వేర్లను వైద్యపరంగా ఉపయోగిస్తారు. ఈ మొక్క వేళ్ళలో యుక్కాజెనిన్, లైకోరిన్ వంటి రసాయనాలు ఉంటాయి. ఈ మొక్క వేర్లను మూలశంఖ, ఆస్థమా, కామెర్లు, విరోచనాలు, గనేరియా, తేలుకాటు, స్త్రీల ఋతుసంబంధ వ్యాధులు, లైంగిక పటుత్వం వంటి వాటికి ఉపయోగిస్తారు.ఈ మొక్క వేర్లు, పిల్లితీగల వేర్లు, బోడతరం, తిప్పతీగ, మోదుగ గింజలు సమపాళ్ళలో కలిపి పొడి చేసుకుని, దానిని తేనెతో కలిపి లోనికి తీసుకుంటే ముసలితనంలో వచ్చే నీరసం తగ్గుతుంది.నేలతాడి మొక్క నుండి తయారుచేసిన ముషల్యాది చూర్ణాన్ని పాలతో వాడితే తెల్లబట్ట తగ్గి ఋతుక్రమం సరి అవుతుంది. వేరు పొడిని గాయాలు, కురుపులపైన పూస్తే నయమవుతాయి. వేరు పొడిని పాలతో తీసుకుంటే నపుంసకత్వం పోతుంది. దేహానికి శక్తినిస్తుంది. వాత, పిత్త వ్యాధులను తగ్గిస్తుంది. వేరును పంచదారతో కలిపి తీసుకుంటే కామెర్లు తగ్గుతాయి. పత్రాల రసాన్ని లేదా వేరును నూరి, గోరుచుట్టుపై పూస్తే తగ్గుతంది. వేరు రసాన్ని ముక్కులో పోస్తే ముక్కునుండి రక్తం కారడం, ఆగుతుంది. వేరు పేస్టును, ఆముదం నూనెతో కలిపి నుదుటిపై మర్దనాచేస్తే తలపోటు తగ్గుతుంది.
ఆయుర్వేద మందులల్లో నేలతాడి: విదార్యాదిఘృతం, విదార్యాది లేహ్యం, మర్మగుళిక, ముషల్యాది చూర్ణం వంటి ఆయుర్వదే మందుల తయారీలో నేలతాడిని వినియోగిస్తారని వైద్యులు చెబుతున్నారు.